సివిల్స్‌లో అత్యధిక ప్రతిభ కనబరిచిన వారంతా పెట్టి పుట్టిన వాళ్లేం కాదు. ఐదు రూపాయలకి టీ అమ్ముకునే చాయ్‌వాలా నుంచి, రోజుకూలీ వరకు కష్టజీవుల కుటుంబాల్లోంచి పుట్టుకొచ్చిన వారే! చదువుకు కలిమితో పని లేదనీ.. కష్టపడే తత్వం, సాధించగలనన్న నమ్మకం ఉంటే చాలుననీ నిరూపించిన వాళ్లే వీళ్లంతా. ఆ కోవలోకే వస్తారు 2015లో తమిళనాడు సివిల్స్ టాపర్‌గా నిలిచిన పశువుల కాపరి వన్మతి. పశువుల్ని మేపుకుంటూ కలెక్టరుగా ఎదిగిన ఆమె జీవితం సివిల్స్ స్వాప్నికులకు ఆదర్శం.మహారాష్ట్ర నందర్‌బార్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న వన్మతిని ఎవరైనా ‘మీ హాబీస్ ఏంటి?’ అనడిగితే.. ‘తనకు పశువులను మేపడమంటే చాలా ఇష్టం’ అని చెబుతారు! ఎందుకంటే జీవితమెంత కష్టమైనదైనా ఇష్టంగా మలుచుకోవడం ఆమెకు తెలుసు కనుక. కష్టం లేకుండా సుఖం దక్కదని ఆమె నమ్ముతారు కనుక. చదువుకుంటూనే ఆమె పశువులను కాసేందుకు వెళ్లింది కనుక.
స్కూలు నుంచి రాగానే
కలలూ, కన్నీళ్లూ కలగలిసిన జీవితం వన్మతిది. ఆమెకు, ఆ ఇంటికీ నాలుగు పశువులే జీవనా ఆధారం. కుటుంబ పోషణ కోసం వన్మతి తల్లి పాడిని నమ్ముకుంది. తండ్రి చెన్నయ్యప్ప డ్రైవర్. ఆయనకు వచ్చే ఆదాయం అంతంత మాత్రమే కావడంతో తల్లి పశుపోషణలో తనవంతు సాయంగా వన్మతి సాయంత్రాలు పశువుల ఆలనాపాలనా చూసుకునేది. చదువుని ఎంతగా ప్రేమిస్తుందో తన ఇంట్లో అమ్మ కష్టాన్నీ అంతే ఆనందంగా పంచుకుంటుంది వన్మతి. పలకా బలపంతో బడికెళ్లిన ప్పట్నుంచి నుంచి సివిల్స్ రాసే వరకూ చదువూ, గేదెలే ఆమె లోకం. ఇంటికి రాగానే పుస్తకాల సంచీ కొయ్యకి తగిలించి పశువులను తోలుకొని వాటితో పాటే ఆరు బయట ఆహ్లాదాన్ని వెతుక్కుంటూ వెళ్లేది.
కలెక్టరమ్మను చూశాక
వన్మతి స్వగ్రామమైన తమిళనాడులోని ఇండోర్ జిల్లా సత్యమంగళం. బళ్లో ఉన్నా, పచ్చికబయళ్లలో ఉన్నా ఆమె కలలు కనడం మాత్రం ఆగలేదు. చిన్నప్పటినుంచి ఐఏఎస్ కావాలనే కోరిక నిరంతరం చదువుని ప్రేమించేలా చేసింది. ఇంట్లోనూ, అడవిలోనూ ఓ పాఠ్య పుస్తకం ఆమె వెంట ఉండేది. ఓ రోజు వాళ్ల కాలేజీకి వచ్చిన జిల్లా కలెక్టరు మాటలూ, ఆదరణ కూడా వన్మతి ఆశలకు మరింత బలం చేకూర్చాయి. తన కాలేజీకొచ్చిన మహిళా కలెక్టరు గారిని చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకూ అంతా గౌరవించడం వన్మతికి గొప్పగా అనిపించింది. అంతే. తను కూడా కలెక్టర్ అవ్వాలని ఆ క్షణమే అనుకుంది. ఎందులోనైనా మంచీ, చెడూ రెండూ ఉంటాయి. కావాల్సిన మంచిని ఎంచుకొని చెడుని వదిలేయాలని వన్మతికి ఆమె తల్లి చెప్పేది. అంతే కాదు తను చూసిన టీవీ సీరియల్ ‘గంగా, జమునా, సరస్వతి’ నుంచి కూడా ఐఏఎస్ కావాలనే స్ఫూర్తి పొందారు వన్మతి. ఇంటర్ తర్వాత కూడా చదువెందుకూ పశువులు కాసుకోడానికి ఈ చదువు చాలదా అన్నవాళ్లే.. వన్మతి బంధువులు, చుట్టపక్కల వాళ్లూ! వాళ్లతోపాటు ఆడపిల్లలకు పెళ్లే పరమార్థం అని బోధించే వాళ్లు కూడా చివరికి వన్మతి పట్టుదల ముందు వీగిపోయారు.
ఎవరొద్దన్నా వినలేదు
మంచి మార్కులతో డిగ్రీ పూర్తిచేసిన వన్మతి ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగంలో చేరింది. ఆశయాలను సాధించుకునేందుకు డబ్బు అవసరమే తప్ప డబ్బే సర్వస్వం కాదన్నది వన్మతి అభిప్రాయం. నిజంగా డబ్బే ముఖ్యమనుకుంటే ఆమె ఏ ఇతర ఉద్యోగాలనో సంపాదించుకోగలదు. కానీ ఆమె లక్ష్యం అది కాదు. జిల్లా కలెక్టరై పదిమందికి సహాయపడాలని అనుకుంది. అందుకే ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే, సివిల్స్ ప్రిపరేషన్‌ని కొనసాగించింది. వన్మతి తండ్రి, తల్లీ ఇద్దరూ వన్మతి ఇష్టాలని గౌరవించారు. పెద్దగా చదువుకోని ఆ తల్లిదండ్రులు కూతురి చదువుకోసం ఎంతైనా కష్టపడాలనుకున్నారు. చుట్టుపక్కల వాళ్ల మాటలతో ఆమె కలలు చెదరకుండా కాపాడారు. మనసుని చదువుపై కేంద్రీకరించమన్నారు. పేదరికం అడ్డుపడుతున్నా, తమ కష్టార్జితంతో కన్నకూతురి అవసరాలను తీర్చారు. ఆమె చదువుతానన్న పుస్తకాన్నల్లా కొనిచ్చారు. వారి ప్రోత్సాహంతో ఆమె తన లక్ష్యంపై గురిపెట్టింది. దృష్టంతా చదువుపైనే. తొలిసారి యుపిపిఎస్‌సీ పరీక్షల్లో అపజయంతో పరీక్షలో కష్టాన్ని అంచనా వేసుకుంది వన్మతి. మరింత కష్టపడి చదివింది. రెండోసారి కూడా రాలేదని అధైర్యపడలేదు. అపజయాన్నుంచే ధైర్యాన్ని అందిపుచ్చుకుంది. కసిగా చదివింది. గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడింది. మూడోసారి విజయం తనని వెతుక్కుంటూ వచ్చింది. సివిల్స్‌లో 152 ర్యాంకుతో తమిళనాడు రాష్ట్రానికీ, తన ఊరికీ కీర్తిని తెచ్చిపెట్టింది వన్మతి.
తండ్రికి తోడుగా ఆసుపత్రిలో
ఇంటర్వ్యూ కి ఇక రెండు రోజులే ఉన్నప్పుడు ఆమె తన తండ్రితో ఐసియూలో ఉంది. జీవితమంతా డ్రైవర్‌గా గడిపిన తండ్రి వెన్నెముకకి వచ్చిన వ్యాధితో ఐసీయూలో పోరాడుతూనే తన కూతుర్ని చిర్నవ్వుతో ఇంటర్వ్యూకి సాగనంపారాయన. 2015 యుపిఎస్‌సీలో ర్యాంకు సాధించి లాల్‌బహదూర్ శాస్త్రి ట్రైనింగ్ అకాడమీలో శిక్షణని పూర్తిచేసుకొన్న వన్మతికి ఫస్ట్ పోస్టింగ్ మహారాష్ట్రలో వచ్చింది. ప్రస్తుతం నందర్‌బార్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న వన్మతి తన ప్రజాసేవా సంకల్పాన్ని అక్షరాలా అమలు చేస్తున్నారు. ఒక్క అపజయంతోనే కుంగిపోయే యువతరానికి వన్మతి పట్టుదల ఒక స్ఫూర్తి.
– అరుణ
Comments
Please login to add a commentAdd a comment