Civils toper
-
చరిత్ర సృష్టించిన వయనాడ్ యువతి
తిరువనంతపురం: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళ నుంచి పోటీచేస్తున్న వయనాడ్‌కు చెందిన గిరిజన యువతి శ్రీధన్య సురేశ్ సివిల్స్‌లో ర్యాంకు తెచ్చుకున్నారు. కేరళ నుంచి ఈ ప్రతిష్టాత్మక సర్వీసుకు ఎంపికైన తొలి గిరిజన యువతిగా ఆమె గుర్తింపు పొందారు. శుక్రవారం యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో 22 ఏళ్ల శ్రీధన్యకు 410వ ర్యాంక్ దక్కింది. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ రాహుల్ ట్వీట్ చేశారు. ‘ శ్రీధన్య కష్టపడేతత్వం, అంకితభావం ఆమెకు సివిల్స్ ర్యాంకు తెచ్చిపెట్టాయి. ఆమె ఎంచుకున్న రంగంలో విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ అని రాహుల్ అన్నారు. కేరళ ముఖ్యమంత్రి పి.విజయన్ ఆమెతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్‌లో ‘ తన సామాజిక వెనకబాటుతో పోరాడి శ్రీధన్య సివిల్స్‌లో మెరిశారు. ఆమె విజయం భవిష్యత్తులో ఇతరులకు స్ఫూర్తినిస్తుంది’ అని పేర్కొన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగం వద్దనుకుని.. వయనాడ్‌లోని పోజుతానాకు చెందిన శ్రీధన్య మూడో ప్రయత్నంలో విజయం సాధించారు. గతంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినా వదిలేసింది. కేరళ గిరిజన విభాగంలో ప్రాజెక్టు అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. ‘అత్యంత వెనకబడిన జిల్లా నుంచి వచ్చాను. ఇక్కడ గిరిజన జనాభా చాలా ఉన్నా మా నుంచి ఒక్కరూ ఐఏఎస్‌కు ఎంపిక కాలేదు. నా విజయం భావి తరాలకు స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నా. నా పీజీ పూర్తయిన తరువాత తొలిసారి ఓ ఐఏఎస్ అధికారిని ప్రత్యక్షంగా చూశా. ఆయన కోసం ప్రజలు ఎదురుచూడటం, సిబ్బందితో ఆయన అక్కడికి రావడం సివిల్స్ సాధించాలన్న నా చిన్న నాటి కలను తట్టిలేపాయి’ అని శ్రీధన్య గుర్తుకుచేసుకున్నారు. ఆమె కాలికట్ విశ్వవిద్యాలయంలో అప్లయిడ్ జువాలజీలో పీజీ చదివారు. -
సివిల్స్ టాపర్ ప్రేమకథ
న్యూఢిల్లీ: తన విజయంలో గర్ల్‌ఫ్రెండ్ పాత్ర కూడా ఉందని సివిల్స్ టాపర్ కనిషక్ కటారియా చేసిన ప్రకటనతో ట్విట్టర్ హోరెత్తిపోతోంది. సంప్రదాయానికి భిన్నంగా ఆయన అభ్యుదయభావంతో స్పందించారని నెటిజెన్లు పొడిగారు. కెరీర్లో విజయం సాధించేందుకు ప్రేయసి అడ్డుకాదని కొందరు వ్యాఖ్యానించారు. ‘ఈ క్షణం ఎంతో ఆశ్చర్యకరం. సివిల్స్‌లో తొలి ర్యాంకు సాధిస్తానని అనుకోలేదు. ఈ విషయంలో మద్దతుగా నిలిచి నైతిక స్థైర్యాన్నిచ్చిన నా తల్లిదండ్రులు, సోదరి, గర్ల్‌ఫ్రెండ్‌కు కృతజ్ఞతలు’ అని కటారియా శనివారం విలేకర్లతో అన్నారు. తన విజయం పట్ల గర్ల్‌ఫ్రెండ్‌కు బహిరంగంగా ధన్యవాదాలు చెప్పిన తొలి సివిల్స్ టాపర్ కటారియానే అని భావిస్తున్నారు. ‘మన దేశంలో చదువుకునే పిల్లలు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ చదువుపైనే దృష్టిపెట్టాలి. కానీ ఆలిండియా సివిల్స్ టాపర్ కటారియా తన ప్రేయసికి ధన్యవాదాలు చెప్పారు’ అని ఒకరు అనగా..యూపీఎస్సీ పరీక్ష పాసవ్వడానికి ప్రేయసి అడ్డుకాదని మరోసారి నిరూపితమైందని మరొకరు ట్వీట్ చేశారు. ఇలా గర్ల్‌ఫ్రెండ్‌కు ధన్యవాదాలు చెప్పే ధైర్యం ఎందరికి ఉంటుందని మరొకరు ప్రశ్నించారు. ‘ప్రేయసి, సంబంధాలు కెరీర్ లక్ష్యాల నుంచి దృష్టి మరలుస్తాయని అన్నవారెక్కడ?’ అని మరొకరు ప్రశ్నించారు. జైపూర్‌కు చెందిన కటారియా తండ్రి సాన్వర్ వర్మ, అంకుల్ కేసీ వర్మ ఐఏఎస్ అధికారులే కావడం గమనార్హం. -
లేమితో చెలిమి
సివిల్స్‌లో అత్యధిక ప్రతిభ కనబరిచిన వారంతా పెట్టి పుట్టిన వాళ్లేం కాదు. ఐదు రూపాయలకి టీ అమ్ముకునే చాయ్‌వాలా నుంచి, రోజుకూలీ వరకు కష్టజీవుల కుటుంబాల్లోంచి పుట్టుకొచ్చిన వారే! చదువుకు కలిమితో పని లేదనీ.. కష్టపడే తత్వం, సాధించగలనన్న నమ్మకం ఉంటే చాలుననీ నిరూపించిన వాళ్లే వీళ్లంతా. ఆ కోవలోకే వస్తారు 2015లో తమిళనాడు సివిల్స్ టాపర్‌గా నిలిచిన పశువుల కాపరి వన్మతి. పశువుల్ని మేపుకుంటూ కలెక్టరుగా ఎదిగిన ఆమె జీవితం సివిల్స్ స్వాప్నికులకు ఆదర్శం.మహారాష్ట్ర నందర్బార్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న వన్మతిని ఎవరైనా ‘మీ హాబీస్ ఏంటి?’ అనడిగితే.. ‘తనకు పశువులను మేపడమంటే చాలా ఇష్టం’ అని చెబుతారు! ఎందుకంటే జీవితమెంత కష్టమైనదైనా ఇష్టంగా మలుచుకోవడం ఆమెకు తెలుసు కనుక. కష్టం లేకుండా సుఖం దక్కదని ఆమె నమ్ముతారు కనుక. చదువుకుంటూనే ఆమె పశువులను కాసేందుకు వెళ్లింది కనుక. స్కూలు నుంచి రాగానే కలలూ, కన్నీళ్లూ కలగలిసిన జీవితం వన్మతిది. ఆమెకు, ఆ ఇంటికీ నాలుగు పశువులే జీవనా ఆధారం. కుటుంబ పోషణ కోసం వన్మతి తల్లి పాడిని నమ్ముకుంది. తండ్రి చెన్నయ్యప్ప డ్రైవర్. ఆయనకు వచ్చే ఆదాయం అంతంత మాత్రమే కావడంతో తల్లి పశుపోషణలో తనవంతు సాయంగా వన్మతి సాయంత్రాలు పశువుల ఆలనాపాలనా చూసుకునేది. చదువుని ఎంతగా ప్రేమిస్తుందో తన ఇంట్లో అమ్మ కష్టాన్నీ అంతే ఆనందంగా పంచుకుంటుంది వన్మతి. పలకా బలపంతో బడికెళ్లిన ప్పట్నుంచి నుంచి సివిల్స్ రాసే వరకూ చదువూ, గేదెలే ఆమె లోకం. ఇంటికి రాగానే పుస్తకాల సంచీ కొయ్యకి తగిలించి పశువులను తోలుకొని వాటితో పాటే ఆరు బయట ఆహ్లాదాన్ని వెతుక్కుంటూ వెళ్లేది. కలెక్టరమ్మను చూశాక వన్మతి స్వగ్రామమైన తమిళనాడులోని ఇండోర్ జిల్లా సత్యమంగళం. బళ్లో ఉన్నా, పచ్చికబయళ్లలో ఉన్నా ఆమె కలలు కనడం మాత్రం ఆగలేదు. చిన్నప్పటినుంచి ఐఏఎస్ కావాలనే కోరిక నిరంతరం చదువుని ప్రేమించేలా చేసింది. ఇంట్లోనూ, అడవిలోనూ ఓ పాఠ్య పుస్తకం ఆమె వెంట ఉండేది. ఓ రోజు వాళ్ల కాలేజీకి వచ్చిన జిల్లా కలెక్టరు మాటలూ, ఆదరణ కూడా వన్మతి ఆశలకు మరింత బలం చేకూర్చాయి. తన కాలేజీకొచ్చిన మహిళా కలెక్టరు గారిని చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకూ అంతా గౌరవించడం వన్మతికి గొప్పగా అనిపించింది. అంతే. తను కూడా కలెక్టర్ అవ్వాలని ఆ క్షణమే అనుకుంది. ఎందులోనైనా మంచీ, చెడూ రెండూ ఉంటాయి. కావాల్సిన మంచిని ఎంచుకొని చెడుని వదిలేయాలని వన్మతికి ఆమె తల్లి చెప్పేది. అంతే కాదు తను చూసిన టీవీ సీరియల్ ‘గంగా, జమునా, సరస్వతి’ నుంచి కూడా ఐఏఎస్ కావాలనే స్ఫూర్తి పొందారు వన్మతి. ఇంటర్ తర్వాత కూడా చదువెందుకూ పశువులు కాసుకోడానికి ఈ చదువు చాలదా అన్నవాళ్లే.. వన్మతి బంధువులు, చుట్టపక్కల వాళ్లూ! వాళ్లతోపాటు ఆడపిల్లలకు పెళ్లే పరమార్థం అని బోధించే వాళ్లు కూడా చివరికి వన్మతి పట్టుదల ముందు వీగిపోయారు. ఎవరొద్దన్నా వినలేదు మంచి మార్కులతో డిగ్రీ పూర్తిచేసిన వన్మతి ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగంలో చేరింది. ఆశయాలను సాధించుకునేందుకు డబ్బు అవసరమే తప్ప డబ్బే సర్వస్వం కాదన్నది వన్మతి అభిప్రాయం. నిజంగా డబ్బే ముఖ్యమనుకుంటే ఆమె ఏ ఇతర ఉద్యోగాలనో సంపాదించుకోగలదు. కానీ ఆమె లక్ష్యం అది కాదు. జిల్లా కలెక్టరై పదిమందికి సహాయపడాలని అనుకుంది. అందుకే ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే, సివిల్స్ ప్రిపరేషన్ని కొనసాగించింది. వన్మతి తండ్రి, తల్లీ ఇద్దరూ వన్మతి ఇష్టాలని గౌరవించారు. పెద్దగా చదువుకోని ఆ తల్లిదండ్రులు కూతురి చదువుకోసం ఎంతైనా కష్టపడాలనుకున్నారు. చుట్టుపక్కల వాళ్ల మాటలతో ఆమె కలలు చెదరకుండా కాపాడారు. మనసుని చదువుపై కేంద్రీకరించమన్నారు. పేదరికం అడ్డుపడుతున్నా, తమ కష్టార్జితంతో కన్నకూతురి అవసరాలను తీర్చారు. ఆమె చదువుతానన్న పుస్తకాన్నల్లా కొనిచ్చారు. వారి ప్రోత్సాహంతో ఆమె తన లక్ష్యంపై గురిపెట్టింది. దృష్టంతా చదువుపైనే. తొలిసారి యుపిపిఎస్సీ పరీక్షల్లో అపజయంతో పరీక్షలో కష్టాన్ని అంచనా వేసుకుంది వన్మతి. మరింత కష్టపడి చదివింది. రెండోసారి కూడా రాలేదని అధైర్యపడలేదు. అపజయాన్నుంచే ధైర్యాన్ని అందిపుచ్చుకుంది. కసిగా చదివింది. గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడింది. మూడోసారి విజయం తనని వెతుక్కుంటూ వచ్చింది. సివిల్స్‌లో 152 ర్యాంకుతో తమిళనాడు రాష్ట్రానికీ, తన ఊరికీ కీర్తిని తెచ్చిపెట్టింది వన్మతి. తండ్రికి తోడుగా ఆసుపత్రిలో ఇంటర్వ్యూ కి ఇక రెండు రోజులే ఉన్నప్పుడు ఆమె తన తండ్రితో ఐసియూలో ఉంది. జీవితమంతా డ్రైవర్‌గా గడిపిన తండ్రి వెన్నెముకకి వచ్చిన వ్యాధితో ఐసీయూలో పోరాడుతూనే తన కూతుర్ని చిర్నవ్వుతో ఇంటర్వ్యూకి సాగనంపారాయన. 2015 యుపిఎస్సీలో ర్యాంకు సాధించి లాల్‌బహదూర్ శాస్త్రి ట్రైనింగ్ అకాడమీలో శిక్షణని పూర్తిచేసుకొన్న వన్మతికి ఫస్ట్ పోస్టింగ్ మహారాష్ట్రలో వచ్చింది. ప్రస్తుతం నందర్బార్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న వన్మతి తన ప్రజాసేవా సంకల్పాన్ని అక్షరాలా అమలు చేస్తున్నారు. ఒక్క అపజయంతోనే కుంగిపోయే యువతరానికి వన్మతి పట్టుదల ఒక స్ఫూర్తి. – అరుణ -
‘సివిల్స్’లో ఓరుగల్లు కెరటం
కాజీపేట అర్బన్ : చారిత్రక ఓరుగల్లు నగర యువకుడు ఎడవెల్లి అక్షయ్‌కుమార్ సివిల్స్‌లో ప్రతిభ చాటాడు. తాత, తండ్రి స్ఫూర్తితో రక్షకభటుడిగా దేశానికి సేవలందించాలనే లక్ష్యంతో సివిల్స్‌లో ఐఏఎస్‌కు అవకాశం ఉన్నా ఐపీఎస్‌ను ఎంచుకున్నాడు. 2017 జూన్‌లో ప్రిలిమినరీ, అక్టోబర్‌లో మెయిన్స్‌కు హాజరయ్యాడు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 15 వరకు ఇంటర్వ్యూల్లో పాల్గొని శుక్రవారం వెలువడిన సివిల్స్ ఫలితాల్లో 624వ ర్యాంకు సాధించి ఓరుగల్లు కీర్తిని చాటాడు. ఈ సందర్భంగా ఎడవెల్లి అక్షయ్‌కుమార్ ఏమంటున్నాడో ఆయన మాటల్లోనే.. తాత, నాన్నే స్ఫూర్తి.. మా తాత, నాన్న ఇద్దరూ పోలీస్‌శాఖలో పనిచేస్తున్నారు. మా నాన్న స్టేషన్‌ఘన్‌పూర్‌లో పనిచేస్తున్న తరుణంలో ఒక రోజు నన్ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాడు. నాడు నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో పోలీసులు వారిని నిలువరించేందుకు చేపట్టే వ్యూహాలు, చర్యలు చాలా బాగా నచ్చాయి. నాడే పోలీసుగా మారాలని నిర్ణయించుకున్నా. నాన్న ప్రస్తుతం మడికొండ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. దుబాయ్‌లో రూ.40 లక్షల అవకాశం వచ్చినా.. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన ఎడవెల్లి దయాకర్, స్రవంతి నా తల్లిదండ్రులు. బాలసముద్రంలోని గురుకుల్ పాఠశాలలో పదో తరగతి వరకు, ఎస్సార్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, భూపాల్‌లోని నిట్‌లో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. బీటెక్ పూర్తి చేస్తున్న తరుణంలోనే క్యాంపస్ ఇంటరŠూయ్వల్లో ఎంపికై రూ.40 లక్షల ప్యాకేజీకిగాను దుబాయ్‌లోని పెట్రోలియం కంపెనీలో అవకాశం వచ్చింది. కానీ.. ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీలో చేరాను. సివిల్స్‌లో 624వ ర్యాంకు సాధించాను. అకాడమీ తోడ్పాటునిచ్చింది.. ఐపీఎస్ సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీలో చేరాను. సివిల్స్ 2004, 2016 ర్యాంకర్, ఆల్ ఇండియా పొలిటికల్ సైన్స్ టాపర్ బాలలత, మేడం స్ఫూర్తి. ఆమె ప్రోత్సాహంతో అత్యుత్తమ కోచింగ్‌ను అందుకున్నాను. ప్రతి రోజు 9 గంటల పాటు జనరల్, ఆప్షనల్, మెయిన్స్‌లో శిక్షణ అందించేవారు. నేను మరో నాలుగు గంటల పాటు ప్రత్యేకంగా చదివేవాడిని. నాకు సివిల్స్‌లో 624వ ర్యాంకు సాధించడానికి సీఎస్బీ అకాడమి ఎంతగానో తోడ్పాటునందించింది. ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తా.. మవోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో సేవలందిస్తా. కేఎస్.వ్యాస్, ఉమేష్‌చంద్ర స్ఫూర్తితో ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తా. మెరుగైన సమాజ నిర్మాణానికి, దేశరక్షణకు, నక్సలైట్ రహిత సమాజానికి సేవలందిస్తా. -
స్మార్ట్‌గా చదివితే ర్యాంక్ మీదే..
నిద్రను త్యాగం చేయక్కర్లేదు ఫేస్బుక్, వాట్సప్‌కు దూరం కానక్కర్లేదు.. తల్లిదండ్రులూ ఒత్తిడి చేయొద్దు సివిల్స్ టాపర్ టీనా దాబీ టీనా దాబీ.. 2015 సివిల్స్ ఆల్ ఇండియా మొదటిర్యాంక్ సాధించడం ద్వారా అనేక రికార్డులు నెలకొల్పింది. దేశంలో తొలిసారిగా మొదటి ర్యాంక్ సాధించిన దళిత మహిళగా రికార్డు సృష్టించింది. అతి చిన్న వయసులోనే ఈ ర్యాంకును సాధించడం మరో విశేషం. అలాగే తొలి ప్రయత్నంలోనే ర్యాంకు కొట్టేసింది. డిగ్రీ తర్వాత నేరుగా సివిల్స్ ఎంపికై మరో రికార్డు నెలకొల్పింది. ఇలా టీనా గురించి చెబుతూపోతే రికార్డులే రికార్డులు. ఈ రికార్డుల రాణిని సోమవారం విజయవాడ నగరం ఘనంగా సత్కరించింది. చక్కటి ప్రణాళికతో స్మార్ట్‌గా చదివితే క్లిష్టమైన సివిల్స్ ర్యాంకు మీ సొంతమవుతుందని ఆమె చెబుతోంది. విద్యార్థుల భవిష్యత్ కోసం టీనా దాబీ చెప్పిన మరికొన్ని విశేషాలు ఆమె మాటల్లోనే.. సాక్షి, అమరావతి: సివిల్స్ పరీక్షల కోసం నిద్రాహారాలను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. చక్కటి ప్రణాళికతో స్మార్ట్‌గా చదివితే చాలు ర్యాంకులు వాతంట అవే వస్తాయి. నేను ఇదే సూత్రాన్ని పాటించాను. సివిల్స్ కోసం నా ఇష్టాలను వేటినీ వదులు కోలేదు. చివరికి వాట్సప్, ఫేస్‌బుక్‌లకూ దూరం కాలేదు. కానీ ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చేశాను. రోజుకు ఐదు ఆరు గంటలు ఏకాగ్రతతో చదివాను. అలసట వచ్చినప్పుడు రిలాక్స్ కోసం వాట్సప్, ఫేస్బుక్ చేసేదాన్ని. అంతే కానీ ఒక చేత్తో మొబైల్, మరో చేతిలో పుస్తకంతో కూర్చునేదాన్ని కాదు. కావల్సినంత సేపు నిద్రపోయేదాన్ని. ప్రభాస్‌కు వీరాభిమానిని.. నేను తెలుగు హీరో ప్రభాస్‌కి వీరాభిమానిని. బాహుబలి సినిమా చూడటం కోసం రెండు మూడు రోజులు ముందుగానే చదువు కోసం ఎక్కువ సమయం కేటాయించాను. ఇలా సమయాన్ని స్మార్ట్‌గా వినియోగించుకునేదాన్ని. నా విజయంలో మూడు అంశాలు కీలకపాత్ర పోషించాయి. అవి కష్టపడి పని చేయడం, చక్కటి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం, ఓపిగ్గా ఉండటం. ఈ మూడు అంశాలను పాటిస్తే ర్యాంకులు సులభంగా పొందవచ్చు. నాకు ఇంటర్మీడియెట్‌లోకి వచ్చే వరకు సివిల్స్ గురించే తెలియదు. తొలిసారిగా ఇంటర్ మొదటి సంవత్సరంలో సివిల్స్ గురించి తెలిశాక అప్పటి నుంచే నేను ఒక చక్కటి ప్రణాళికను సిద్ధం చేసుకున్నా. కేవలం పరీక్షలు, మార్కులు కోసం చదవలేదు. చదివిన దాంట్లో పూర్తి నైపుణ్యం సాధించే వరకు వదిలేదాన్ని కాదు. నా విషయంలో తల్లిదండ్రులు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నాపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదు. మిగిలిన తల్లిదండ్రులకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. పిల్లల ఇష్టాలకు అనుగుణంగా నడుచుకోండి. మీ ఇష్టాలు, అభిప్రాయాలను వారిపై రుద్ది ఒత్తిడికి గురి చేయొద్దు. విజయవాడ వాసులు ఇచ్చిన ఆత్మీయ గౌరవం నేను ఎప్పటికీ మర్చిపోను.