స్మార్ట్‌గా చదివితే ర్యాంక్ మీదే..
Published Tue, Jul 26 2016 6:47 PM | Last Updated on Thu, Jul 11 2019 8:55 PM
నిద్రను త్యాగం చేయక్కర్లేదు
ఫేస్‌బుక్, వాట్సప్‌కు దూరం కానక్కర్లేదు..
తల్లిదండ్రులూ ఒత్తిడి చేయొద్దు
సివిల్స్ టాపర్ టీనా దాబీ
టీనా దాబీ.. 2015 సివిల్స్ ఆల్ ఇండియా మొదటిర్యాంక్ సాధించడం ద్వారా అనేక రికార్డులు నెలకొల్పింది. దేశంలో తొలిసారిగా మొదటి ర్యాంక్ సాధించిన దళిత మహిళగా రికార్డు సృష్టించింది. అతి చిన్న వయసులోనే ఈ ర్యాంకును సాధించడం మరో విశేషం. అలాగే తొలి ప్రయత్నంలోనే ర్యాంకు కొట్టేసింది. డిగ్రీ తర్వాత నేరుగా సివిల్స్ ఎంపికై మరో రికార్డు నెలకొల్పింది. ఇలా టీనా గురించి చెబుతూపోతే రికార్డులే రికార్డులు. ఈ రికార్డుల రాణిని సోమవారం విజయవాడ నగరం ఘనంగా సత్కరించింది. చక్కటి ప్రణాళికతో స్మార్ట్‌గా చదివితే క్లిష్టమైన సివిల్స్ ర్యాంకు మీ సొంతమవుతుందని ఆమె చెబుతోంది. విద్యార్థుల భవిష్యత్ కోసం టీనా దాబీ చెప్పిన మరికొన్ని విశేషాలు ఆమె మాటల్లోనే..
సాక్షి, అమరావతి: సివిల్స్ పరీక్షల కోసం నిద్రాహారాలను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. చక్కటి ప్రణాళికతో స్మార్ట్‌గా చదివితే చాలు ర్యాంకులు వాతంట అవే వస్తాయి. నేను ఇదే సూత్రాన్ని పాటించాను. సివిల్స్ కోసం నా ఇష్టాలను వేటినీ వదులు కోలేదు. చివరికి వాట్సప్, ఫేస్‌బుక్‌లకూ దూరం కాలేదు. కానీ ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చేశాను. రోజుకు ఐదు ఆరు గంటలు ఏకాగ్రతతో చదివాను. అలసట వచ్చినప్పుడు రిలాక్స్ కోసం వాట్సప్, ఫేస్‌బుక్ చేసేదాన్ని. అంతే కానీ ఒక చేత్తో మొబైల్, మరో చేతిలో పుస్తకంతో కూర్చునేదాన్ని కాదు. కావల్సినంత సేపు నిద్రపోయేదాన్ని.
ప్రభాస్‌కు వీరాభిమానిని..
నేను తెలుగు హీరో ప్రభాస్‌కి వీరాభిమానిని. బాహుబలి సినిమా చూడటం కోసం రెండు మూడు రోజులు ముందుగానే చదువు కోసం ఎక్కువ సమయం కేటాయించాను. ఇలా సమయాన్ని స్మార్ట్‌గా వినియోగించుకునేదాన్ని. నా విజయంలో మూడు అంశాలు కీలకపాత్ర పోషించాయి. అవి కష్టపడి పని చేయడం, చక్కటి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం, ఓపిగ్గా ఉండటం. ఈ మూడు అంశాలను పాటిస్తే ర్యాంకులు సులభంగా పొందవచ్చు. నాకు ఇంటర్మీడియెట్‌లోకి వచ్చే వరకు సివిల్స్ గురించే తెలియదు. తొలిసారిగా ఇంటర్ మొదటి సంవత్సరంలో సివిల్స్ గురించి తెలిశాక అప్పటి నుంచే నేను ఒక చక్కటి ప్రణాళికను సిద్ధం చేసుకున్నా. కేవలం పరీక్షలు, మార్కులు కోసం చదవలేదు. చదివిన దాంట్లో పూర్తి నైపుణ్యం సాధించే వరకు వదిలేదాన్ని కాదు. నా విషయంలో తల్లిదండ్రులు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నాపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదు. మిగిలిన తల్లిదండ్రులకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. పిల్లల ఇష్టాలకు అనుగుణంగా నడుచుకోండి. మీ ఇష్టాలు, అభిప్రాయాలను వారిపై రుద్ది ఒత్తిడికి గురి చేయొద్దు. విజయవాడ వాసులు ఇచ్చిన ఆత్మీయ గౌరవం నేను ఎప్పటికీ మర్చిపోను.
Advertisement
Advertisement