‘ఇంజినీరింగ్ సీట్ అమ్మాయిలకెందుకు?’
ఇది నలభై ఏళ్ల నాటి మాట.
విద్యావంతులు కూడా కనుబొమలు ముడివేస్తున్న రోజులవి.
‘నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తాను’
సంధ్య అనే ఓ అమ్మాయి పట్టుదల అది.
‘మెకానికల్‌లోనా అసలే కుదరదు...
కావాలంటే ఎలక్ట్రానిక్స్‌లో చేరు’
కొద్దిగా రాజీపడుతూ ఆ అమ్మాయికి సీటిచ్చారు.
ఇప్పుడామె దేశ రక్షణ రంగానికి పరికరాలు సమకూరుస్తున్నారు.
ఆమే కోవె డైరెక్టర్ సంధ్యారెడ్డి. చేత వచ్చిన పనులతో కుటీర పరిశ్రమ లేదా చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు స్థాపించా లనుకుంటూ గ్రామాల్లో ఉన్న కారణంగా ఏ మార్గమూ లేదని నిరుత్సాహ పడుతున్న వారి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమా లను, మెంటార్‌షిప్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల మంది ఔత్సాహిక గ్రామీణ ప్రాంతాల మహిళలకు శిక్షణనిస్తున్నారామె. హైదరాబాద్ బోరబండలో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన ఈ ప్రయత్నం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా అసలామెకు ఈ ఆలోచన రావడానికి గల కారణాలేమిటో వివరించారు. అవి ఆమె మాటల్లోనే...
‘‘మాది చాలా సింపుల్ బ్యాక్‌గ్రౌండ్. నాన్న హైదరాబాద్, ఎల్‌ఐసీలో చేసేవారు, అమ్మ గృహిణి. అమ్మ పూర్తిగా గ్రామీణ నేపథ్యం, చదువుకోలేదు. కానీ ఆమె ఆలోచనలు, లక్ష్యాలు చాలా ఉన్నతంగా ఉండేవి. పిల్లలను పెద్ద చదువులు చదివించాలనే పట్టుదలతో ఉండేది. నాన్న కూడా ఆడపిల్లలు అనే ఆంక్షలు లేకుండా ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి. దాంతో నాకు అమ్మాయి అనే కారణంగా పరిమితులు తెలియదు.
సమాజం చిన్న చట్రంలో ఇమిడి ఉందనే విషయం కూడా ఇంజినీరింగ్‌లో సీటు దగ్గరే మొదటిసారిగా తెలిసింది. ఇంజినీరింగ్ సీటు ఆడపిల్లలకు ఇస్తే ఆ సీటు వేస్టవుతుందనే అపోహ ఉండేదప్పట్లో. బెంగళూరులో రెండేళ్లు ఉద్యోగం చేసి, తిరిగి హైదరాబాద్‌కి వచ్చి 1989లో సొంత ఇండస్ట్రీ పెట్టాను. తర్వాత యూఎస్‌కి వెళ్లి ఎనిమిదేళ్లు ఐటీ ఇండస్ట్రీ నడిపించాను. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిశ్రమ స్థాపించాను.
మా కెన్రా టెక్నాలజీస్ ఇప్పుడు రక్షణ రంగానికి హై క్వాలిటీ పవర్ సప్లయ్ సిస్టమ్స్, లాండ్ బేస్‌డ్, ఎయిర్ బోర్న్, నావల్ ప్రాజెక్ట్‌లకు అవసరమైన పరికరాలను అందిస్తోంది. ఈ స్థాయికి చేరడానికి ఎంతగా శ్రమించానో నాకు తెలుసు. అందుకే పారిశ్రామిక రంగంలోకి రావాలనుకునే మహిళల కోసం ఒక వేదిక ఉంటే బావుంటుందని భావసారూప్యం కలిగిన అనేక మంది మహిళా పారిశ్రామికవేత్తల ఆలోచనతో 2004లో మొదలైంది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (కోవె).
విస్తరించిన ‘పౌష్టిక్’
కోవె దేశవ్యాప్తంగా 13 వందలకు పైగా సభ్యులతో 11 చాప్టర్స్‌తో పని చేస్తోంది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలకే పరిమితమై పని చేసింది. గ్రామీణ, పట్టణాల్లో ఉండే మహిళలకు అందుబాటులోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో జిల్లాలకు విస్తరించే ప్రయత్నం మొదలుపెట్టాం. ఇందుకోసం ‘పౌష్టిక్’ అనే కార్యక్రమాన్ని రూపొందించాం. మహిళలు పోషకాలతో కూడిన ఆహారాన్ని ఇంట్లోనే వండి, పోటీలు జరిగే ప్రదేశానికి తెచ్చి ప్రదర్శించాల్సి ఉంటుంది.
తెలంగాణలో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలున్నాయి. ఏపీలో విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, వైజాగ్‌లో నిర్వహించాం. ఆహారంతో మొదలుపెట్టడంలో మా ఉద్దేశం మహిళలకు పోషకాహారం ఆవశ్యకతను గుర్తు చేయడం, అందరికీ తెలిసిన ఆహారం నుంచి ఉపాధికి మార్గం వేసుకోవడం ఎలాగో నేర్పించడం అన్నమాట. మహబూబ్ నగర్ లో ఈ కార్యక్రమం రేపు ఉంది. ప్రతిచోటా వంద మంది వరకు పాల్గొంటున్నారు.
పోటీల్లో గెలిచిన వాళ్లకు పోషకవిలువల గురించి వివరించగలగడం, ప్యాకేజింగ్, షెల్ఫ్‌లైఫ్‌ను అంచనా వేయడం వంటి అంశాల్లో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. వాళ్లంతా అక్టోబర్ లో జరిగే లైవ్ కిచెన్ పోటీలో పాల్గొనాలి. ఈ పోటీల్లో గెలిచిన మహిళల్లో దాదాపుగా అందరూ సొంత పరిశ్రమ స్థాపించడానికి ముందుకు వస్తారని నమ్మకం.
అందిపుచ్చుకోండి
కోవెని చాంబర్ ఆఫ్ కామర్స్ ఆస్ట్రేలియా, జర్మనీ, చైనా, శ్రీలంక, ఈజిప్టు వంటి ఇంటర్నేషనల్ ఉమెన్ ఆర్గనైజేషన్‌లతో అనుసంధానం చేశాం. సాధారణంగా పరిశ్రమ అనగానే మధ్యతరగతి మహిళలను అనేక రకాల భయాలు వెంటాడుతుంటాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్, కంపెనీ రిజిస్ట్రేషన్ వంటి ప్రక్రియల దగ్గరే వెనక్కిపోయేవాళ్లూ ఉంటారు. మహిళలకు తోడుగా ఈ పనులకు తిరగడానికి ఇంట్లో మగవాళ్లు మొదట విసిగిపోతారు.
అలాంటప్పుడు ఆడవాళ్లలో ఎంత ఉత్సాహం ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోతుంటారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కోవెలో పరిశ్రమ స్థాపన, నిర్వహణకు అవసరమైన రిజిస్ట్రేషన్, ఐటీ ఫైలింగ్, మార్కెటింగ్ సర్వీస్‌లన్నీ అందిస్తున్నాం. యంత్ర పరికరాలు అవసరమయ్యే పరిశ్రమల కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యంతో ఇన్‌క్యుబేటర్ సెంటర్‌లను ఏర్పాటు చేశాం.
పరిశ్రమ పెట్టాలనుకునే మహిళ తొలిదశలోనే పెట్టుబడి కోసం ప్రయాస పడాల్సిన అవసరం ఉండదు, మేము ఏర్పాటు చేసిన ఇన్ క్యుబేషన్ సెంటర్‌లో పని మొదలుపెట్టి, తన మీద తనకు నమ్మకం కుదిరిన తర్వాత యంత్రాలు కొనుక్కుని సొంత పరిశ్రమ ప్రారంభించవచ్చు. ఈ సౌకర్యాలను అందిపుచ్చుకోండి’’ అని ఔత్సాహిక మహిళలకు పిలుపునిచ్చారు సంధ్యారెడ్డి. – వాకా మంజులారెడ్డి, ఫొటో: గడిగె బాలస్వామి
అవకాశాలు విస్తరించాలి!
పౌష్టిక్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న మహిళల్లో రాజమండ్రి వాళ్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలామంది ఇప్పటికే ‘ఫుడ్ ఇండస్ట్రీ లైసెన్స్ కోసం ఎలా అప్లయ్ చేయాలి’ వంటి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందులో వాళ్ల సందేహాలను తీరుస్తున్నాం. ఏపీలో ఇప్పటికే ఫుడ్ కార్పొరేషన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే... మా తరంలో ఇన్ని అవకాశాల్లేవు.
ఒక మహిళ పారిశ్రామిక వేత్తగా నిలదొక్కుకోవడం చాలా కష్టమయ్యేది. అనేకమంది ఉత్సాహంగా ముందుకు వచ్చి ఎదురీదలేక ఆగిపోయిన వాళ్లూ ఉన్నారు. నగరాల్లోనే ఇలా ఉంటే ఇక గ్రామాలు, పట్టణాల మహిళలకు ప్రయత్నం చేసే అవకాశం కూడా తక్కువే. అందుకే వాళ్ల చేత ఒక అడుగు ముందుకు వేయించాలనేదే కోవె సంకల్పం.
– సంధ్యారెడ్డి కేశవరం
Comments
Please login to add a commentAdd a comment