బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు 5% అదనపు రాయితీ
పారిశ్రామిక, ఎంఎస్‌ఎంఈ పాలసీల సమీక్షలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీలను రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇండ్రస్టియల్ డెవలప్‌మెంట్, ఎంఎస్‌ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ డ్రాఫ్ట్ పాలసీలపై సీఎం సోమవారం సమీక్ష జరిపారు. ప్రైవేటు ఇండ్రస్టియల్ పార్క్ పాలసీపై మరికొంత కసరత్తు జరగాలని, మిగిలిన మూడు విధానాలను వచ్చే కేబినెట్ ముందుకు తేవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
సీఎం సూచనలు, పారిశ్రామికవర్గాల అభిప్రాయాలు, ఇతర రాష్ట్రాల విధానాల ఆధారంగా అధికారులు పాలసీలను రూపొందించి సీఎం ముందు ఉంచారు. ఇండ్రస్టియల్ డెవలప్‌మెంట్ పాలసీ అమల్లోకి వచి్చన వెంటనే కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లి‹Ùమెంట్, డేట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ ఇచ్చిన మొదటి 200 పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రతిపాదనలు చేశారు. ఎక్కువ ఉద్యోగాలిచ్చే కంపెనీలకు అదనంగా 10 శాతం ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రతిపాదించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు అదనంగా 5 శాతం ఇన్సెంటివ్ ఇవ్వాలని సూచించారు.
ఇన్నోవేషన్ హబ్‌కు రతన్ టాటా పేరు
అమరావతి ఇన్నోవేషన్ హబ్‌కు దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా పేరు పెట్టాలని అధికారులకు సూచించారు. పారిశ్రామిక రంగ అభివృద్ధికి దోహదపడేలా రతన్ టాటా హబ్ తేవాలని నిర్ణయించామన్నారు. హబ్‌కు అనుబంధంగా రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో సెంటర్ల ఏర్పాటు జరుగుతుందని, ఒక్కో సెంటర్‌కు ఒక్కో మల్టీనేషనల్ కంపెనీ మెంటార్‌గా ఉండేలా ఈ విధానాన్ని రూపొందించాలని సీఎం ఆదేశించారు.
పౌల్ట్రీ తరహాలోనే ఫుడ్ ప్రాసెసింగ్ విధానాలు: సీఎస్
ఆక్వా, పౌల్ట్రీ రంగంలో వచ్చిన విధంగా ఫుడ్ ప్రాసెసింగ్‌లోనూ మంచి ఫలితాలు వచ్చేలా విధానాలను అమలు చేయాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సూచించారు. పౌల్ట్రీతో పాటు పాడి పరిశ్రమ, మేకలు, గొర్రెల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు. ఈ సమీక్షలో మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఐటీ, డ్రోన్ పాలసీలను మెరుగుపరచాలి
ఐటీ, డ్రోన్ పాలసీలను మరింత మెరుగుపర్చాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ పాలసీలపై ఆయన సమీక్షించారు. నూతన పాలసీలను సీఎంకు అధికారులు వివరించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలు, నిపుణులతో చర్చించి వీటిని రూపొందించినట్లు వివరించారు. వీటిపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. మరింత మెగుపరిచి వచ్చే కేబినెట్‌లో ఉంచాలని సూచించారు. ఈ నెల 22, 23వ తేదీల్లో జరగనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్‌పై అధికారులు వివరించారు. కేంద్ర సివిల్ ఏవియేషన్ శాఖ భాగస్వామ్యంతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఈ సదస్సులో 400 మంది అతిథులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.
అతి భారీ వర్షాలపై అప్రమత్తం చేయండి
రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని, అతి భారీ వర్షాలు ఉండే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో సీఎం సోమవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. చెరువులు, కాలువలు, నీటి వనరులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు చెప్పారు. వర్షపాతం వివరాలను కూడా రియల్ టైంలో అందుబాటులో ఉంచాలన్నారు. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి ప్రజల వినతులపై వేగంగా స్పందించాలని అన్నారు.
ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి వర్షాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో ఈ సీజన్‌లో 676 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతానికి గాను ఇప్పటివరకు 734 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, 18 జిల్లాల్లో సాధారణంకంటే అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment