Inspirational Womens Foundation
-
చిన్నారి సేవాగుణం
ఎంతోమంది విదేశాలకు వెళ్లిన తర్వాత పుట్టి పెరిగిన ప్రాతాన్ని మర్చిపోతుంటారు. కాని కరీంనగర్ నుంచి అమెరికా వెళ్లి అక్కడ నివాసం ఉంటున్న ఓ ప్రవాస భారతీయుడి కుమార్తె సొంత ఊరిపై మమకారంతో అనాథ విద్యార్థుల కోసం విరాళాలు సేకరించి అందించింది. ఈ రకంగా తన తల్లితండ్రులు పెరిగిన ఊరిపై ప్రేమను చాటుకుంది.కరీంనగర్ పట్టణానికి చెందిన ప్రవాస భారతీయులు లక్కాకుల వినయ్ అమెరికాలోని మిచిగాన్ లో నివసిస్తుండగా వారి కూతురు లక్కాకుల హరిణి అమెరికాలోని నోవి హైస్కూల్లో విద్యనభ్యసిస్తున్నారు. హరిణి ΄ాఠశాల సామాజిక సేవాకార్యక్రమంలో భాగంగా రూ.1.65 లక్షల మేరకు విరాళాలు సేకరించింది. ఈ మొత్తాన్ని హరిణి కరీంనగర్ పట్టణంలోని వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలగోకులంలో 40 మంది అనాథ విద్యార్థులకు విద్యాబుద్ధులను గరపడంతో΄ాటు సకల సౌకర్యాలను కలుగజేస్తున్నారని తెలుసుకొని వారి అవసరాల కోసం విరాళంగా ఇచ్చారు. వయసులో చిన్న అయినా, పెద్ద మనసుతో విరాళాలు సేకరించి ఇచ్చిన హరిణికి బాలగోకులం విద్యార్థులు, వెంకట్ ఫౌండేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
మహిళలూ... పరిశ్రమించండి!
‘ఇంజినీరింగ్ సీట్ అమ్మాయిలకెందుకు?’ ఇది నలభై ఏళ్ల నాటి మాట. విద్యావంతులు కూడా కనుబొమలు ముడివేస్తున్న రోజులవి. ‘నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తాను’ సంధ్య అనే ఓ అమ్మాయి పట్టుదల అది. ‘మెకానికల్లోనా అసలే కుదరదు... కావాలంటే ఎలక్ట్రానిక్స్‌లో చేరు’ కొద్దిగా రాజీపడుతూ ఆ అమ్మాయికి సీటిచ్చారు. ఇప్పుడామె దేశ రక్షణ రంగానికి పరికరాలు సమకూరుస్తున్నారు. ఆమే కోవె డైరెక్టర్ సంధ్యారెడ్డి. చేత వచ్చిన పనులతో కుటీర పరిశ్రమ లేదా చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు స్థాపించా లనుకుంటూ గ్రామాల్లో ఉన్న కారణంగా ఏ మార్గమూ లేదని నిరుత్సాహ పడుతున్న వారి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమా లను, మెంటార్షిప్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల మంది ఔత్సాహిక గ్రామీణ ప్రాంతాల మహిళలకు శిక్షణనిస్తున్నారామె. హైదరాబాద్ బోరబండలో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన ఈ ప్రయత్నం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా అసలామెకు ఈ ఆలోచన రావడానికి గల కారణాలేమిటో వివరించారు. అవి ఆమె మాటల్లోనే... ‘‘మాది చాలా సింపుల్ బ్యాక్‌గ్రౌండ్. నాన్న హైదరాబాద్, ఎల్ఐసీలో చేసేవారు, అమ్మ గృహిణి. అమ్మ పూర్తిగా గ్రామీణ నేపథ్యం, చదువుకోలేదు. కానీ ఆమె ఆలోచనలు, లక్ష్యాలు చాలా ఉన్నతంగా ఉండేవి. పిల్లలను పెద్ద చదువులు చదివించాలనే పట్టుదలతో ఉండేది. నాన్న కూడా ఆడపిల్లలు అనే ఆంక్షలు లేకుండా ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి. దాంతో నాకు అమ్మాయి అనే కారణంగా పరిమితులు తెలియదు. సమాజం చిన్న చట్రంలో ఇమిడి ఉందనే విషయం కూడా ఇంజినీరింగ్‌లో సీటు దగ్గరే మొదటిసారిగా తెలిసింది. ఇంజినీరింగ్ సీటు ఆడపిల్లలకు ఇస్తే ఆ సీటు వేస్టవుతుందనే అపోహ ఉండేదప్పట్లో. బెంగళూరులో రెండేళ్లు ఉద్యోగం చేసి, తిరిగి హైదరాబాద్‌కి వచ్చి 1989లో సొంత ఇండస్ట్రీ పెట్టాను. తర్వాత యూఎస్‌కి వెళ్లి ఎనిమిదేళ్లు ఐటీ ఇండస్ట్రీ నడిపించాను. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిశ్రమ స్థాపించాను. మా కెన్రా టెక్నాలజీస్ ఇప్పుడు రక్షణ రంగానికి హై క్వాలిటీ పవర్ సప్లయ్ సిస్టమ్స్, లాండ్ బేస్డ్, ఎయిర్ బోర్న్, నావల్ ప్రాజెక్ట్‌లకు అవసరమైన పరికరాలను అందిస్తోంది. ఈ స్థాయికి చేరడానికి ఎంతగా శ్రమించానో నాకు తెలుసు. అందుకే పారిశ్రామిక రంగంలోకి రావాలనుకునే మహిళల కోసం ఒక వేదిక ఉంటే బావుంటుందని భావసారూప్యం కలిగిన అనేక మంది మహిళా పారిశ్రామికవేత్తల ఆలోచనతో 2004లో మొదలైంది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (కోవె). విస్తరించిన ‘పౌష్టిక్’ కోవె దేశవ్యాప్తంగా 13 వందలకు పైగా సభ్యులతో 11 చాప్టర్స్తో పని చేస్తోంది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలకే పరిమితమై పని చేసింది. గ్రామీణ, పట్టణాల్లో ఉండే మహిళలకు అందుబాటులోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో జిల్లాలకు విస్తరించే ప్రయత్నం మొదలుపెట్టాం. ఇందుకోసం ‘పౌష్టిక్’ అనే కార్యక్రమాన్ని రూపొందించాం. మహిళలు పోషకాలతో కూడిన ఆహారాన్ని ఇంట్లోనే వండి, పోటీలు జరిగే ప్రదేశానికి తెచ్చి ప్రదర్శించాల్సి ఉంటుంది. తెలంగాణలో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలున్నాయి. ఏపీలో విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, వైజాగ్‌లో నిర్వహించాం. ఆహారంతో మొదలుపెట్టడంలో మా ఉద్దేశం మహిళలకు పోషకాహారం ఆవశ్యకతను గుర్తు చేయడం, అందరికీ తెలిసిన ఆహారం నుంచి ఉపాధికి మార్గం వేసుకోవడం ఎలాగో నేర్పించడం అన్నమాట. మహబూబ్ నగర్ లో ఈ కార్యక్రమం రేపు ఉంది. ప్రతిచోటా వంద మంది వరకు పాల్గొంటున్నారు. పోటీల్లో గెలిచిన వాళ్లకు పోషకవిలువల గురించి వివరించగలగడం, ప్యాకేజింగ్, షెల్ఫ్‌లైఫ్‌ను అంచనా వేయడం వంటి అంశాల్లో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. వాళ్లంతా అక్టోబర్ లో జరిగే లైవ్ కిచెన్ పోటీలో పాల్గొనాలి. ఈ పోటీల్లో గెలిచిన మహిళల్లో దాదాపుగా అందరూ సొంత పరిశ్రమ స్థాపించడానికి ముందుకు వస్తారని నమ్మకం. అందిపుచ్చుకోండి కోవెని చాంబర్ ఆఫ్ కామర్స్ ఆస్ట్రేలియా, జర్మనీ, చైనా, శ్రీలంక, ఈజిప్టు వంటి ఇంటర్నేషనల్ ఉమెన్ ఆర్గనైజేషన్లతో అనుసంధానం చేశాం. సాధారణంగా పరిశ్రమ అనగానే మధ్యతరగతి మహిళలను అనేక రకాల భయాలు వెంటాడుతుంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్, కంపెనీ రిజిస్ట్రేషన్ వంటి ప్రక్రియల దగ్గరే వెనక్కిపోయేవాళ్లూ ఉంటారు. మహిళలకు తోడుగా ఈ పనులకు తిరగడానికి ఇంట్లో మగవాళ్లు మొదట విసిగిపోతారు. అలాంటప్పుడు ఆడవాళ్లలో ఎంత ఉత్సాహం ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోతుంటారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కోవెలో పరిశ్రమ స్థాపన, నిర్వహణకు అవసరమైన రిజిస్ట్రేషన్, ఐటీ ఫైలింగ్, మార్కెటింగ్ సర్వీస్‌లన్నీ అందిస్తున్నాం. యంత్ర పరికరాలు అవసరమయ్యే పరిశ్రమల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యంతో ఇన్క్యుబేటర్ సెంటర్లను ఏర్పాటు చేశాం. పరిశ్రమ పెట్టాలనుకునే మహిళ తొలిదశలోనే పెట్టుబడి కోసం ప్రయాస పడాల్సిన అవసరం ఉండదు, మేము ఏర్పాటు చేసిన ఇన్ క్యుబేషన్ సెంటర్లో పని మొదలుపెట్టి, తన మీద తనకు నమ్మకం కుదిరిన తర్వాత యంత్రాలు కొనుక్కుని సొంత పరిశ్రమ ప్రారంభించవచ్చు. ఈ సౌకర్యాలను అందిపుచ్చుకోండి’’ అని ఔత్సాహిక మహిళలకు పిలుపునిచ్చారు సంధ్యారెడ్డి. – వాకా మంజులారెడ్డి, ఫొటో: గడిగె బాలస్వామి అవకాశాలు విస్తరించాలి! పౌష్టిక్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న మహిళల్లో రాజమండ్రి వాళ్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలామంది ఇప్పటికే ‘ఫుడ్ ఇండస్ట్రీ లైసెన్స్ కోసం ఎలా అప్లయ్ చేయాలి’ వంటి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందులో వాళ్ల సందేహాలను తీరుస్తున్నాం. ఏపీలో ఇప్పటికే ఫుడ్ కార్పొరేషన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే... మా తరంలో ఇన్ని అవకాశాల్లేవు. ఒక మహిళ పారిశ్రామిక వేత్తగా నిలదొక్కుకోవడం చాలా కష్టమయ్యేది. అనేకమంది ఉత్సాహంగా ముందుకు వచ్చి ఎదురీదలేక ఆగిపోయిన వాళ్లూ ఉన్నారు. నగరాల్లోనే ఇలా ఉంటే ఇక గ్రామాలు, పట్టణాల మహిళలకు ప్రయత్నం చేసే అవకాశం కూడా తక్కువే. అందుకే వాళ్ల చేత ఒక అడుగు ముందుకు వేయించాలనేదే కోవె సంకల్పం. – సంధ్యారెడ్డి కేశవరం -
సావిత్రమ్మ.. నీకు సాటిలేరమ్మా..!
కేవలం తన కుటుంబం కోసమే ఆమె ఆలోచించి ఉంటే.. ఆమె ఈ రోజున ఒట్టి సావిత్రిగానే మిగిలేది. కానీ ఆమె ఆలా చేయలేదు. తాను పీకల్లోతు కష్టాల్లో ఉన్నా పక్కనున్న కార్మికుల కోసం ఆలోచించింది. కొన్ని పరిస్థితుల కారణంగా కుటుంబ బాధ్యతను స్వీకరించి, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ బతుకు పోరాటం సాగించింది. భర్త లేని సంసారాన్ని రెక్కల కష్టంపై మోస్తూనే.. సాటి కార్మికుల కోసం ఉద్యమాలు చేసింది. సాటి కార్మికుల బతుకుల్లో ‘చెమ్మ’చీకటిని పారద్రోలి వారి బతుకుల్లో వెలుగులు నింపింది. అందరికీ సావిత్రమ్మ అయ్యింది. ఆమే ఆకివీడుకు చెందిన కార్మికోద్యమ నాయకురాలు సావిత్రమ్మ. ఆమె జీవిత గాథ.. ఆమె మాటల్లోనే.. ఆకివీడు : నా పేరు సావిత్రి. కాని సావిత్రమ్మ అంటారు. 1944లో కృష్ణా జిల్లా తాడేపల్లి అనే చిన్న పల్లెలో పుట్టాను. మక్కా వెంకన్న, వరహాలమ్మ దంపతులకు జన్మించాను. 1965 దశకంలో వివాహమైంది. నా భర్త మారుబోయిన సాంబశివరావు విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేసేవారు. తిరుపతిలో విద్యుత్ స్తంభంపైకి ఎక్కి పని చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి కిందకు పడిపోయారు. తలకు బలమైన గాయం అయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే కన్పించకుండా వెళ్లిపోయారు. అప్పటికి నేను గర్భవతిని. నేటికీ ఆయన తిరిగి రాలేదు. నా తండ్రి వెంకన్న రైల్వే డిపార్టుమెంట్లో చిరుద్యోగి. అల్లుడు కోసం ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేసి, కాళ్లు అరిగేలా తిరిగిన ఆయన అలసి సొలసిపోయారు. అల్లుడు కన్పించకపోవడం, చుట్టుపక్కలవారి సూటిపోటి మాటలు పడలేకపోయారు. అప్పుడే బతుకుపై భయమేసింది. చేతిలో చిల్లి గవ్వలేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. నాకు ప్రసవ సమయం దగ్గర పడింది. పండంటి బిడ్డ పుట్టాడు. పల్లెటూరులో జీవనం సాగించలేక, బతుకు తెరువు కోసం తల్లిని, తండ్రిని వెంటబెట్టుకుని చంకలో చంటి బిడ్డతో ఆకివీడు వచ్చాను. కన్నప్రేగు తడారకుండానే కార్మికురాలిగా.. నా... అన్న వారు లేకపోయినా, మానవత్వం నిండిన వారు ఉండకపోతారా అని వెతుక్కుంటూ వచ్చిన నన్ను ఆకివీడు ప్రజలు ఆదరించారు. కన్న ప్రేగు తడారకుండానే రైసుమిల్లులో కార్మికురాలిగా చేరాను. ధాన్యం, బియ్యం డబ్బాలను మోసి బతుకు బండిని గెంటుకువచ్చాను. రోజుకు రూ. 2.50 కూలితో ముగ్గురం బతుకుతూ, పిల్లవాడిని పెంచాం. తండ్రి వెంకన్న స్థానిక పెద్దల సహకారంతో రైస్‌మిల్లులో నైట్‌వాచ్‌మెన్‌గా చేరారు. రైస్ మిల్లు కార్మికురాలిగా పనిచేస్తూ, తోటి కార్మికులు పడుతున్న అవస్థల్ని చూడలేకపోయాను. ఇంట్లో పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పటికీ తోటి కార్మికుల ఇబ్బందులను భుజాన వేసుకుంటూ పనిచేశాను. కార్మికులు పడుతున్న అవస్థలు, దోపిడీకి గురవుతున్నారని తెలుసుకుని వాటిని ఎదిరించాలని నిర్ణయించుకుని ముందుకు వెళ్లాను. ఆకలి బాధలు, కార్మికుల తిప్పలు కార్మికోద్యమ నేతగా నన్ను నిలబెట్టాయి. నా ఆవేదన, ఆలోచన, ఆక్రందనలను వింటున్న కార్మికోద్యమ నేత నంద్యాల సుబ్బారావు నేతృత్వంలో కార్మిక సంఘంలో చేరాను. రైస్‌మిల్లు కార్మికల సంఘం ఏర్పాటు చేసి వేతనాల కోసం, పని గంటల కోసం వీరోచితంగా పోరాడాను. కార్మికులకు ప్రత్యేక చట్టాలు, ప్రతి రెండేళ్లకు వేతనాలు, కూలీల «వేతనాల పెంపు, బోనస్‌లు, íపీఎఫ్‌లు, గ్రాట్యుటీ వంటి వాటిని కల్పించడంలో శక్తి వంచన లేకుండా కృషి చేశాను. నాటి వేతన ఒప్పందం నేటీకి అమలులోనే ఉంది. నాదారిలోనే నా కుమారుడు కార్మికురాలిగా పిల్లవాడ్ని చదివించడానికి డబ్బు సరిపోదని చిన్నపాటి హోటల్ పెట్టాను. చీటీలు కట్టించుకుని కార్మికులకు చేదోడు వాదోడుగా ఉంటూ కుమారుడ్ని బీఈడీ చేయించాను. అదే చీటీల వ్యాపారాన్ని వృద్ధి చేసిన కుమారుడు మారుబోయిన రమణ ఉద్యమాల్లో పాల్గొంటూ కార్మికులకు ఆసరాగా నిలబడ్డారు. నిజాయితీగా, నిబద్దతతో కార్మికులకు అండగా నిలుస్తున్న రమణను స్థానిక పెద్ద, కమ్యునిస్టువాది గాదిరాజు సుబ్బరాజు రమణకు లెనిన్ ఆశయాలున్నాయంటూ లెనిన్‌గా నామకరణం చేశారు. లెనిన్‌బాబుకు అరుణకుమారితో వివాహం చేశాను. లెనిన్ నేడు వ్యాపారం, రొయ్యల చెరువులు, ఐస్ ఫ్యాక్టరీని నడుపుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం పుట్టుకతో రావడంతో నేటికీ కార్మిక ఉద్యమాల్లోనూ, కార్మికుల బాధల్లో పాలుపంచుకుంటూ జీవనం గడుపుతున్నాం. ప్రజాసమస్యల పరిష్కార వేదికనయ్యాను కార్మికుల సమస్యల నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికనయ్యాను. 1980 ప్రాంతం నుండే వితంతువులకు, వికలాంగులకు, వృద్ధులకు పింఛన్ల కోసం పోరాటాలు చేశాను. ప్రజల సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సామరస్యంగా పరిష్కరించా. మహిళా సంఘాలు ఏర్పాటు చేసి వారిలో చైతన్యం తీసుకువచ్చాను. నేడు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు భయంకరంగా ఉంటున్నాయి. చిన్న పిల్లలు గ్రామాల్లో కూడా తిరగలేని పరిస్థితి నెలకొంది. మేధస్సు పెరిగినా మానవత్వం విలువలు చనిపోతున్నాయి. చంద్ర మండలంలో కాపురం ఉండేందుకు మేధస్సు ఉపయోగపడుతున్నా భూమండలంలో వికృత చేష్టలు పాతాళానికి తీసుకు వెళ్తున్నాయి. జనాభాలో సగంకు పైగా ఉన్న మహిళలకు స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందనేది నా బాధ. అణచివేతపై మహిళలు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని.. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఏనాడూ ఎదురు చూడలేదు. ఎదురు చూసి ఉంటే ఈనాడు ఇలా ఉండేదాన్ని కాదు. కొడుకు కోడలుతో పాటు మనవరాళ్లతో ఆనందమయమైన జీవనం గడుపుతున్నాను. -
స్ఫూర్తిదాయక ఫిమేల్ బాలీవుడ్ ఐకాన్.. మాధురీ!
లండన్: బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ అత్యంత స్ఫూర్తిదాయకమైన ఆల్‌టైమ్ ఫిమేల్ బాలీవుడ్ ఐకాన్‌గా నిలిచారు. బ్రిటన్‌లోని బ్రాడ్‌ఫోర్డ్‌లో నిర్వహించిన ‘బ్రాడ్ఫోర్డ్ ఇన్స్పిరేషనల్ వుమెన్ అవార్డ్స్ (బివా)’ మూడో వార్షికోత్సవంలో మాధురీకి ఈ అరుదైన గౌరవం దక్కింది. బివాలో ఫిమేల్ బాలీవుడ్ ఐకాన్ కేటగిరీని గతేడాదే ప్రకటించగా.. ఆ గౌరవం పొందిన తొలి వ్యక్తిగా మాధురీ నిలిచారు. ఆల్‌టైమ్ మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఫిమేల్ బాలీవుడ్ ఐకాన్‌గా తనను ఎంపికచేయడం పట్ల మాధురీ హర్షం వ్యక్తంచేశారు. తనకు ఈ గౌరవం కట్టబెట్టిన ఇన్స్పిరేషనల్ వుమెన్స్ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు చెబుతూ మాధురీ పంపిన వీడియో సందేశం వేదికపై ప్రదర్శించారు.