భీమవరం టౌన్ : బషీర్‌బాగ్ విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.ఉమామేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక ప్యాడి మర్చంట్స్ హాల్లో ఆదివారం విద్యుత్ పోరాట అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేపట్టిన వినాశకర విద్యుత్ సంస్కరణలు, అధిక విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ 9 వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపుతో ప్రజలు ఉద్యమించారన్నారు. ఈ ఉద్యమం మహత్తర పోరాటంగా రూపాంతరం చెందిందని చివరకు చంద్రబాబు ప్రభుత్వం బషీర్‌బాగ్‌లో ఉద్యమకారులను గుర్రాలతో తొక్కించి కాల్పులు జరిపించారని, ఈ పోరాటంలో రామకృష్ణ, బాలా స్వామి, విష్ణువర్థన్‌రెడ్డి ప్రాణాలు విడిచారని గుర్తు చేశారు. అమరవీరుల ఉద్యమ స్ఫూర్తి ఎన్నటికీ వృథా కాదన్నారు. ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం గతంలో మాదిరిగానే సామాన్యుల సమస్యలను గాలికి వదిలి భూములు గుంజుకోవడం, కార్మికచట్టాలను నీరుగార్చడం చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జుత్తిగ నర్సింహమూర్తి, జేఎన్‌వీ గోపాలన్, డి.సత్యనారాయణ, బీవీ వర్మ, బి.ఆంజనేయులు పాల్గొన్నారు