
విజయవాడ: అమ్మగా మారిన తర్వాత కూడా ఆటలో సత్తా చూపేందుకు బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్, టెన్నిస్ తార సెరెనా విలియమ్స్‌లే తనలో స్ఫూర్తి కలిగించారని ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపి వెల్లడించింది. తన ఇటీవలి విజయం విశేషాలను వెల్లడిస్తూ హంపి ఈ వ్యాఖ్య చేసింది. తల్లి అయిన తర్వాత కూడా మేరీ కోమ్, సెరెనాలు వారి వారి క్రీడాంశాల్లో విశేషంగా రాణిస్తున్నారని, వారిలా తాను కూడా బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత తనకిష్టమైన రంగంలో పునరాగమనం చేయాలని అనుకున్నానని హంపి అన్నారు. అయితే ప్రపంచ చాంపియన్ అనే బిరుదు ఇంత త్వరగా లభిస్తుందని కలలో కూడా ఊహించలేదని, ఇందులో తన కుటుంబం పాత్ర ఎంతో ఉందని ఆమె తెలిపింది.
‘ నేను నా పునరాగమనం కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదాన్ని. అందుకోసం ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నా. పాప పుట్టిన రోజే సంవత్సరం తర్వాత తిరిగి చెస్ ఆడాలని నిర్ణయించుకున్నా. అదే విధంగా చేశాను కూడా.’ అంటూ హంపి తన ప్రణాళిక గురించి తెలియజేసింది. ఓవరాల్‌గా తన 2019 ఏడాది ఘనంగా గడిచిందని... క్లాసికల్ విభాగంలో 30 రేటింగ్ పాయింట్లను, ర్యాపిడ్ విభాగంలో 45 రేటింగ్ పాయింట్లను సాధించానని గర్వంగా చెప్పుకుంది.
Comments
Please login to add a commentAdd a comment