జ్యోతి (గతంలో)..; జ్యోతి
ఆడపిల్లనా?! తీసేయ్... పారేయ్... వదిలేయ్.. ఈ మాటలు భారతావనిలో ఇంకా ఇంకా వినపడుతూనే ఉన్నాయి. వదిలేసినా.. పారేసినా.. ఆడపిల్ల .. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉంది. సమాజంలో తన ఉనికిని చాటుతూనే ఉంది. అచ్చం జ్యోతి లా. కన్నతల్లి పారేసిన చెత్త కుప్పలో నుంచి వచ్చిన జ్యోతి మరికొందరు ఆడపిల్లల కళ్లల్లో ఆశాకిరణాలు నింపుతోంది.
బీహార్ రాజధాని పట్నాలో పంతొమ్మిదేళ్ల క్రితం ఆడపిల్ల భారమనుకొని, పుట్టిన వెంటనే ఆ పసికందును చెత్త కుప్పలో పడేసిందో తల్లి. గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డ రోదనలు విన్న భిక్షకురాలు కరీదేవి ఆ బిడ్డను తీసుకుంది. పదేళ్లు తనతో తిప్పుతూ పెంచింది. ఆమెతోపాటు భిక్షమెత్తుకుంటూ, చెత్తను సేకరిస్తూ పెద్దదయ్యింది ఆ పాప. ఇప్పుడు కెఫేలో ఉద్యోగం చేసుకుంటూ, తన కాళ్ల మీద తను జీవిస్తూ, 12వ తరగతి చదువుతోంది.
చిన్నవయసు నేర్పిన పాఠాలతో కొత్త జీవితాన్ని నిర్మించుకుంటున్న ఆ అమ్మాయి పేరు జ్యోతి. ఇప్పుడు 19 ఏళ్లు. అనాథలైన పిల్లలు ఎవరైనా జంక్షన్లలో కనిపిస్తే అక్కడి పోలీసులు జ్యోతిని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని, జీవితాన్ని బాగుచేసుకోమని చెబుతున్నారు. జ్యోతి తను నడిచొచ్చిన దారుల గురించి చెబుతూ, సమాజాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది..
ఒక మాంసపు ముక్కనా?!
‘‘నేను దాదాపు పదేళ్లు అడుక్కున్నాను. నా ఒంటికి చెత్త అంటుకోని క్షణం లేదు. రోడ్డు మీద ఎన్నో ఏళ్ల రాత్రులు గడిపాను. నేను ఆడపిల్లను కాబట్టి ఓ మాంసపు ముక్కలా చెత్తలో పడేశారు. అదే, అబ్బాయి అయితే ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. మా అమ్మ నన్ను ఎందుకు పారేసిందో నాకు తెలియదు. నన్ను తన పొత్తిళ్లలోకి తీసుకుంది కరీదేవి అమ్మ.
భిక్షాటన చేసుకుంటూ బతికేది. మా పాట్నా జంక్షన్ లో రోడ్డుపక్కన నన్ను చూసుకోవడం మొదలుపెట్టినప్పుడే ఇదంతా నాకు తెలిసింది. పదేళ్లు అదే పాట్నా జంక్షన్ లో నేనూ భిక్షాటన చేశాను. చెత్తను సేకరించాను. ఈ మధ్యలో కరీదేవి అమ్మ చనిపోయింది. అప్పటినుంచి ఆమె కొడుకు రాజ్‌దేవ్ పాశ్వాన్ నన్ను పెంచాడు. ఈ ఇద్దరు లేకపోతే నేను ఈ రోజున ఇలా ఉండేదాన్నే కాదు.
ఏడుపుతోనే రోజెందుకు మొదలయ్యేది?!
పదేళ్లు భిక్షాటన చేస్తూ చెత్తను సేకరించాను. ఆ అనుభవాలు నానుంచి ఎప్పటికీ దూరం కావు. అది అప్పుడు నా పని. చలి, ఎండా, వాన ఏ కాలమైనా చెత్తలో తిరగాలి. దొరికిన దానితో కడుపు నింపుకోవాలి. చెత్తలో పండు ముక్క కనిపించినప్పుడల్లా దానికోసం నా తోటి పిల్లలంతా పోట్లాడుకునేవాళ్లం. రైలులో సీసాలు తీయడం. రోజంతా భిక్షాటన చేస్తూ కూడబెట్టిన డబ్బుతో జీవనం. కరీదేవి అమ్మ పోయాక ఆమె కొంగు కూడా దూరమయ్యింది. గుడి బయట పడుకుంటే తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో పూజారి వచ్చి, ముఖాన నీళ్లు చల్లి లేపేసేవాడు. ఏడుస్తూ మేలుకునేదాన్ని. అప్పటినుండి ఉదయం పని మొదలయ్యేది.
సమాజానికి కూడా చిన్నచూపెందుకు?!
చలికాలంలో ఎముకలు కొరికేసే చలి. చెత్తకుప్పల దగ్గర ఉండే టెంట్లలాంటి ఇళ్లలో ఎలుకలు. ఎవరైనా దయతలిచి దుప్పటి ఇస్తే అవి ఎలుకలు కొరికేసేవి. చిరుగుల దుప్పటితో ఏళ్లు గడిచిపోయేవి. ఆడపిల్ల అనే శిక్ష నన్ను కన్నవాళ్లే కాదు సమాజం కూడా వేసింది. జంక్షన్ లో భిక్షాటన చేసే మనుషుల అకృత్యాలను చూసి భయపడి పారిపోయిన సంఘటనలు ఎన్నో. వయసు చిన్నదే అయినా అనుభవాలు పెద్దదాన్ని చేశాయి.
సంజీవని దొరకకపోతే..!
స్థానిక రాంబో హోమ్ ఫౌండేషన్ నా దుస్థితిని మార్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు క్రీడలు, ఆటలు చదవడం నేర్పించారు. అంతకుముందు చదువు అనే విషయం కూడా నాకు తెలియదు. ఆ ఇంటిని మొదటిసారి చూసి షాక్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు అంటే ఎలా ఉంటుందో తెలిసింది. అలంకరించిన గదులు, బొమ్మలు చూశాను. నాలాంటి పిల్లలను ఇంకొంతమందిని కలుసుకున్నాను. దీంతో నన్ను వదిలేసిన తల్లి తిరిగి దొరికినంత సంబరంగా అనిపించింది.
కొత్త స్నేహితులు కూడా దొరికారు. రోజంతా పెన్ను, పేపర్‌తో ఉండిపోయేదాన్ని. చదువువొక్కటే నా జీవితాన్ని మార్చేస్తుందని నాకనిపించింది. చిన్నతనంలో పట్నా జంక్ష¯Œ లో చదువుకోవడానికి వెళుతున్న నా ఈడు పిల్లలను చూసి, నాకు కూడా చదువుకోవాలనే కోరిక ఉండేది. అది తీరే కలేనా అనుకున్నాను. కానీ, నా కల నెరవేరేరోజు వచ్చింది. అక్షరాలు నేర్పించి, ఆరో తరగతి లో చేర్చారు ఫౌండేషన్ నిర్వాహకులు.
మూడు నెలల కోర్స్...
సంస్థ ద్వారా పాఠశాలకు వెళ్లాను. అక్కడున్న టీచర్లు చెప్పినవి శ్రద్ధగా విన్నాను. అయితే, ఎక్కువ రోజులు బడిలో కూర్చోలేదు. ఓపెన్‌గానే పదవతరగతి పరీక్ష రాసి పాసయ్యాను. ఇప్పుడు 12 వ తరగతి చదువుతున్నాను. చదువుతోపాటు లెమన్ కేఫ్‌లో పనిచేస్తున్నాను. కేఫ్‌లో పనిచేసే ముందు మూడు నెలల మార్కెటింగ్ కోర్సు కూడా చేశాను. ఆ తర్వాత సేల్స్‌గర్ల్‌గా ఆరునెలలు పనిచేశాను.
‘కేఫ్’ మేనేజర్
ప్రస్తుతం నేను బీహార్‌లోని లెమన్ కేఫ్‌కి మేనేజర్‌గా పనిచేస్తున్నాను. చదువుతోపాటు, ఉద్యోగమూ చేసుకుంటున్నాను. నా జీతంలో సగం డబ్బును నన్ను చదివించిన సంస్థకు విరాళంగా ఇస్తున్నాను. ఒకప్పుడు నేను పెరిగిన పట్నా జంక్షన్ మీదుగా అప్పుడప్పుడు వెళుతుంటాను. అక్కడ పోలీసులు నన్ను గుర్తుపట్టి, ఆప్యాయంగా పలకరిస్తారు. చదువు ఎలా సాగుతోందని, ఎలా ఉన్నావంటూ అడుగుతుంటారు. అక్కడ భిక్షాటన చేసే పిల్లలు ఎవరైనా ఉంటే చాలు .. పిలిచి మరీ నన్ను చూపించి వారికి పరిచయం చేస్తారు.
‘ఒకప్పుడు మీలాగే ఈ జ్యోతి ఉండేది. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో. మీరూ ఈ జ్యోతిలా తయారవ్వాలి. ఇలా భిక్షాటన చేయొద్దు. అందుకు, ఎక్కడుండాలో మేం చెబుతాం...’ అంటూ వారికి మంచి మాటలు చెబుతారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చెత్తకుప్పలో ఓ మాంసం ముక్క అనుకొని పడేసిన ఈ ఆడపిల్ల చనిపోలేదు. కానీ, ప్రతిరోజూ చస్తూ బతికింది. ఇప్పుడున్న ఈ జీవితంలో ఆడపిల్లల కోసం మంచిపని చేసే విధంగా మలుచుకోవాలని ఉంది. ఆ విధంగానే కృషి చేస్తున్నాను’’ అంటూ వివరిస్తుంది జ్యోతి.
‘ఆడపిల్ల అంటే ఎందుకంత చిన్నచూపు?’ అని ప్రశ్నించే జ్యోతిలాంటి అమ్మాయిలందరికీ సమాజం ఏం సమాధానం చెబుతుంది?!
Comments
Please login to add a commentAdd a comment