girl baby
-
అక్కకు పిల్లలు పుట్టరని చెల్లెలు నిర్వాకం.. పసికందు అమ్మమ్మకు విషయం తెలియడంతో..
సాక్షి హైదరాబాద్: మూడురోజుల ఆడ శిశువును విక్రయించిన తల్లిదండ్రులను, కొనుగోలు చేసిన అక్కాచెల్లెలిని, ఆశావర్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురం ఏసీపీ కార్యాలయంలో సోమవారం ఏసీపీ పురుషోత్తంరెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. ఏపీలోని ఆలూరుకు చెందిన దుర్గాప్రియ, శ్రీనివాస్ దంపతులు కమలానగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. గాంధీ ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం దుర్గాప్రియకు కూతురు జన్మించింది.అయితే దుర్గాప్రియ, ఆమె భర్త శ్రీనివాస్‌లు బాలనగర్‌కు చెందిన కవితకు రూ.80 వేలకు విక్రయించేందుకు ఆశావర్కర్ బాషమ్మ ద్వారా ఒప్పందం కుదుర్చుకుని విక్రయించారు. తన సోదరి ధనమ్మకు పిల్లలు పుట్టరని తేలడంతో అక్క కవిత ఈ కొనుగోలు చేసింది. విషయం తెలుసుకున్న దుర్గాప్రియ తల్లి బాలగోని రాజేశ్వరీ వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసునమోదు చేసుకున్న సీఐ సత్యనారాయణ విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకొని చిన్నారిని శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పజెప్పారు. శిశువును విక్రయించిన తల్లిదండ్రులు దుర్గాప్రియ, శ్రీనివాస్, ఆశావర్కర్ బాషమ్మ, కొనుగోలు చేసిన కవిత,ఆమె సోదరి ధనమ్మలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. (చదవండి: భర్త వేధింపులు.. స్కిన్ ఎలర్జీ తగ్గిస్తానని స్టెరాయిడ్స్ ఇచ్చి) -
కొత్త జీవితం.. ఆడపిల్ల భారమా?!
ఆడపిల్లనా?! తీసేయ్... పారేయ్... వదిలేయ్.. ఈ మాటలు భారతావనిలో ఇంకా ఇంకా వినపడుతూనే ఉన్నాయి. వదిలేసినా.. పారేసినా.. ఆడపిల్ల .. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉంది. సమాజంలో తన ఉనికిని చాటుతూనే ఉంది. అచ్చం జ్యోతి లా. కన్నతల్లి పారేసిన చెత్త కుప్పలో నుంచి వచ్చిన జ్యోతి మరికొందరు ఆడపిల్లల కళ్లల్లో ఆశాకిరణాలు నింపుతోంది. బీహార్ రాజధాని పట్నాలో పంతొమ్మిదేళ్ల క్రితం ఆడపిల్ల భారమనుకొని, పుట్టిన వెంటనే ఆ పసికందును చెత్త కుప్పలో పడేసిందో తల్లి. గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డ రోదనలు విన్న భిక్షకురాలు కరీదేవి ఆ బిడ్డను తీసుకుంది. పదేళ్లు తనతో తిప్పుతూ పెంచింది. ఆమెతోపాటు భిక్షమెత్తుకుంటూ, చెత్తను సేకరిస్తూ పెద్దదయ్యింది ఆ పాప. ఇప్పుడు కెఫేలో ఉద్యోగం చేసుకుంటూ, తన కాళ్ల మీద తను జీవిస్తూ, 12వ తరగతి చదువుతోంది. చిన్నవయసు నేర్పిన పాఠాలతో కొత్త జీవితాన్ని నిర్మించుకుంటున్న ఆ అమ్మాయి పేరు జ్యోతి. ఇప్పుడు 19 ఏళ్లు. అనాథలైన పిల్లలు ఎవరైనా జంక్షన్లలో కనిపిస్తే అక్కడి పోలీసులు జ్యోతిని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని, జీవితాన్ని బాగుచేసుకోమని చెబుతున్నారు. జ్యోతి తను నడిచొచ్చిన దారుల గురించి చెబుతూ, సమాజాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది.. ఒక మాంసపు ముక్కనా?! ‘‘నేను దాదాపు పదేళ్లు అడుక్కున్నాను. నా ఒంటికి చెత్త అంటుకోని క్షణం లేదు. రోడ్డు మీద ఎన్నో ఏళ్ల రాత్రులు గడిపాను. నేను ఆడపిల్లను కాబట్టి ఓ మాంసపు ముక్కలా చెత్తలో పడేశారు. అదే, అబ్బాయి అయితే ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. మా అమ్మ నన్ను ఎందుకు పారేసిందో నాకు తెలియదు. నన్ను తన పొత్తిళ్లలోకి తీసుకుంది కరీదేవి అమ్మ. భిక్షాటన చేసుకుంటూ బతికేది. మా పాట్నా జంక్షన్ లో రోడ్డుపక్కన నన్ను చూసుకోవడం మొదలుపెట్టినప్పుడే ఇదంతా నాకు తెలిసింది. పదేళ్లు అదే పాట్నా జంక్షన్ లో నేనూ భిక్షాటన చేశాను. చెత్తను సేకరించాను. ఈ మధ్యలో కరీదేవి అమ్మ చనిపోయింది. అప్పటినుంచి ఆమె కొడుకు రాజ్దేవ్ పాశ్వాన్ నన్ను పెంచాడు. ఈ ఇద్దరు లేకపోతే నేను ఈ రోజున ఇలా ఉండేదాన్నే కాదు. ఏడుపుతోనే రోజెందుకు మొదలయ్యేది?! పదేళ్లు భిక్షాటన చేస్తూ చెత్తను సేకరించాను. ఆ అనుభవాలు నానుంచి ఎప్పటికీ దూరం కావు. అది అప్పుడు నా పని. చలి, ఎండా, వాన ఏ కాలమైనా చెత్తలో తిరగాలి. దొరికిన దానితో కడుపు నింపుకోవాలి. చెత్తలో పండు ముక్క కనిపించినప్పుడల్లా దానికోసం నా తోటి పిల్లలంతా పోట్లాడుకునేవాళ్లం. రైలులో సీసాలు తీయడం. రోజంతా భిక్షాటన చేస్తూ కూడబెట్టిన డబ్బుతో జీవనం. కరీదేవి అమ్మ పోయాక ఆమె కొంగు కూడా దూరమయ్యింది. గుడి బయట పడుకుంటే తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో పూజారి వచ్చి, ముఖాన నీళ్లు చల్లి లేపేసేవాడు. ఏడుస్తూ మేలుకునేదాన్ని. అప్పటినుండి ఉదయం పని మొదలయ్యేది. సమాజానికి కూడా చిన్నచూపెందుకు?! చలికాలంలో ఎముకలు కొరికేసే చలి. చెత్తకుప్పల దగ్గర ఉండే టెంట్లలాంటి ఇళ్లలో ఎలుకలు. ఎవరైనా దయతలిచి దుప్పటి ఇస్తే అవి ఎలుకలు కొరికేసేవి. చిరుగుల దుప్పటితో ఏళ్లు గడిచిపోయేవి. ఆడపిల్ల అనే శిక్ష నన్ను కన్నవాళ్లే కాదు సమాజం కూడా వేసింది. జంక్షన్ లో భిక్షాటన చేసే మనుషుల అకృత్యాలను చూసి భయపడి పారిపోయిన సంఘటనలు ఎన్నో. వయసు చిన్నదే అయినా అనుభవాలు పెద్దదాన్ని చేశాయి. సంజీవని దొరకకపోతే..! స్థానిక రాంబో హోమ్ ఫౌండేషన్ నా దుస్థితిని మార్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు క్రీడలు, ఆటలు చదవడం నేర్పించారు. అంతకుముందు చదువు అనే విషయం కూడా నాకు తెలియదు. ఆ ఇంటిని మొదటిసారి చూసి షాక్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు అంటే ఎలా ఉంటుందో తెలిసింది. అలంకరించిన గదులు, బొమ్మలు చూశాను. నాలాంటి పిల్లలను ఇంకొంతమందిని కలుసుకున్నాను. దీంతో నన్ను వదిలేసిన తల్లి తిరిగి దొరికినంత సంబరంగా అనిపించింది. కొత్త స్నేహితులు కూడా దొరికారు. రోజంతా పెన్ను, పేపర్‌తో ఉండిపోయేదాన్ని. చదువువొక్కటే నా జీవితాన్ని మార్చేస్తుందని నాకనిపించింది. చిన్నతనంలో పట్నా జంక్ష¯Œ లో చదువుకోవడానికి వెళుతున్న నా ఈడు పిల్లలను చూసి, నాకు కూడా చదువుకోవాలనే కోరిక ఉండేది. అది తీరే కలేనా అనుకున్నాను. కానీ, నా కల నెరవేరేరోజు వచ్చింది. అక్షరాలు నేర్పించి, ఆరో తరగతి లో చేర్చారు ఫౌండేషన్ నిర్వాహకులు. మూడు నెలల కోర్స్... సంస్థ ద్వారా పాఠశాలకు వెళ్లాను. అక్కడున్న టీచర్లు చెప్పినవి శ్రద్ధగా విన్నాను. అయితే, ఎక్కువ రోజులు బడిలో కూర్చోలేదు. ఓపెన్‌గానే పదవతరగతి పరీక్ష రాసి పాసయ్యాను. ఇప్పుడు 12 వ తరగతి చదువుతున్నాను. చదువుతోపాటు లెమన్ కేఫ్‌లో పనిచేస్తున్నాను. కేఫ్‌లో పనిచేసే ముందు మూడు నెలల మార్కెటింగ్ కోర్సు కూడా చేశాను. ఆ తర్వాత సేల్స్‌గర్ల్‌గా ఆరునెలలు పనిచేశాను. ‘కేఫ్’ మేనేజర్ ప్రస్తుతం నేను బీహార్‌లోని లెమన్ కేఫ్‌కి మేనేజర్‌గా పనిచేస్తున్నాను. చదువుతోపాటు, ఉద్యోగమూ చేసుకుంటున్నాను. నా జీతంలో సగం డబ్బును నన్ను చదివించిన సంస్థకు విరాళంగా ఇస్తున్నాను. ఒకప్పుడు నేను పెరిగిన పట్నా జంక్షన్ మీదుగా అప్పుడప్పుడు వెళుతుంటాను. అక్కడ పోలీసులు నన్ను గుర్తుపట్టి, ఆప్యాయంగా పలకరిస్తారు. చదువు ఎలా సాగుతోందని, ఎలా ఉన్నావంటూ అడుగుతుంటారు. అక్కడ భిక్షాటన చేసే పిల్లలు ఎవరైనా ఉంటే చాలు .. పిలిచి మరీ నన్ను చూపించి వారికి పరిచయం చేస్తారు. ‘ఒకప్పుడు మీలాగే ఈ జ్యోతి ఉండేది. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో. మీరూ ఈ జ్యోతిలా తయారవ్వాలి. ఇలా భిక్షాటన చేయొద్దు. అందుకు, ఎక్కడుండాలో మేం చెబుతాం...’ అంటూ వారికి మంచి మాటలు చెబుతారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చెత్తకుప్పలో ఓ మాంసం ముక్క అనుకొని పడేసిన ఈ ఆడపిల్ల చనిపోలేదు. కానీ, ప్రతిరోజూ చస్తూ బతికింది. ఇప్పుడున్న ఈ జీవితంలో ఆడపిల్లల కోసం మంచిపని చేసే విధంగా మలుచుకోవాలని ఉంది. ఆ విధంగానే కృషి చేస్తున్నాను’’ అంటూ వివరిస్తుంది జ్యోతి. ‘ఆడపిల్ల అంటే ఎందుకంత చిన్నచూపు?’ అని ప్రశ్నించే జ్యోతిలాంటి అమ్మాయిలందరికీ సమాజం ఏం సమాధానం చెబుతుంది?! -
పొట్టి బట్టలు వేసుకోవద్దన్నారు.. ఇప్పుడు అంతా మెచ్చుకుంటున్నారు
‘ఆటలాడితే ఏమొస్తుంది’ అన్నారు తల్లిదండ్రులు. ‘నేను ఆడతాను’ అంది నిషా. ‘పొట్టి బట్టలు వేసుకోకూడదు’ అన్నారు మత పెద్దలు. ‘నేను లెగ్గింగ్స్ వేసుకుని ఆడతాను’ అంది నిషా. ‘మేము బూట్లు బ్యాటు ఏమీ కొనివ్వ లేము’ అన్నారు అయినవాళ్లు. ‘నేనే ఎలాగో తిప్పలు పడతాను’ అంది నిషా. హర్యానాలో సోనిపట్‌లో 25 చదరపు మీటర్ల ఇంట్లో నివాసం ఉండే నిషా ఇవాళ మహిళా హాకీ టీమ్ లో ఇంత పెద్ద దేశానికి పతకం కోసం పోరాడుతోంది.. ‘మాకు మూడో కూతురుగా నిషా పుట్టింది. మళ్లీ ఆడపిల్లా అని బంధువులు హేళన చేశారు. ఇవాళ బ్యాట్‌తో సమాధానం చెప్పింది’ అని ఆనందబాష్పాలు రాలుస్తున్నారు తల్లిదండ్రులు. ఒక సన్నివేశం ఊహించండి. తొమ్మిదేళ్ల వయసు నుంచి హాకీ ఆడుతోంది ఆ అమ్మాయి. గుర్తింపు వచ్చి జాతీయ స్థాయిలో ఆడే రోజులు వచ్చాయి. ఇక దేశానికి పేరు తెలియనుంది. ఏమో... రేపు ప్రపంచానికి తెలియవచ్చేమో. కాని ఆ సమయంలోనే తండ్రికి పక్షవాతం వస్తుంది. ముగ్గురు కూతుళ్లున్న ఆ ఇంట్లో ఆ తండ్రి జీవనాధారం కోల్పోతే తినడానికి తిండే ఉండదు. ఇప్పుడు తండ్రి స్థానంలో బాధ్యత తీసుకోవాలా బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి దిగాలా? దిగినా కుదురుగా ఆడగలదా తను? అలాంటి పరిస్థితిలో ఆడగలరా ఎవరైనా అని ఆలోచించండి. ఆడగలను అని నిరూపించిన నిషా వర్శీని చూడండి. ఆమె పోరాటం తెలుస్తుంది. ఆమె నుంచి ఎలా స్ఫూర్తి పొందాలో తెలుస్తుంది. టైలర్ కూతురు హర్యానాలోని సోనిపట్‌లో పేదలవాడలో పుట్టింది నిషా వర్శి. తండ్రి షొహ్రబ్ వర్శి టైలర్. ముగ్గురు కూతుళ్లు. మూడో కూతురుగా నిషా జన్మించింది. టైలర్‌గా సంపాదించి ఆ ముగ్గురు కూతుళ్లను సాకి వారికి పెళ్లి చేయడమే పెద్దపని అనుకున్నాడు షొహ్రబ్. ‘పాపం... ముగ్గురు కూతుళ్లు’ అని బంధువులు జాలిపడేవారు అతణ్ణి చూసి. మూడోసారి కూతురు పుడితే ‘మూడోసారి కూడానా. ఖర్మ’ అని అన్నవాళ్లు కూడా ఉన్నారు. షొహ్రబ్ ఏమీ మాట్లాడలేదు. ముగ్గురిని ప్రాణంగా చూసుకున్నాడు. నిషా వర్శి హాకీ ఆడతానంటే ‘మన ఇళ్లల్లో ఆడపిల్లలు ఆటలు ఆడలేదు ఎప్పుడూ’ అన్నాడు. కాని తల్లి మెహరూన్ కూతురి పట్టుదల గమనించింది. ఆడనిద్దాం అని భర్తకు సర్దిచెప్పింది. నిషా వర్శి తల్లిదండ్రులు ఎన్నో అడ్డంకులు క్రీడల్లో రాణించడం, అందుకు తగిన పౌష్టికాహారం తినడం, ట్రైనింగ్ తీసుకోవడం, అవసరమైన కిట్లు కొనుక్కోవడం ఇవన్నీ పేదవారి నుదుటిరాతలో ఉండవు. కలలు ఉండొచ్చు కాని వాటిని నెరవేర్చుకోవడం ఉండదు. కాని నిషా పట్టుపట్టింది. ప్రస్తుతం భారత హాకీ టీమ్‌లో ఆడుతున్న నేహా గోయల్ కూడా ఆమె లాంటి నేపథ్యంతో ఆమె వాడలోనే ఉంటూ ఆమెకు స్నేహితురాలై హాకీ ఆడదామని ఉత్సాహపరిచింది. ఇద్దరూ మంచి దోస్తులయ్యారు. కాని తెల్లవారి నాలుగున్నరకు గ్రౌండ్లో ఉండాలంటే తల్లిదండ్రులు నాలుగ్గంటలకు లేవాల్సి వచ్చేది. తల్లి ఏదో వొండి ఇస్తే తండ్రి ఆమెను సైకిల్ మీద దించి వచ్చేవాడు. ఒక్కోసారి తల్లి వెళ్లేది. వారూ వీరు చూసి ‘ఎందుకు ఈ అవస్థ పడతారు. దీని వల్ల అర్దనానా కాణీనా’ అని సానుభూతి చూపించేవారు. మరొకటి ఏమంటే– ఇస్లాంలో మోకాళ్ల పైభాగం చూపించకూడదని భావిస్తారు. హాకీ స్కర్ట్ మోకాళ్ల పైన ఉంటుంది. మత పెద్దల నుంచి అభ్యంతరం రాకూడదని కోచ్‌కు చెప్పి లెగ్గింగ్స్ తో ఆడటానికి ఒప్పించింది నిషా. ఒలింపిక్స్‌లో కూడా లెగ్గింగ్స్తోనే ఆడింది. కొనసాగిన అపనమ్మకం 2016లో తండ్రి పక్షవాతానికి గురయ్యాక దీక్ష వీడక ఆడి జాతీయ, అంతర్జాతీయ మేచెస్ లో గుర్తింపు పొందింది నిషా వర్శీ. రైల్వే బోర్డ్ టీమ్‌లో ఆడటం వల్ల ఆమెకు రైల్వేలో 2018లో ఉద్యోగం దొరికింది. పరిమిత నేపథ్యం ఉన్న నిషా కుటుంబానికి ఇదే పెద్ద అచీవ్మెంట్. ‘చాలమ్మా... ఇక హాకీ మానెయ్. పెళ్లి చేసుకో’ అని నిషాను ఒత్తిడి పెట్టసాగారు. అప్పటికి ఆమెకు 24 సంవత్సరాలు వచ్చాయి. ఇంకా ఆలస్యమైతే పెళ్లికి చిక్కులు వస్తాయేమోనని వారి ఆందోళన. కాని నిషాకు ఎలాగైనా ఒలింపిక్స్‌లో ఆడాలని పట్టుదల. ‘ఒలింపిక్స్‌లో ఆడేంత వరకూ నన్ను వదిలేయండమ్మా’ అని తల్లిదండ్రులకు చెప్పింది. కుటుంబం మంచి చెడ్డలు చూసుకుంటానని మేనమామ హామీ ఇచ్చాక పూర్తిగా ఆట మీదే ధ్యాస పెట్టింది. ఆమె గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఇంటికి వెళ్లడమే లేదు. హాకీ సాధనలో, ఒలింపిక్స్ కోసం ఏర్పాటు చేసిన ట్రయినింగ్ క్యాంప్‌లో ఉండిపోయింది. చివరకు ఆస్ట్రేలియా మీద గెలిచాక సగర్వంగా ఇంటికి ఫోన్ చేసింది. అవును.. ఆడపిల్లే గొప్ప ఒకప్పుడు ఆడపిల్ల అని తక్కువ చూసి బంధువులు, అయినవారే ఇప్పుడు నిషాలోని గొప్పతనం అంగీకరిస్తున్నారు. ప్రతిభకు, ఆటకు, కుటుంబానికి, జీవితానికి కూడా ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా సమానమే అని భావన తన సమూహంలో చాలా బలంగా ఇప్పుడు నిషా తీసుకెళ్లగలిగింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా గోల్ కొట్టడమే అసలైన ప్రతిభ. తాను అలాంటి గోల్ కొట్టి ఇవాళ హర్షధ్వానాలు అందుకుంటోంది నిషా. -
అయ్యో తల్లి.. ఆ చిరుత పులి నీపై కనికరం చూపలేకపోయిందా
జమ్ము-కాశ్మీర్ : ఇంటి చుట్టూ ఆహ్లాదకర వాతావారణం. ఆడుకునేందుకు అనువైన ప్రాంతం. ఓ చిన్నారి ఇంటి లాన్లో ఆటలాడుకుంటూ అనంతలోకాల్లో కలిసి పోయింది. అప్పటి వరకు ఆడుకుంటూఉన్న చిన్నారి విగతజీవిగా కనిపించడంతో స్థానికుల గుండె తరుక్కుపోయింది జమ్మూ-కాశ్మీర్‌లోని బూద్గాం జిల్లా ఓంపోరా హౌసింగ్ కాలనీలో నాలుగేళ్ల చిన్నారి అధా యాసిర్ ఇంటి పరిసరాల్లో ఆడుకుంటుంది. అయితే లాన్లో ఆడుకుంటున్న ఆధా ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చింది. పాప ఏడుపు విన్న కుటుంబసభ్యులు ఏమైందోనని కంగారు పడ్తూ వచ్చి చూడాగా పాప కనిపించలేదు. దీంతో పాప కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఇల్లు, కాలనీ పరిసరాల్ని పరిశీలించారు. స్థానికులు మాత్రం అప్పటి వరకు చిన్నారి ఆధా ఆడుకుంటుండగా తాము గమనించినట్లు చెప్పారు. అయితే పాప ఆచూకీ ఎంతకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటి సమీపంలో చెప్పులు, మెడలోని హారం లభ్యమయ్యాయి. కానీ పాప ఎక్కడుందో తెలియదు. కానీ గాలింపు చర్యల్లో మరుసటి రోజు ఇంటి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో చిన్నారి మృతదేహం లభ్యమైనట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. పాపను చిరుత పులి చంపి ఉంటుందని జిల్లా సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ తాహిర్ సలీమ్ తెలిపారు. చిన్నారి మరణంపై స్థానికులు, పలువురు రాజకీయ నేతలు అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అటవీ ప్రాంతం. వన్యప్రాణాలు తిరుగుతుంటాయి. అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. చైన్ ఫెన్సింగ్ నిర్మాణంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఉండి ఉంటే పాప ప్రాణాలు దక్కేవని మండిపడుతున్నారు. చదవండి : నేను రాజుని.. ఇంటి బయటకు పిలిచి ఆగి ఉన్న కార్ల మధ్యలో దారుణం -
నలుగురు ఆడపిల్లల జననం: అత్తామామ, భర్త కలిసి..
భోపాల్: ఆడపిల్లలనే కంటోందని.. అత్తామామలు కోడలిని తీవ్రంగా వేధించారు. ఒక మగబిడ్డకు జన్మనివ్వడం లేదనే ఆగ్రహంతో కోడలిని దారుణంగా హత్య చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. శివపురి జిల్లా దిండోలి గ్రామానికి చెందిన సావిత్రి భగేల్, రతన్‌సింగ్ భార్యాభర్తలు. ఇంతకుముందే ముగ్గురు ఆడపిల్లలు ఉండగా ఇటీవల సావిత్రి నాలుగో కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో భర్త రతన్‌సింగ్, అతడి తల్లిదండ్రులు కిలోల్డ్ సింగ్, బేను భాయ్ తీవ్రంగా వేధించడం మొదలుపెట్టారు. ఆడపిల్లలను కనడంపై తీవ్రంగా దూషిస్తూ దాడి చేస్తుండేవారు. తాజాగా నాలుగో బిడ్డ కూడా ఆడపిల్ల కావడంతో సావిత్రిని గురువారం భర్తతో పాటు అత్తామామ ఆమె గొంతు నులిమి హత్య చేశారు. తన సోదరి మృతి చెందడంపై సావిత్రి సోదరుడు కృష్ణ భగేల్ అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్తామామ, భర్త చేసిన అఘాయిత్యం బయటపడింది. దీంతో రతన్‌సింగ్, కిలోల్డ్ సింగ్, బేను భాయ్‌లను అరెస్ట్ చేశారు. పెళ్లయినప్పటి నుంచి అదనపు కట్నం కోసం తన సోదరిని వేధించేవాడని కూడా అతడు పోలీసులకు చెప్పాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. చదవండి: ఈ-పాస్ కోసం అప్లై..‘సిక్స్’ తెచ్చిన తంటాతో పరేషాన్ చదవండి: అడవిలో 18 ఏనుగుల అనుమానాస్పద మృతి -
పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
సాక్షి, గుంటూరు: ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి ఒడిగట్టిన నిందితుడికి జీవితకాల కఠిన కారాగారశిక్షతో సహా మూడు శిక్షలు, జరిమానాలు విధిస్తూ గుంటూరు ఒకటో అదనపు జిల్లా, పోక్సో కోర్టు జడ్జి శ్రీదేవి శుక్రవారం తీర్పు చెప్పారు. తెలంగాణ కు చెందిన బెలిదే వేణుగోపాల్ గుంటూరులోని ఒక హోటల్లో పనులు చేస్తూ రైలుపేటలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. పక్కింట్లో ఉంటున్న నేపాల్ దంపతుల ఐదేళ్ల కుమార్తెను వేణుగోపాల్ కిడ్నాప్ చేసి లైంగికదాడి చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కొత్తపేట పోలీసులు 2019 డిసెంబర్ 18న ఐపీసీ సెక్షన్లు 363, 366, 323, 376 (ఏబీ), పోక్సో చట్టం సెక్షన్ 6 కింద కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో దిశ చట్టానికి రూపకల్పన జరుగుతున్న సమయంలోనే ఈ కేసు నమోదైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎస్పీ సుప్రజ, సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ శివప్రసాద్ కేసు నమోదు చేసిన అనంతరం విచారణ, సాక్ష్యాధారాల సేకరణ వారంలో పూర్తిచేసి 10 రోజుల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారించిన జడ్జి.. బాలిక కిడ్నాప్, కొట్టడం, లైంగికదాడి ఇలా మూడు నేరాలకు మూడు రకాల శిక్షలను విధించారు. కిడ్నాప్‌నకు ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.500 జరిమానా, బాలికను కొట్టినందుకు ఒక సంవత్సరం సాధారణ జైలు, లైంగికదాడికి జీవితకాల కఠిన కారాగారశిక్ష, రూ.2,500 జరిమానా విధించారు. -
పత్రికా కథనంపై సీఎం జగన్ స్పందన.. చికిత్సకు ఆదేశాలు
సాక్షి, అమరావతి : ‘కరుణ చూపండి.. మరణం ప్రసాదించండి’ అనే శీర్షికన చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన చిన్నారి సుహానా ఆరోగ్య పరిస్థితిపై సాక్షి దినపత్రికలో శుక్రవారం ఓ కథనం వచ్చింది. ఏడాది వయసున్న సుహానా దీనావస్థపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. చిన్నారి ఆరోగ్యం గురించి చిత్తూరు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సుహానా చికిత్సకు అవసరమయ్యే ఖర్చును సీఎం సహాయనిధి నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. చిన్నారికి రోజువారీగా అవసరమయ్యే ఇన్సులిన్‌ను ప్రభుత్వ ఆసుపత్రి నుంచే ఉచితంగా అందించాలని స్పష్టం చేశారు. సుహానా ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య స్థితిని పర్యవేక్షించాలని సీఎం అధికారులకు చెప్పారు. మూడో బిడ్డకు అదే పరిస్థితి.. బి.కొత్తకోట బీసీ కాలనీకి చెందిన బావాజాన్, షబానాకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం అయింది. గతంలో ఈ దంపతులకు పుట్టిన ఇద్దరు పిల్లలు జన్మించిన కొద్ది రోజుల వ్యవధిలోనే షుగర్ స్ధాయి పడిపోవడంతో చనిపోయారు. ఈ క్రమంలో ఏడాది క్రితం జన్మించిన చిన్నారి సుహానాకు శారీరక ఎదుగుల లేకపోవడంతో వైద్యులను సంప్రదించారు. ఆమెకు కూడా షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పడంతో అప్పులు చేసి మరీ వైద్యం చేయిస్తూ వస్తున్నారు. అయితే, వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో సుహానాకు వైద్యం అందించడం గగనమవుతోంది. దీంతో చిన్నారి కారుణ్య మరణానికి అనుమతించాలంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన వివరాలు సాక్షి పత్రికలో ప్రచురితం కావడంతో సీఎం జగన్ స్పందించి చర్యలకు ఆదేశించారు. -
ఆ..డపిల్లానా!
-
భర్త ఇంటి ముందు భార్య నిరసన
తిరుమలలోని భవానీ నగర్లో ఓ దారుణం చోటుచేసుకుంది. ఆడిపిల్ల పుట్టిందని ఓ భర్త తన భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. అతడు పెట్టే బాధలు భరించలేక చివరికి పోలీసులను ఆశ్రయించింది. రక్షణ కల్పించాల్సిందిగా ఖాకీలను కోరింది. అయినా పోలీసుల నుంచి స్పందన కరువైంది. భర్త తనను వేధింపులకు గురిచేస్తున్నాడని మెరపెట్టుకున్న పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక చేసేదేమి లేక భర్త హరిప్రసాద్ ఇంటి ముందు ఆడ పసికందుతో భార్య నిరసనకు దిగినట్టు సమాచారం. -
ఆడపిల్లగా పుట్టడమే తప్పా!
మహా పుణ్యక్షేత్రమైన తిరుమల ఆలయం సమీపంలోని అంజనాద్రి నగర్లో మంగళవారం ఓ ఆడ పసికందు ప్రత్యక్షమైంది. కనీసం పురిటీ వాసన కూడా పోని 20 రోజుల పసికందును కనికరం లేకుండా వీధిపాలు చేశారు. పోషించే స్థాయి లేక భారమని వదిలించుకున్నారో, చీకటి పాపం వెంటాడుతుందనే భయపడ్డారో కనీసం పచ్చికూడా ఆరని ఆ పసికందును వీధికుక్కలపాలు చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆడపిల్ల కావడంతో వదిలివెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఆ పసికందు తమ సంరక్షణలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
అయ్యో ‘పాప’ం!
మారేడుపల్లి, న్యూస్‌లైన్: ఆ తల్లి ఏ తప్పు చేసిందో.. లేక ఏ కష్టమొచ్చిందో.. ఆడబిడ్డ అని తెలిసి పెంచే స్తోమత లేక వదిలించుకోవాలనుకుందో పాపం.. అప్పుడే పుట్టిన బొడ్డూడని ఆడబిడ్డను చెత్తకుండీ పాలు చేసింది. వీధి కుక్కులకు ఆహారం అవ్వాల్సిన ఆ శిశువు ఇద్దరు మావనతామూర్తుల సాయంతో బతికి బట్టకట్టింది. వివరాలిలా ఉన్నాయి. కార్ఖానా పోలీసుస్టేషన్ పరిధిలోని వాసవినగర్‌లోని కమ్యూనిటీహాల్ ఎదురుగా అక్కడే వున్న గాంధీ విగ్రహం సాక్షిగా చెత్త కుప్పలో గురువారం ఓ ఆడ పసికందును పడేసి వెళ్లింది ఓ తల్లి. అక్కడే కాస్త దూరంలో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న ఓ కార్మికురాలు అక్కడి చెత్త వేయడానికి వచ్చి చూడగా పసిబిడ్డ బట్టలో చుట్టి అగుపడింది. ఈ విషయాన్ని స్థానికులకు తెలిపింది. విషయం తెలుసుకున్న స్థానిక సామాజిక సేవా కార్యకర్త తేలుకుంట సతీష్‌కుమార్ గుప్తా సంఘటనా స్థలానికి వ చ్చారు. సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడే సమీపంలో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న వై. మహేశ్వరి సాయంతో పసికందును కట్టి ఉన్న ప్టాస్టిక్ కవరును తొలగించగా ఆ శిశువు కెవ్వున ఏడ్చింది. హమ్మయ్య.....పాప బతికే ఉందని అంతా అనందించారు. ఈ లోపు కార్ఖానా రక్షక్ వాహనం అక్కడికి చేరుకోగానే ఆ ఆడశిశువును సతీష్‌కుమార్ విక్రమ్‌పురిలో ఉన్న రెయిన్బో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్సలు నిర్వహించి నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రసుత్తం ఆ చిన్నారి క్షేమంగా ఉంది.