ఇటీవల కాలంలో పసికందులను వీధిపాలు చేసే ఘటనలు ఎక్కువైయ్యాయి. పుట్టింది ఆడపిల్ల అని తెలియగానే వదిలించుకోవాలని చూస్తున్నారు.
మహా పుణ్యక్షేత్రమైన తిరుమల ఆలయం సమీపంలోని అంజనాద్రి నగర్లో మంగళవారం ఓ ఆడ పసికందు ప్రత్యక్షమైంది. కనీసం పురిటీ వాసన కూడా పోని 20 రోజుల పసికందును కనికరం లేకుండా వీధిపాలు చేశారు. పోషించే స్థాయి లేక భారమని వదిలించుకున్నారో, చీకటి పాపం వెంటాడుతుందనే భయపడ్డారో కనీసం పచ్చికూడా ఆరని ఆ పసికందును వీధికుక్కలపాలు చేశారు.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆడపిల్ల కావడంతో వదిలివెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఆ పసికందు తమ సంరక్షణలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.