orphan girls
-
అధికారులే పెళ్లి పెద్దలుగా... సింధు కళ్యాణం
సాక్షి, హైదరాబాద్: యూసుఫ్‌గూడ మహిళా శిశుసంక్షేమశాఖ కార్యాలయం ప్రాంగణంలో బుధవారం అనాథ యువతికి అధికారులు వివాహం జరిపించారు. 28 ఏళ్ల క్రితం కొందరు ఒక శిశువును యూసుఫ్‌గూడ స్టేట్‌హోంలో అప్పగించారు. అధికారులు ఆ పాపను శిశువిహార్‌లో ఉంచి సింధుగా నామకరణం చేసి కొంతకాలం పెంచారు. అనంతరం అదే ప్రాంగణంలో ఉన్న బాలసదన్‌లో ఆశ్రయం పొంది విద్యనభ్యసించింది. ఇంటర్ పూర్తి కాగానే అక్కడ నుంచి బయటకు వచ్చి మోతీనగర్‌లో నివాసం ఉంటూ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో సింధు షాబాద్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఉపేందర్ అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా.. సింధు విషయాన్ని జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వరరావుకు తెలియజేసింది. ఈ మేరకు బుధవారం ఇరువురికి అధికారుల సమక్షంలో ఘనంగా వివాహం జరిపించారు. బాల సదన్‌లో పెరిగి వివాహం చేసుకున్న సరోజ దంపతులు సింధుకు కన్యాదానం చేశారు. ఈ వివాహానికి జిల్లా కలెక్టర్ శర్మన్‌తో పాటుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్, బాలల హక్కుల కమిషనర్ చైర్మన్ శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. (క్లిక్: పుల్లారెడ్డి స్వీట్స్: పుల్లారెడ్డి కొడుకు, మనవడికి కోర్టు నోటీసులు) -
ఎటు చూసినా చీకటే.. ఆ సమయంలో మేమున్నాంటూ..
గొలుగొండ(విశాఖ జిల్లా): పదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు మరణించినా లోటు తెలియకుండా పెంచారు.. వసతి కల్పించి, చదువు చెప్పించి పెంచి పెద్ద చేశారు.. పెళ్లి ఈడు రావడంతో చక్కని సంబంధం చూశారు.. ఊరంతా ఒక్కటై ఘనంగా వివాహం జరిపించారు.. కొత్త సంసారానికి కావలసిన సామగ్రిని సైతం తలా ఒకటి సమకూర్చారు.. అమ్మా నాన్నా ఉన్నా అంతకన్నా వేడుకగా జరపలేకపోయేవారేమో! ఇంతటి ఆదర్శవంతమైన ప్రేమానుబంధం వ్యక్తమైంది గొలుగొండ మండలం గుండుపాల గ్రామంలో.. ఆ అదృష్టవంతురాలి పేరు మాదబత్తుల అమరావతి. చదవండి: యువతి పరిచయం.. భార్యకు విడాకులు ఇచ్చేశానని నమ్మబలికి.. పసివయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారికి ఎటు చూసినా చీకటే.. ఆ సమయంలో మేమున్నాంటూ ముందుకు వచ్చారు బంధువులు, గ్రామస్తులు. గుండుపాల గ్రామానికి చెందిన మాదబత్తుల అమరావతి ఏనాడూ ఒంటరితనం అనుభవించలేదు. స్థానిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసేది. రాత్రి సమయంలో సమీప బంధువుల ఇంట్లో కడుపు నింపుకునేది. తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వ భూమిలో రేకుల షెడ్డు వేసి ఆమెకు బంధువులు నీడనిచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆమెకు యుక్త వయస్సు రావడంతో అందరూ కలిసి అక్షింతలు వేద్దామని నిర్ణయించుకున్నారు. అమరావతిని పెళ్లి కూతుర్ని చేసిన గుండుపాల గ్రామస్తులు అనుకున్నదే తడువుగా అమరావతికి పెళ్లి సంబంధాలు చూసేందుకు సిద్ధమయ్యారు. ఇదే మండలం లింగంపేటకు చెందిన బొద్దిన సురేష్ అయితే బాగుంటుందని అంతా నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు సరే.. పెళ్లి వేడుక అనేసరికి ఎంతో ఖర్చవుతుంది కదా.. దానిని సైతం అంతా భరించేందుకు ముందుకు వచ్చారు. స్థానికంగా నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు చుక్కల రాము ముందుకువచ్చి బాధ్యత తీసుకున్నారు. వీధిలోని చేనేత సామాజిక వర్గానికి చెందిన వారంతా చెవులకు బంగారు ఆభరణాలు చేయించారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లు కలిసి టేకు మంచం, కార్యదర్శి పరుపు, దిండ్లు, సచివాలయం మహిళా పోలీసులు బీరువా.. ఇలా తెలిసిన వారంతా చేతనైన సాయం చేసి అమరావతి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. ఆదివారం రాత్రి అమరావతి పెళ్లి వేడుక లింగంపేటలో ఘనంగా నిర్వహించారు. అరకు ఎంపీ మాధవి భర్త శివప్రసాద్, మాజీ మంత్రి సతీమణి పద్మావతి వధూవరులకు నూతన వ్రస్తాలతోపాటు ఆర్థిక సాయం అందజేశారు. ఊరంతా కలిసి తమ ఇంట్లో వేడుకగా భావించి గుండుపాల ఆడబిడ్డగా అమరావతిని అత్తారింటికి సాగనంపారు. -
కొత్త జీవితం.. ఆడపిల్ల భారమా?!
ఆడపిల్లనా?! తీసేయ్... పారేయ్... వదిలేయ్.. ఈ మాటలు భారతావనిలో ఇంకా ఇంకా వినపడుతూనే ఉన్నాయి. వదిలేసినా.. పారేసినా.. ఆడపిల్ల .. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉంది. సమాజంలో తన ఉనికిని చాటుతూనే ఉంది. అచ్చం జ్యోతి లా. కన్నతల్లి పారేసిన చెత్త కుప్పలో నుంచి వచ్చిన జ్యోతి మరికొందరు ఆడపిల్లల కళ్లల్లో ఆశాకిరణాలు నింపుతోంది. బీహార్ రాజధాని పట్నాలో పంతొమ్మిదేళ్ల క్రితం ఆడపిల్ల భారమనుకొని, పుట్టిన వెంటనే ఆ పసికందును చెత్త కుప్పలో పడేసిందో తల్లి. గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డ రోదనలు విన్న భిక్షకురాలు కరీదేవి ఆ బిడ్డను తీసుకుంది. పదేళ్లు తనతో తిప్పుతూ పెంచింది. ఆమెతోపాటు భిక్షమెత్తుకుంటూ, చెత్తను సేకరిస్తూ పెద్దదయ్యింది ఆ పాప. ఇప్పుడు కెఫేలో ఉద్యోగం చేసుకుంటూ, తన కాళ్ల మీద తను జీవిస్తూ, 12వ తరగతి చదువుతోంది. చిన్నవయసు నేర్పిన పాఠాలతో కొత్త జీవితాన్ని నిర్మించుకుంటున్న ఆ అమ్మాయి పేరు జ్యోతి. ఇప్పుడు 19 ఏళ్లు. అనాథలైన పిల్లలు ఎవరైనా జంక్షన్లలో కనిపిస్తే అక్కడి పోలీసులు జ్యోతిని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని, జీవితాన్ని బాగుచేసుకోమని చెబుతున్నారు. జ్యోతి తను నడిచొచ్చిన దారుల గురించి చెబుతూ, సమాజాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది.. ఒక మాంసపు ముక్కనా?! ‘‘నేను దాదాపు పదేళ్లు అడుక్కున్నాను. నా ఒంటికి చెత్త అంటుకోని క్షణం లేదు. రోడ్డు మీద ఎన్నో ఏళ్ల రాత్రులు గడిపాను. నేను ఆడపిల్లను కాబట్టి ఓ మాంసపు ముక్కలా చెత్తలో పడేశారు. అదే, అబ్బాయి అయితే ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. మా అమ్మ నన్ను ఎందుకు పారేసిందో నాకు తెలియదు. నన్ను తన పొత్తిళ్లలోకి తీసుకుంది కరీదేవి అమ్మ. భిక్షాటన చేసుకుంటూ బతికేది. మా పాట్నా జంక్షన్ లో రోడ్డుపక్కన నన్ను చూసుకోవడం మొదలుపెట్టినప్పుడే ఇదంతా నాకు తెలిసింది. పదేళ్లు అదే పాట్నా జంక్షన్ లో నేనూ భిక్షాటన చేశాను. చెత్తను సేకరించాను. ఈ మధ్యలో కరీదేవి అమ్మ చనిపోయింది. అప్పటినుంచి ఆమె కొడుకు రాజ్దేవ్ పాశ్వాన్ నన్ను పెంచాడు. ఈ ఇద్దరు లేకపోతే నేను ఈ రోజున ఇలా ఉండేదాన్నే కాదు. ఏడుపుతోనే రోజెందుకు మొదలయ్యేది?! పదేళ్లు భిక్షాటన చేస్తూ చెత్తను సేకరించాను. ఆ అనుభవాలు నానుంచి ఎప్పటికీ దూరం కావు. అది అప్పుడు నా పని. చలి, ఎండా, వాన ఏ కాలమైనా చెత్తలో తిరగాలి. దొరికిన దానితో కడుపు నింపుకోవాలి. చెత్తలో పండు ముక్క కనిపించినప్పుడల్లా దానికోసం నా తోటి పిల్లలంతా పోట్లాడుకునేవాళ్లం. రైలులో సీసాలు తీయడం. రోజంతా భిక్షాటన చేస్తూ కూడబెట్టిన డబ్బుతో జీవనం. కరీదేవి అమ్మ పోయాక ఆమె కొంగు కూడా దూరమయ్యింది. గుడి బయట పడుకుంటే తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో పూజారి వచ్చి, ముఖాన నీళ్లు చల్లి లేపేసేవాడు. ఏడుస్తూ మేలుకునేదాన్ని. అప్పటినుండి ఉదయం పని మొదలయ్యేది. సమాజానికి కూడా చిన్నచూపెందుకు?! చలికాలంలో ఎముకలు కొరికేసే చలి. చెత్తకుప్పల దగ్గర ఉండే టెంట్లలాంటి ఇళ్లలో ఎలుకలు. ఎవరైనా దయతలిచి దుప్పటి ఇస్తే అవి ఎలుకలు కొరికేసేవి. చిరుగుల దుప్పటితో ఏళ్లు గడిచిపోయేవి. ఆడపిల్ల అనే శిక్ష నన్ను కన్నవాళ్లే కాదు సమాజం కూడా వేసింది. జంక్షన్ లో భిక్షాటన చేసే మనుషుల అకృత్యాలను చూసి భయపడి పారిపోయిన సంఘటనలు ఎన్నో. వయసు చిన్నదే అయినా అనుభవాలు పెద్దదాన్ని చేశాయి. సంజీవని దొరకకపోతే..! స్థానిక రాంబో హోమ్ ఫౌండేషన్ నా దుస్థితిని మార్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు క్రీడలు, ఆటలు చదవడం నేర్పించారు. అంతకుముందు చదువు అనే విషయం కూడా నాకు తెలియదు. ఆ ఇంటిని మొదటిసారి చూసి షాక్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు అంటే ఎలా ఉంటుందో తెలిసింది. అలంకరించిన గదులు, బొమ్మలు చూశాను. నాలాంటి పిల్లలను ఇంకొంతమందిని కలుసుకున్నాను. దీంతో నన్ను వదిలేసిన తల్లి తిరిగి దొరికినంత సంబరంగా అనిపించింది. కొత్త స్నేహితులు కూడా దొరికారు. రోజంతా పెన్ను, పేపర్‌తో ఉండిపోయేదాన్ని. చదువువొక్కటే నా జీవితాన్ని మార్చేస్తుందని నాకనిపించింది. చిన్నతనంలో పట్నా జంక్ష¯Œ లో చదువుకోవడానికి వెళుతున్న నా ఈడు పిల్లలను చూసి, నాకు కూడా చదువుకోవాలనే కోరిక ఉండేది. అది తీరే కలేనా అనుకున్నాను. కానీ, నా కల నెరవేరేరోజు వచ్చింది. అక్షరాలు నేర్పించి, ఆరో తరగతి లో చేర్చారు ఫౌండేషన్ నిర్వాహకులు. మూడు నెలల కోర్స్... సంస్థ ద్వారా పాఠశాలకు వెళ్లాను. అక్కడున్న టీచర్లు చెప్పినవి శ్రద్ధగా విన్నాను. అయితే, ఎక్కువ రోజులు బడిలో కూర్చోలేదు. ఓపెన్‌గానే పదవతరగతి పరీక్ష రాసి పాసయ్యాను. ఇప్పుడు 12 వ తరగతి చదువుతున్నాను. చదువుతోపాటు లెమన్ కేఫ్‌లో పనిచేస్తున్నాను. కేఫ్‌లో పనిచేసే ముందు మూడు నెలల మార్కెటింగ్ కోర్సు కూడా చేశాను. ఆ తర్వాత సేల్స్‌గర్ల్‌గా ఆరునెలలు పనిచేశాను. ‘కేఫ్’ మేనేజర్ ప్రస్తుతం నేను బీహార్‌లోని లెమన్ కేఫ్‌కి మేనేజర్‌గా పనిచేస్తున్నాను. చదువుతోపాటు, ఉద్యోగమూ చేసుకుంటున్నాను. నా జీతంలో సగం డబ్బును నన్ను చదివించిన సంస్థకు విరాళంగా ఇస్తున్నాను. ఒకప్పుడు నేను పెరిగిన పట్నా జంక్షన్ మీదుగా అప్పుడప్పుడు వెళుతుంటాను. అక్కడ పోలీసులు నన్ను గుర్తుపట్టి, ఆప్యాయంగా పలకరిస్తారు. చదువు ఎలా సాగుతోందని, ఎలా ఉన్నావంటూ అడుగుతుంటారు. అక్కడ భిక్షాటన చేసే పిల్లలు ఎవరైనా ఉంటే చాలు .. పిలిచి మరీ నన్ను చూపించి వారికి పరిచయం చేస్తారు. ‘ఒకప్పుడు మీలాగే ఈ జ్యోతి ఉండేది. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో. మీరూ ఈ జ్యోతిలా తయారవ్వాలి. ఇలా భిక్షాటన చేయొద్దు. అందుకు, ఎక్కడుండాలో మేం చెబుతాం...’ అంటూ వారికి మంచి మాటలు చెబుతారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చెత్తకుప్పలో ఓ మాంసం ముక్క అనుకొని పడేసిన ఈ ఆడపిల్ల చనిపోలేదు. కానీ, ప్రతిరోజూ చస్తూ బతికింది. ఇప్పుడున్న ఈ జీవితంలో ఆడపిల్లల కోసం మంచిపని చేసే విధంగా మలుచుకోవాలని ఉంది. ఆ విధంగానే కృషి చేస్తున్నాను’’ అంటూ వివరిస్తుంది జ్యోతి. ‘ఆడపిల్ల అంటే ఎందుకంత చిన్నచూపు?’ అని ప్రశ్నించే జ్యోతిలాంటి అమ్మాయిలందరికీ సమాజం ఏం సమాధానం చెబుతుంది?! -
నయవంచనకు గురైన బాలిక
చిత్తూరు, మదనపల్లె క్రైం: ఓ ప్రబుద్దుడు ప్రేమిస్తున్నానని అనాథ బాలిక వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని కోర్కె తీర్చుకున్నా డు. చివరకు మోసం చేశాడు. ఆ యువకుడు విదేశాలకు వెళ్లిపోతున్నట్టు తెలుసుకున్న బాధితురాలు పినతండ్రితో కలిసి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసిం ది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాలిక పినతండ్రి కథనం మేర కు.. మదనపల్లె పట్టణం సాయిబాబా గుడివీధిలో ఒక బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో పినతల్లి వద్ద ఉంటోంది. ఆమెపై కన్నేసిన పోతులప్పవీధికి చెందిన యువకుడు ఏడాదిగా ప్రేమించినట్లు నటించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మిం చి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక బంధువులు నిలదీయడంతో ఆ యువకుడి వ్యవహారం బట్టబయలైంది. పెళ్లి చేసుకోవా లని నిలదీయడంతో తనకు సంబంధం లేదంటూ సమాధానం ఇచ్చాడు. బాధితులు టూటౌన్ పోలీసులకు నాలుగు నెలల క్రితం ఫిర్యాదు చేశారు. పోలీసుల దగ్గర పంచాయితీ అనంతరం తన ఆర్థిక బలంతో కేసును నీరుగార్చి బాధితురాలిని బెదిరించాడు. చేసేది లేక తల్లిదండ్రులు లేని ఆ బాలిక ఆత్మహత్య చేసుకోవడానికి యత్నిం చింది. ఆ యువకుడిని ఎదిరించే స్థోమతలేక ఆ యువతి కొంతకాలంగా మదనపడుతూ తీవ్ర క్షోభను అనుభవిస్తోంది. విషయం తెలుసుకున్న బాలిక పినతండ్రి టూటౌన్ పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరాడు. పోలీసులు కాలయాపన చేయడంతో చేసేది లేక పత్రికా ప్రతినిధులను ఆశ్రయించాడు. తల్లిదండ్రులు లేని బాలికను మోసం చేసి కోర్కె తీర్చుకుని ప్రస్తుతం విదేశాలకు వెళ్లిపోవడానికి సమాయత్తమవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాలిక న్యాయం చేయాలని కోరుతున్నాడు. దీనిపై సీఐ సురేష్‌కుమార్ వివరణ ఇస్తూ బాధితులు ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఆర్భాటం లేకుండా నిర్భాగ్యుల కోసం
పెళ్లి ఖర్చులను లక్షల్లో తగ్గించుకుని, ఆ డబ్బును అనాథ బాలికల పేర డిపాజిట్ చేసిన అనంతపురంలోని ఓ తండ్రి.. సమాజానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. శుభకార్యమంటేనే విందులు, వినోదాలు..హంగులు, ఆర్భాటాలు.. అన్నిటినీ మించి మంచినీళ్ల ప్రాయంగా సాగే దుబారా ఖర్చులు. యుద్ధంలో గెలిచినా, ఓడినా ఇరుపక్షాలూ నష్టపోయిన చందంగా కూతురు పెళ్లయినా, కొడుకు పెళ్లయినా తల్లిదండ్రులకు తడిసి మోపెడంత ఖర్చులు తప్పనిసరి. తిప్పలు పడి అప్పులు చేసైనా బిడ్డల పెళ్లి ఆనందంగా కానిచ్చేద్దాం అన్న తొందరలో ఏ మూల చూసినా ఖర్చు విపరీతంగా ప్రవహిస్తుందన్నది సంతోషాల పొరల మధ్య కనపడని కఠిన వాస్తవం. పెళ్లయిన కొద్ది రోజులకు పెద్దలకు కనపడేవి ఆల్బమ్‌లలోని మధుర క్షణాల అందమైన చిత్రాలే కాదు.. అందిన చోటల్లా చేసిన అప్పుల పట్టిక కూడా. అప్పులు, తిప్పలు ఎలా ఉన్నా పెళ్లన్నాక ‘ఈ మాత్రమైనా’ చేయడం సంప్రదాయమని, ఆనవాయితీ అని అనుకునే తల్లిదండ్రులకు భిన్నంగా.. కొందరు ఆదర్శవాదులు ఆలోచిస్తున్నారు. అనవసర ఆర్భాటాలను, పెళ్లి ఖర్చుల్ని తగ్గించుకోవడమే కాదు.. ఆ మొత్తంలో కొంతైనా అన్నార్తులకు, అనాథలకు ఇచ్చి వారి కళ్లలో ఆనందం చూడాలకుంటున్నారు. అలాంటి ఆదర్శవంతుల కోవకు చెందిన వారే అనంతపురానికి చెందిన న్యాయవాది ప్రభాకరరెడ్డి. ఇటీవలే ఆయన తన కూతురు వివాహం చేశారు. పెళ్లికి అయ్యే ఖర్చులో దాదాపు రూ.5 లక్షల వరకు తగ్గించి, అభాగ్యులకు ఇవ్వడానికి సంకల్పించడమే కాకుండా ఆచరించి చూపించారు. పెళ్లి కార్డులోనూ విభిన్నత పెళ్లి కార్డులకే ఇప్పుడు వేల రూపాయల ఖర్చవుతోంది. ఒకప్పుడు సాదా సీదాగా కేవలం సమాచారం మాత్రమే ఉండే శుభలేఖలు, మారుతున్న కాలానుగుణంగా ఫ్యాషన్ ప్రపంచం వెంట పరుగులు పెడుతూ వివిధ రకాలైన డిజైన్లతో దర్శనమిస్తాయి. అయితే ప్రభాకరరెడ్డి పెళ్లి కార్డులను నిరాడంబరంగా కొట్టించడమే కాకుండా.. వాటిల్లో ఒక చక్కటి సందేశముండే విధంగా కొత్తదనాన్ని తీసుకువచ్చారు. ఆహార పదార్థాలను ఏ మాత్రం వృథా చేయొద్దని ప్రత్యేక విన్నపం కింద పెళ్లికార్డులో ప్రచురించి, చెప్పి మరీ పంచారు. అన్నం లేక వేలాది మంది ఆకలితో నకనకలాడుతుంటే కాస్తంత రుచి చూసి వదిలేయడం తగదంటూ సుతిమెత్తగానే విజ్ఞప్తి రూపంలో స్పష్టం చేశారు. సర్వ్ కాకుండా మిగిలిన ఆహారాన్ని అనాథాశ్రమాలకు తరలించాలని సూచించడంతో వారింటి పెళ్లి కార్డు కూడా ఓ ప్రత్యేకతగా నిలిచిపోయింది. బాలికల పేరు మీద 5 లక్షలు! కూతురి పెళ్లి అనుకున్నది మొదలు ఎంత వీలైతే అంత పెళ్లి ఖర్చులు తగ్గించుకోవాలనుకున్నారు ప్రభాకరరెడ్డి. షామియానా, ఫ్లవర్ డెకరేషన్, క్యాటరింగ్ ఇలా ప్రతి చోట రేషన్ నిర్ణయించుకుని తగినంత మాత్రమే ఖర్చు చేయాలని నిశ్చయించుకున్న తర్వాత.. అలా తగ్గించిన అంచనా వ్యయానికి సమానమైన డబ్బును అనాథలకు ఇవ్వాలని నిర్ణయించారు. అనంతపురంలోని పలు అనాథాశ్రమాలలో ఉంటున్న బాలికల పేరు మీద సుమారు రూ. 5 లక్షలను డిపాజిట్ చేశారు! అంతేనా బంధువులకు మల్లే అనాథలందరికి కొత్త దుస్తులు కుట్టించి పెళ్లిలో వారికి వీఐపీల మాదిరి ప్రత్యేక స్థానాలు (ఆ చిన్నారుల పేర్లు రాసి) ఏర్పాటు చేశారు. ఇలా అందరూ ఆడంబరాలను తగ్గించుకుని నిర్భాగ్యులకు సహాయం చేయాలని ప్రభాకరరెడ్డి వినమ్రంగా కోరుకుంటున్నారు. వృథా మహా పాపం మా అమ్మాయి సాయి శ్రీవల్లి, కొడుకు శ్రవణ్‌కుమార్, భార్య విజయలక్ష్మి, మా వియ్యంకులు మా ఆలోచనను హర్షించడం వల్లే ఆదర్శమైన వివాహం చేయగలిగాం. ఇటీవల పెళ్లిళ్లలో ఇరవై ముప్పై నుండి వంద దాకా ఐటమ్స్ వడ్డిస్తున్నారు. ఆర్భాటం పెరిగే కొద్దీ ఆహారాన్ని ఎవరూ పూర్తిగా తీసుకోలేరన్నది వాస్తవం. దీనిని దృష్టిలో ఉంచుకుని రూ.లక్షల రూపాయలు మిగిలే విధంగా పెళ్లిని చేయొచ్చని నిరూపించాం. ‘ఆకలి ఉన్న వారికి అన్నం చేరాలి.. అజీర్తి ఉన్న చోట కాదన్నది’ మా నమ్మకం. ముఖ్యంగా అనాథల కళ్లలో ఆనందాలను చూడగల్గితే అంతకంటే మంచి సమాజం మరెక్కడా ఉండదని అనుకుంటాను. – పుట్టపర్తి ప్రభాకరరెడ్డి, న్యాయవాది, అనంతపురం. – గుంటి మురళీకృష్ణ, సాక్షి, అనంతపురం -
స్వచ్ఛమైన మనసు
తాగుబోతు తండ్రి ఇల్లొదిలి వెళ్లిపోయాడు.. తల్లి సంపాదన ఏ మూలకూ చాలలేదు.. సునామీ సర్వస్వమూ కోల్పోయేలా చేసింది...బతుకుబాటలో ఊరు విడిచింది...ఊరుకాని ఊరిలో ఇబ్బందులు ఎదుర్కొంది.. ఆకలి దప్పులతో అలమటించింది..చివరకు జీవితంలో నిలదొక్కుకుంది..వందలాది అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారింది. సినిమాను తలపించే ఈ సంఘటలన్నీ యాస్మిని జీవితంలో చోటుచేసుకున్నవే.అందుకే ఈరోజు కథనం ఆమె గురించే..సాక్షి, స్టూడెంట్ ఎడిషన్. దేశానికి తూర్పున, బంగాళాఖాతం మధ్యలో ఉంటాయి అండమాన్ నికోబార్ దీవులు. వీటి రాజధాని పోర్ట్బ్లెయిర్లో నివసించే దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయే యాస్మిని. 2003 వరకూ ఆమె జీవితం మామూలుగానే సాగిపోయింది. అయితే ఆ మరుసటి ఏడాది నుంచే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మద్యానికి బానిసైన తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లాడు. ఓ ప్రభుత్వ స్కూల్లో తక్కువ వేతనానికి పనిచేసే తల్లి కుటుంబాన్ని పోషించడానికి అష్టకష్టాలూ పడేది. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు 2004లో వచ్చిన సునామీలో యాస్మిని కుటుంబం సర్వస్వమూ కోల్పోయింది. ఇల్లు ధ్వంసమైంది. సామగ్రి కొట్టుకుపోయింది. దీంతో రోజుల తరబడి రోడ్ల మీదే గడిపారు. అప్పుడు యామిని పదోతరగతి చదువుతోంది. చదువుకుంటూ పార్ట్ టైమ్ ఉద్యోగం.. ఈ పరిస్థితుల్లో కుటుంబ భారాన్ని మోసేందుకు తల్లికి సాయంగా కష్టపడాలని నిర్ణయించుకుంది యాస్మిని. వెంటనే చిన్నపాటి జీతానికి పార్ట్ టైం ఉద్యోగంలో చేరింది. ఉద్యోగం చేస్తూనే ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది.సునామీలో ధ్వంసమైన ఇంటికి మరమ్మతులు చేయించింది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని, తమ్ముళ్లను బాగా చదివించాలని నిర్ణయించుకొని మంచి ఉద్యోగం, సంపాదన కోసం ముంబైకి చేరింది. అయితే,అక్కడ అంత సులభంగా ఉద్యోగం దొరకలేదు. అష్టకష్టాలూ పడి ఓ ప్రభుత్వ కార్యాలయంలో రూ.6,500కు కాంట్రాక్టు పద్ధతిలో చిన్న ఉద్యోగం సంపాదించింది. వచ్చే ఆదాయంలోనే ఇంటి ఖర్చులకు పంపేది. ఒక్కోసారి తినడానికీ డబ్బులు సరిపోక పస్తులు ఉండేది. ఆ సమయంలోనే తిండి లేని తనలాంటి వాళ్లను, అనాథలను ఎంతోమందిని చూసింది. ఆలయాలు, ట్రాఫిక్ సిగ్నళ్లు, వీధుల్లో అనేకమంది నిరాశ్రయులు దిక్కుతోచని పరిస్థితుల్లో కడుపు ఎండబెట్టుకుంటున్నారని గుర్తించింది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ మంచి ఉద్యోగం వచ్చింది. దీంతో తనలాంటి వారి కడుపు నింపేందుకు నడుం బిగించింది. అనాథల ఆకలి తీరుస్తూ.. అనుకున్నదే తడవుగా ఆచరణలోకి దిగింది. మొదట తన పుట్టినరోజును, పండగలను అనాథల సమక్షంలో జరుపుకోవడం ప్రారంభించింది. దీనికోసం మురికివాడలు, రైల్వే స్టేషన్లు, అనాథాశ్రమాలకు వెళ్లేది. అక్కడిపిల్లలకు, వృద్ధులకు కావల్సిన తినుబండారాలు, దుస్తులు తీసుకెళ్లి పంచేది. కొందరిని అనాథాశ్రమాల్లో చేర్పించింది. ఇదే సమయంలో ఆమెకు ఓ పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీతంతోపాటుఅదనంగా కమీషనూ రావడం మొదలైంది. ఈ క్రమంలోనే ఫేస్బుక్లో కనిపించిన చిన్ననాటి స్నేహితునితో ప్రేమలో పడి, వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత దంపతులు చెన్నైకి వెళ్లి వ్యాపారం ప్రారంభించారు. వ్యాపారంవృద్ధి చెందడంతో మంచి ఇంటితోపాటు కారు కొనుగోలు చేశారు. ఈ కార్లోనే రోజూ అనాథలు, నిరాశ్రయులకు కావల్సిన ఆహార పదార్థాలు, బట్టలు, చెప్పులు, చాక్లెట్లు, మందులు కొని పంచడం మొదలుపెట్టారు. ప్రస్తుతం రోజూ నగరంలో కనీసం 30 కి.మీ ప్రయాణిస్తూ వీటిని అందజేస్తున్నారు. అనాథలు, నిరాశ్రయుల ఆకలి తీరుస్తున్నారు. యాస్మిన్ అంటే అరబిక్‌లో మల్లెపువ్వు అని అర్థం. ఇంగ్లిష్‌లోని జాస్మిన్ పదానికి ఇదే మూలం. మల్లెపువ్వు తెల్లదనం స్వచ్ఛతకు ప్రతీక. అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారిన యాస్మిన్ మనసు కూడా స్వచ్ఛమైనదే. -
ఏ జన్మదో ఈ బంధం!
సుభాష్‌నగర్: అనాథ చిన్నారిని చేరదీశారు. ఆలనా పాలన చూశారు. చిన్నప్పటినుంచి కన్నబిడ్డలా పెంచారు. విద్యాబుద్ధులు చెప్పించారు. యుక్త వయసు రాగానే ఆమె వివాహాన్ని ఘనంగా జరిపించి ఆదర్శంగా నిలిచారు. వివరాలు ఇలా ఉన్నాయి. గండిమైసమ్మ దుండిగల్ మండలం బహదూర్‌పల్లిలోని గౌరీ ఆశ్రమాన్ని డీఎన్ గౌరి, మీరా కుమారి నిర్వహిస్తున్నారు. 2000 సంవత్సరంలో అమీర్‌పేటలోని ఉమెన్ అండ్ వెల్ఫేర్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి రమ్య అనే మూడేళ్ల చిన్నారిని తీసుకువచ్చి ఆశ్రమంలో చేర్చారు. ప్రస్తుతం రమ్య (22) బీటెక్ పూర్తి చేసి బాలానగర్‌లోని మెడిప్లస్‌లో ఉద్యోగం చేస్తోంది. పంజాబ్ రాష్ట్రం పటాన్‌కోట్ ప్రాంతానికి చెందిన ఓం ప్రకాశ్, దర్శినిదేవిల కుమారుడు శంభు మెహేరా (25) బీకాం పూర్తి చేసి బాలానగర్‌లో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. ఆశ్రమ నిర్వాహకులు శంభు తల్లిదండ్రులను ఒప్పించి వివాహం కుదిర్చారు. ఆదివారం ఉదయం 9 గంటలకు బహదూర్‌పల్లిలోని గౌరీ ఆశ్రమంలో హైందవ సంప్రదాయ పద్ధతిలో గౌరీ, మీరాలు కన్యాదానం చేశారు. ఉమెన్ డైవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ సీహెచ్ అనురాధ ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎంవీ సాయిబాబా, ఆశ్రమం ఇన్చార్జి లక్ష్మి, ప్రేమ పాల్గొన్నారు. -
పెంచి.. చదివించి.. పెళ్లి చేసి..
ఒకప్పుడు ఆమెకు ఎవరూ లేరు. జీవిత నౌక ఏ తీరం చేరుతుందో తెలియనితనం. అనాథగా మారిన ఆ బాలికకు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు వారు. ఉండేందుకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు చక్కటి చదువులు చెప్పించారు. పెళ్లి ఈడు రావడంతో ఓ అయ్యచేతిలో పెట్టి ఘనంగా వివాహం కూడా చేసి పలువురు అభినందనలు అందుకుంటున్నారు పురిటిగడ్డలోని ఐవీఎం ఆశ్రమ నిర్వాహకులు. కృష్ణా , చల్లపల్లి : ఆమె ఒకప్పుడు అనాథ బాలిక. ఇప్పుడు ఆమెకు అందరూ ఉన్నారు. అర్థాంతరంగా తండ్రి తనువు చాలించడంతో అనాథాశ్రమంలో చేరిన బాలిక నేడు ఎంబీఏ చదివింది. వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన లిడియా 2006లో చల్లపల్లి మండలం పురిటిగడ్డలోని ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ అనాథ బాలల ఆశ్రమంలో చేరింది. తండ్రి మృతి చెందటంతో లిడియా తల్లి సత్యవతి, చెల్లెలు క్రాంతి 2005లో ఐవీఎం హోం నిర్వాహకులు డాక్టర్ వేములపల్లి సురేష్‌కుమార్‌ను ఆశ్రయించారు. అప్పటికే పురిటిగడ్డలో అనాథల సేవ చేస్తున్న సురేష్‌కుమార్ వారిని ఆదరించారు. 2006లో లిడియా కూడా ఆశ్రమంలో చేరింది. వీరిద్దరినీ సురేష్‌కుమార్,రోజా దం పతులు చదివించి ఉత్తమ అలవాట్లను నేర్పించారు. ఎంబీఏ చదివింది ఇండియా విలేజ్ మినిస్ట్రీస్‌లో చేరి ఉన్నత విద్య పూర్తి చేసిన తొలి అనాథ బాలిక లిడియా. ఆమె చదువుకయ్యే ఖర్చులన్నీ ఐవీఎం నిర్వాహకులు భరించారు. ఇంజినీరింగ్ చదివి లిడియా తాజాగా ఎంబీఏ పూర్తి చేసింది. ఆమె చెల్లి క్రాంతి సీఎస్ఈ చదువుతోంది. పెళ్లి పెద్దలయ్యారు ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ ప్రారంభించి 16 సంవత్సరాలుగా అనాథల సేవ చేస్తున్న సురేష్‌కుమార్, రోజా దంపతులు తమ కళ్ల ముందు పెరిగి పెద్దదై, చదువు పూర్తి చేసిన లిడియాకు గురువారం హోంలోనే పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోటకు చెందిన యువకుడు మోహన్‌కు ఇచ్చి వివాహం చేశారు.తనను పెంచి, చదివించి పెళ్లి చేసిన సురేష్‌కుమార్ దంపతులకు లిడియా కృతజ్ఞతలు తెలిపింది. లిడియా మా పెద్దమ్మాయి ఆశ్రమం స్థాపించిన తొలినాళ్లలో హోంలో చేరిన లిడియాను మా పెద్దమ్మాయిగా భావించి పెళ్లి చేశాం. హోంలో పెరుగుతున్న ప్రతి బాలుడికీ, బాలికకు మంచి జీవితం ఇవ్వాలన్నదే మా ఆకాంక్ష. – సురేష్‌కుమార్, రోజా దంపతులు సొంత బిడ్డలా చూసుకున్నారు మూడో క్లాసులో నాన్న చనిపోయారు. ఆరో తరగతిలో ఆశ్రమంలో చేరాను. నన్ను బాగా చూసుకున్నారు. మంచి చదువు నేర్పారు. ఐవీఎం హోం నన్ను విద్యావంతురాలిగా తీర్చిదిద్దింది. నిర్వాహకులు తమ సొంత బిడ్డలా భావించి దగ్గరుండి నా వివాహం చేయించడం ఆనందదాయకం. మంచి ఉద్యోగం సాధించి, నాలాంటి అనాథ పిల్లలకు నా వంతు సాయం చేస్తాను. – లిడియా -
పేదింటి నక్షత్రాలు
చింపిరి బట్టలు వేస్కొని ఎంత గట్టిగా ఎగిరినా.. చేతికి నక్షత్రాలు అందుతాయా?చింపిరి ఒంటికే గానీ ప్రతిభకు కాదు కదా!పేదింట్లో ఉండి, మట్టిలో మాణిక్యాలుగా మారి.. పైన తారకలే అసూయ పడేలా మెరుపులు మెరిసిన.. పదకొండు రాకెట్ల కథలివి! పేదరికం ఒక్కొక్కరికి ఒక్కోరకంగా పరీక్షలు పెడుతుంది. పెద్దవాళ్లు ఈ పరీక్షల్లో నిలబడితేనే పిల్లలు జీవితంలో నెగ్గేది. రెక్కాడితే గాని డొక్కాడని; కూలి, నాలి చేస్తే తప్ప జానెడు పొట్ట నిండని çపరిస్థితుల్లో పిల్లలను చదివించాలన్న ధ్యాస తల్లిదండ్రులకు ఉండదు. మరికొందరు పిల్లలకు చదువుకోవాలని ఉన్నా, వారికి చదివించే దిక్కు ఉండదు. కొందరికి తల్లి ఉంటే తండ్రి లేక, మరికొందరికి తల్లిదండ్రులు ఇద్దరూ లేక చదువుకోవాలన్న కోరిక తీరదు. ఇలాంటి కష్టాల మధ్యలో చదువు ఆపేసిన బాలికలను అక్కున చేర్చుకుంటోంది కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ). ఈ పాఠశాలల్లో చేరిన పేద, అనాధ బాలికలు ఆకాశమే హద్దుగా అంచలంచలుగా ఎదుగుతున్నారు. అద్భుతాలు సృష్టిస్తున్నారు. చదవాలన్న తపన ఉండాలే కాని ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం కాదని నిరూపిస్తున్నారు. జీవితంలో ఇక చదవలేమనుకున్న స్థితి నుంచి తమ విద్యను కొనసాగిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వీరిలో కొందరు ఇటీవల ఏకంగా యు.ఎస్.లోని ‘నాసా’ను సందర్శించి వచ్చారు. ఆ పిల్లల ప్రతిభకు దక్కిన గుర్తింపు అది. ప్రతిభకు ప్రత్యేక ఆహ్వానం చిత్తూరు జిల్లాలోని కసూర్బా పాఠశాలల్లో చదువుకునే తొమ్మిది మంది బాలికలు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఇదే పాఠశాలల్లో చదువుతున్న బాలికలు ఇద్దరు సైన్సులో కనబరిచిన ప్రతిభకు గుర్తింపుగా అమెరికాలోని లాస్ఏంజెల్స్లో జరిగిన నాసా అంతర్జాతీయ అంతరిక్ష అభివృద్ధి సదస్సులో పాల్గొనేందుకు అర్హత సాధించి, ప్రత్యేక ఆహ్వానం పొందారు. ఇప్పటి వరకు కార్పొరేట్ స్కూళ్లకు చెందిన విద్యార్థులు మాత్రమే ఈ పోటీలకు ఎంపికైన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. కాని తొలిసారిగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు సాసా సదస్సుకు ఎంపికై రికార్డు సృష్టించారు. ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈనెల 21న హైదరాబాదులోని అమెరికన్ కాన్సులేట్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూలో కూడా ఈపదకొండు మందీ అత్యున్నత ప్రతిభను కనబరిచారు. దీంతో వీరందరికీ కాన్సులేట్ వీసాను మంజూరు చేసింది. ఈ సందర్భంగా అమెరికన్ కాన్సులేట్ జనరల్ కెథరీ అడ్డా కూడా విద్యార్థినుల ప్రతిభను ప్రశంసించారు. పట్టుదల ఉన్న పేద విద్యార్థినులను కలవడం గొప్పగా భావిస్తున్నానని చెప్పిన ఆమె ‘చీర్స్ టు ఇండియా’ అంటూ అమెరికన్ కాన్సులేట్ నుంచి అధికారిక ట్వీట్ చేయడం విశేషం. అబ్బురపడిన ‘నాసా’! దేశంలోని కస్తూర్బా పాఠశాలలు కేంద్ర ప్రభుత్వపు ‘సర్వశిక్ష అభియాన్’ కిందికి వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర డైరెక్టర్ అయిన జి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో కెజిబీవీ రాష్ట్ర కార్యదర్శి పార్వతిదేవి, జిల్లా బాలికాభివృద్ధి అధికారి శ్యామలాదేవిలతో కలిసి పదకొండు మంది విద్యార్థినులూ ఈ నెల 23న హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నుంచి అమెరికా వెళ్లి, నాసాను సందర్శించారు. ‘అంతరిక్షంలో ఆవాసాలు’ అనే అంశంపై తాము రూపొందించిన నివేదికలను ఆ సదస్సులో ప్రదర్శించారు. అలాగే స్టాన్ఫోర్డు యూనివర్శిటీ, కాలిఫోర్నియాలోని సైన్సు కేంద్రం, డిస్నీలాండ్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని స్వదేశానికి తిరిగి వచ్చారు. నాసా వెళ్లొచ్చిన కెజీబీవీ విద్యార్థినులు కె.ప్రీతి: బంగారుపాళెం మండలానికి చెందిన కె.ప్రీతి బైరెడ్డిపల్లె కెజీబీవీలో ఎనిమిదో తరగతి చదువుతోంది. తండ్రి చిన్నతనంలోనే గుండెపోటుతో మరణించాడు. తల్లి మమత దినసరి కూలి. ప్రీతి ‘సఫిషియంట్ ప్లేస్ ఇన్ స్పేస్’ అనే అంశంపై నాసాకి పేపర్ ప్రజంటేషన్ చేసింది. గ్రహ కశలాలు భూమిని తాకడం వల్ల రాక్షస బల్లులు అంతరించినట్లుగానే మానవులు కూడా కాలక్రమంలో భూమిపై అకస్మాత్తుగా ఆవాసాన్ని కోల్పోతారు కనుక అంతరిక్షంలో నివాస స్థలాలపై పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని నివేదిక పొందుపరిచింది. ఐఎఎస్ కావడమే తన లక్ష్యమని ప్రీతి అంటోంది. టి.సాయిశ్రీ: రొంపిచెర్ల కెజీబీవీలో ఏడవ తరగతి చదువుతున్న టి.సాయిశ్రీ తండ్రి శ్రీరాములురెడ్డి దినసరి కూలి. తల్లి సాధారణ గృహిణి. ఈమె ‘అగ్రికల్చర్ ఇన్ స్పేస్’ అనే అంశంపై నాసాకు పేపర్ ప్రజంట్ చేసి మన్ననలు పొందింది. డాక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని సాయిశ్రీ అంటోంది. ఎం.పూజ: కె.వి.పల్లె కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతున్న పూజ తండ్రి నాగిరెడ్డి దినసరి కూలి. తల్లి సాధారణ గృహిణి. ‘ట్రాన్స్‌ఫోర్టు ఇన్ స్పేస్’అనే అంశంపై పూజ నాసాలోని సదస్సులో పేపర్ ప్రజంట్ చేసి అక్కడి అధికారులచే శభాష్ అనిపించుకుంది. సాప్ట్వేర్ ఇంజనీర్ కావడమే తన లక్ష్యమని అంటోంది. జి.దివ్య: కె.వి.పల్లె కేజీబీవీలో పదో తరగతి చదువుతున్న జి.దివ్య తండ్రి జి.దామోదర్‌రెడ్డి దినసరి కూలి. తల్లి సా«ధారణ గృహిణి. ‘మెటీరియల్ యూజ్డ్ ఇన్ స్పేస్’ అనే అంశంపై సాసా సదస్సులో పేపర్ ప్రజంట్ చేసి అక్కడి అధికారుల ప్రశంసలు పొందింది. పోలీసు అధికారి కావడమే తన ధ్యేయమని దివ్య చెబుతోంది. సైదాబాను: మదనపల్లెకు చెందిన సైదాబాను పుంగనూరులోని మైనార్టీ కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయి మేనమామ సంరక్షణలో పెరుగుతోంది. ‘అంతరిక్షంలో పరిశ్రమలు’ అనే అంశంపై సదస్సులో పేపర్ ప్రజంట్ చేసి తన ప్రతిభను చాటుకుంది. సైంటిస్టు కావాలన్నదే తన ఆశయమని సైదాబాను అంటోంది. కె.రెడ్డిరాణి: కలకడ కేజీబీవీలో ఎనిమిదో తరగతి చదువుతున్న కె.రెడ్డిరాణి తండ్రి మనోహర వ్యవసాయ కూలి. తల్లి గృహిణి. ‘గ్రోయింగ్ ప్లాంట్స్ ఇన్ స్పేస్’ అనే అంశంపై నాసా పేపర్ ప్రజంట్ చేసి అందరి అభినందనలు పొందింది. డాక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని రెడ్డిరాణి అంటోంది. సి.స్నేహ: గంగవరం కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతున్న సి.స్నేహ తండ్రి సి.సుధాకర్‌రెడ్డి దినసరి కూలి. తల్లి గృహిణి. ‘ పుడ్ ఇన్ స్పేస్’ అనే అంశంపై నాసా సదస్సులో పేపర్ ప్రజంటేషన్ చేసింది. డాక్టర్ కావాలన్నదే తమ ఆశయమని స్నేహ అంది. ఎస్.రోష్ని: పుంగనూరులోని కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఎస్.రోష్ని తండ్రి రెడ్డిబాషా ఆటో డ్రైవర్. తల్లి గృహిణి. ‘ఎయిర్ ఇన్ స్పేస్ ’ అనే అంశంపై నాసా సదస్సులో పేపర్ ప్రజంటేషన్ చేసి శభాష్ అనిపించుకుంది. స్టీఫెన్ హాకింగ్ సిద్ధా్దంతం తమ ప్రయత్నానికి పునాదని రోష్ని అంటోంది. ఐఎఎస్ కావడమే తన లక్ష్యమని ఆమె చెబుతోంది. బి.ప్రత్యూష: నిమ్మనపల్లె కేజీబీవీలో ఎనిమిదో తరగతి చదువుతున్న బి.ప్రత్యూష తండ్రి వెంకటరమణ సగటు ఉద్యోగి. తల్లి గృహిణి. ‘అంతరిక్షంలో వసతులు’ అనే అంశంపై నాసా సదస్సులో ఆమె పేపర్ ప్రజంటేషన్ చేసింది. వైద్యరంగంలో రాణించాలన్నదే తన లక్ష్యమని అంటోంది. చెంచులావణ్య: నెల్లూరు జిల్లా కొల్లపట్టుకి చెందిన ఎం.చెంచు లావణ్య తడ కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తండ్రి చెంచయ్య దినసరి కూలి. తల్లి సుజాత గృహిణి. ‘టెంపరేచర్’ అనే అంశంపై నాసా సదస్సులో పోస్టర్ ప్రజంట్ చేసింది. కలెక్టర్ కావాలన్నదే తన ధ్యేయమని చెబుతోంది. వి.అశ్విని: నెల్లూరు జిల్లా గాంధీనగర్‌కు చెందిన వి.అశ్విని, వెంకటగిరి కేజీబీవీలో ఎనిమిదోతరగతి చదువుతోంది. తండ్రి శివశంకర్‌ప్రసాద్ వంట మనిషి. తల్లి శాంతి గృహిణి. నాసా సదస్సులో ‘గ్రావిటీ’ అనే అంశంపై పోస్టర్ ప్రజంటేషన్ చేసింది. డాక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది. – మాడా. చంద్రమోహన్ -
అనాథ బాలికల చదువుల బాధ్యత ప్రభుత్వానిదే
గజ్వేల్: ‘సార్... తల్లిదండ్రులు లేని అనాథలం మేం.. కస్తూర్బా పాఠశాల పుణ్యమా అని పదోతరగతి దాకా చదివినం.. ఇకముందు ఎక్కడికి వెళ్లి చదువుకోవాలో అర్థమైతలేదు.. మీరే మాకు మార్గం చూపాలి..’ అంటూ మెదక్ జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లిలో శనివారం ‘సీఎం ఫ్రెండ్లీ కప్’ ముగింపు కార్యక్రమంలో గజ్వేల్ కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు రేణుక, రమ్య చేసిన విన్నపం సీఎం కేసీఆర్‌ను కదిలించింది. ఆ చిన్నారుల బాధ తనను మథనపడేలా చేసిందని.. దుఃఖం కలిగించే పరిస్థితిని తెప్పిం చిందన్నారు.. వారి పరిస్థితిపై మూడు నాలుగురోజుల్లో మంత్రివర్గ భేటీని ఏర్పాటుచేసి విధాన నిర్ణయం తీసుకుని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో ప్రకటిస్తామని కేసీఆర్ వెల్లడించారు. అనాథ బాలికలకు అండగా ఉంటామని, టెన్త్ తర్వాత ఇంటర్, ఆపై చదువులకయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ సభకు హాజరు కావడం ద్వారా తన జీవితంలో మరో గొప్ప నిర్ణయం తీసుకునే అవకాశం దొరికిందన్నారు. బాలికల సమస్యలు ఇక్కడికి రావడం ద్వారానే తెలిశాయని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ పోలీస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ పోలీసుల పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు.