దండలు మార్చుకుంటున్న రమ్య, శంభు
సుభాష్‌నగర్: అనాథ చిన్నారిని చేరదీశారు. ఆలనా పాలన చూశారు. చిన్నప్పటినుంచి కన్నబిడ్డలా పెంచారు. విద్యాబుద్ధులు చెప్పించారు. యుక్త వయసు రాగానే ఆమె వివాహాన్ని ఘనంగా జరిపించి ఆదర్శంగా నిలిచారు. వివరాలు ఇలా ఉన్నాయి. గండిమైసమ్మ దుండిగల్ మండలం బహదూర్‌పల్లిలోని గౌరీ ఆశ్రమాన్ని డీఎన్ గౌరి, మీరా కుమారి నిర్వహిస్తున్నారు. 2000 సంవత్సరంలో అమీర్‌పేటలోని ఉమెన్ అండ్ వెల్ఫేర్ చైల్డ్ డిపార్ట్‌మెంట్ నుంచి రమ్య అనే మూడేళ్ల చిన్నారిని తీసుకువచ్చి ఆశ్రమంలో చేర్చారు.
ప్రస్తుతం రమ్య (22) బీటెక్ పూర్తి చేసి బాలానగర్‌లోని మెడిప్లస్‌లో ఉద్యోగం చేస్తోంది. పంజాబ్ రాష్ట్రం పటాన్‌కోట్ ప్రాంతానికి చెందిన ఓం ప్రకాశ్, దర్శినిదేవిల కుమారుడు శంభు మెహేరా (25) బీకాం పూర్తి చేసి బాలానగర్‌లో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. ఆశ్రమ నిర్వాహకులు శంభు తల్లిదండ్రులను ఒప్పించి వివాహం కుదిర్చారు. ఆదివారం ఉదయం 9 గంటలకు బహదూర్‌పల్లిలోని గౌరీ ఆశ్రమంలో హైందవ సంప్రదాయ పద్ధతిలో గౌరీ, మీరాలు కన్యాదానం చేశారు. ఉమెన్ డైవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ సీహెచ్ అనురాధ ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎంవీ సాయిబాబా, ఆశ్రమం ఇన్‌చార్జి లక్ష్మి, ప్రేమ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment