అందుకు నేనేం అతీతం కాదుగా.. | mithali Raj Special Interview On Her Wedding And Jewellery | Sakshi
Sakshi News home page

నగ.. నాకూ ఇష్టమేగా !

Published Tue, Aug 7 2018 8:43 AM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

mithali Raj Special Interview On Her Wedding And Jewellery - Sakshi

సనత్‌నగర్‌: ‘భారతీయ సంస్కృతిలో బంగారు ఆభరణాలు ఒక భాగం. మహిళలకు వీటిపై ఎంతో మమకారం. వీటిని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. అందుకు నేనూ  అతీతమేమీ కాదు. క్రీడాకారిణిగా నా జీవిత కాలంలో ఎక్కువ రోజులు నగలకు దూరంగా ఉన్నప్పటికీ.. ఏదైనా వేడుకకు వెళ్లేటప్పుడు మాత్రం అందుకు తగ్గట్టుగా ఆభరణాలను ధరిస్తా’నని చెబుతోంది భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీరాజ్‌. ఇప్పుడిప్పుడే క్రీడల పట్ల అమ్మాయిలు ఆసక్తి కనబరచడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. తన పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ఇంకా సమయం ఉందంటూ నవ్వులు చిందించారు. ప్రముఖ బంగారు ఆభరణాల షోరూం జోయలుక్కాస్‌లో అందుబాటులోకి తీసుకువచ్చిన ఆస్ట్రేలియా డైమండ్స్‌ కలెక్షన్‌కు ఆమె బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్‌లో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూవిశేషాలు ఇవీ.. 

పాఠశాల స్థాయి నుంచీ నగరంతోనేమీ అనుబంధం పెనవేసుకుంది.. అప్పటికీఇప్పటికీ  ఎలాంటి మార్పులు గమనిచారు?
నగరం చాలా మారిపోయింది. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చేలా ప్రాజెక్టులు ఇక్కడ కొలువుదీరాయి. అలాగే క్రీడా రంగం విషయానికొచ్చేసరికి దేశంలో ప్రధాన నగరాలతో పోలిస్తే మన నగరంలోనే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎక్కువగా ఉంది. ఇక్కడి నుంచే ఎక్కువ క్రీడాకారులు తయారవుతున్నారు. ఇక్కడి సౌకర్యాలతో యువత తమను తాము మౌల్డ్‌ చేసుకుంటున్నారు.

క్రికెట్‌తో బిజీగా ఉండే మీరు.. ప్రచారకర్తగా అవతారమెత్తడంపై ఎలా ఫీలవుతున్నారు?
వివిధ దేశాలతో క్రికెట్‌ ఆడేటప్పుడు ఆయా దేశాల మధ్య సత్సంబంధాలు ఎంతో బలపడతాయి. జోయలుక్కాస్‌ ఆస్ట్రేలియా డైమండ్స్‌ను సామాన్య, మధ్యతరగతి కుటుంబీలకు కూడా అందుబాటులో ఉండేలా నగరవాసుల ముంగిటకు తీసుకురావడం సంతోషదాయకం. ఇప్పటివరకు క్రికెట్‌తో ఆస్ట్రేలియాతో అనుబంధం ఉండగా, ప్రస్తుతం డైమండ్స్‌తో మరో బంధం ఏర్పడినట్లయ్యింది. అందుకే బ్రాండ్‌ అబాసిడర్‌గా ఉండాలనగానే ఒప్పుకొన్నాను.

క్రీడాకారిణులు నగలకు దూరంగా ఉంటారటగా. మీకు ఆభరణాలంటే ఇష్టమేనా?
ఔను. క్రికెట్‌ ఆటతో బాల్యం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. అలాగే నగలు పెట్టుకోవడం కూడా చాలా అరుదు. భారతదేశంలో ఏ ఆడపిల్లకైనా నగలంటే ప్రాణం. అందులో నేను ఒకదాన్ని. ఫలానా ఆభరణాలంటూ ఏమీ లేదు గానీ అన్ని రకాల నగలను ఇష్టపడతా.  సందర్భాన్ని బట్టి వాటిని ధరిస్తా.

మీరు క్రికెట్‌లోకి ప్రవేశించేనాటికి, ఇప్పటికీ పరిస్థితులు ఎలా ఉన్నాయి?  
నేను క్రికెట్‌లోకి ప్రవేశించే నాటికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ చాలా తక్కువ. నేను చదివిన కీస్‌ హైస్కూల్‌ మైదానం, జింఖానా మైదానమే నాకు తెలుసు. ఇప్పుడు కొత్తగా అకాడమీలు అందుబాటులోకి వచ్చాయి. క్రీడాకారులకు అవసరమైన వసతులు పెరిగాయన్నది కచ్చితంగా చెప్పగలను.

వసతులు పెరిగాయి సరే.. క్రీడల్లోకి యువత వస్తున్నారా.. రాణిస్తున్నారా?  
మిథాలీరాజ్‌: నిజమే, యువత అనుకున్న స్థాయిలో క్రీడారంగం వైపు రాలేకపోతున్నారు. దీనికి కారణం వారికి పాఠశాల స్థాయిలో క్రీడల్లో పునాది ఉండడం లేదు. ప్రస్తుతం ఎక్కువ శాతం పాఠశాలలకు సరైన క్రీడా మైదానాలు లేకపోవడం, పిల్లలను ఆటలకు దూరం కావడం జరుగుతుంది. కళాశాల స్థాయి వచ్చేవరకు కూడా వారికి క్రీడల్లో రాణించలేకపోతున్నారు.

రిటైర్‌మెంట్‌ తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టే ఆలోచన ఉందా?
ఇప్పుడు జోయలుక్కాస్‌ ఆస్ట్రేలియా డైమండ్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాను. భవిష్యత్తులో అదే జ్యువెలరీ వ్యాపారంలోకి దిగుతానేమో (నవ్వుతూ)

అకాడమీ స్థాపన ఆలోచన ఏమైనా ఉందంటారా?  
ప్రస్తుతం అకాడమీ ఏర్పాటు ఆలోచన లేదు కానీ భవిష్యత్‌లో ఎప్పటికైనా స్థాపించడం మాత్రం ఖాయం.  

క్రీడా రంగంలో ఆడపిల్లలకు ఇంకా ‘కట్టుబాట్లు’ అడ్డుపడుతున్నాయంటారా?
ఆడపిల్లలు ఏ రంగంలోనైనా రాణించే సత్తా ఉంది. కొందరు తల్లిదండ్రులు కట్టుబాట్ల పేరుతో ఆటలకు దూరం చేస్తున్నారు. ఇది సరికాదు. తల్లిదండ్రుల్లో చైతన్యం రావాలి. తమ పిల్లలకు ఇష్టమైన గేమ్‌లో ప్రోత్సాహాన్ని అందించాలి.

పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారు.. లవ్‌ మ్యారేజా.. పెద్దల కుదిర్చిన మ్యారేజా?
పెళ్లికి ఇంకా సమయం ఉంది. లవ్‌ మ్యారేజా, పెద్దలు కుదిర్చిందా..? అంటే చెప్పలేను. ప్రస్తుతం నా ధ్యాసంతా క్రికెట్‌పైనే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement