పెళ్లి ఖర్చులను లక్షల్లో తగ్గించుకుని, ఆ డబ్బును అనాథ బాలికల పేర డిపాజిట్ చేసిన అనంతపురంలోని ఓ తండ్రి.. సమాజానికి ఆదర్శప్రాయంగా నిలిచారు.
శుభకార్యమంటేనే విందులు, వినోదాలు..హంగులు, ఆర్భాటాలు.. అన్నిటినీ మించి మంచినీళ్ల ప్రాయంగా సాగే దుబారా ఖర్చులు. యుద్ధంలో గెలిచినా, ఓడినా ఇరుపక్షాలూ నష్టపోయిన చందంగా కూతురు పెళ్లయినా, కొడుకు పెళ్లయినా తల్లిదండ్రులకు తడిసి మోపెడంత ఖర్చులు తప్పనిసరి. తిప్పలు పడి అప్పులు చేసైనా బిడ్డల పెళ్లి ఆనందంగా కానిచ్చేద్దాం అన్న తొందరలో ఏ మూల చూసినా ఖర్చు విపరీతంగా ప్రవహిస్తుందన్నది సంతోషాల పొరల మధ్య కనపడని కఠిన వాస్తవం. పెళ్లయిన కొద్ది రోజులకు పెద్దలకు కనపడేవి ఆల్బమ్‌లలోని మధుర క్షణాల అందమైన చిత్రాలే కాదు.. అందిన చోటల్లా చేసిన అప్పుల పట్టిక కూడా. అప్పులు, తిప్పలు ఎలా ఉన్నా పెళ్లన్నాక ‘ఈ మాత్రమైనా’ చేయడం సంప్రదాయమని, ఆనవాయితీ అని అనుకునే తల్లిదండ్రులకు భిన్నంగా.. కొందరు ఆదర్శవాదులు ఆలోచిస్తున్నారు. అనవసర ఆర్భాటాలను, పెళ్లి ఖర్చుల్ని తగ్గించుకోవడమే కాదు.. ఆ మొత్తంలో కొంతైనా అన్నార్తులకు, అనాథలకు ఇచ్చి వారి కళ్లలో ఆనందం చూడాలకుంటున్నారు. అలాంటి ఆదర్శవంతుల కోవకు చెందిన వారే అనంతపురానికి చెందిన న్యాయవాది ప్రభాకరరెడ్డి. ఇటీవలే ఆయన తన కూతురు వివాహం చేశారు. పెళ్లికి అయ్యే ఖర్చులో దాదాపు రూ.5 లక్షల వరకు తగ్గించి, అభాగ్యులకు ఇవ్వడానికి సంకల్పించడమే కాకుండా ఆచరించి చూపించారు.
పెళ్లి కార్డులోనూ విభిన్నత
పెళ్లి కార్డులకే ఇప్పుడు వేల రూపాయల ఖర్చవుతోంది. ఒకప్పుడు సాదా సీదాగా కేవలం సమాచారం మాత్రమే ఉండే శుభలేఖలు, మారుతున్న కాలానుగుణంగా ఫ్యాషన్ ప్రపంచం వెంట పరుగులు పెడుతూ వివిధ రకాలైన డిజైన్లతో దర్శనమిస్తాయి. అయితే ప్రభాకరరెడ్డి పెళ్లి కార్డులను నిరాడంబరంగా కొట్టించడమే కాకుండా.. వాటిల్లో ఒక చక్కటి సందేశముండే విధంగా కొత్తదనాన్ని తీసుకువచ్చారు. ఆహార పదార్థాలను ఏ మాత్రం వృథా చేయొద్దని ప్రత్యేక విన్నపం కింద పెళ్లికార్డులో ప్రచురించి, చెప్పి మరీ పంచారు. అన్నం లేక వేలాది మంది ఆకలితో నకనకలాడుతుంటే కాస్తంత రుచి చూసి వదిలేయడం తగదంటూ సుతిమెత్తగానే విజ్ఞప్తి రూపంలో స్పష్టం చేశారు. సర్వ్ కాకుండా మిగిలిన ఆహారాన్ని అనాథాశ్రమాలకు తరలించాలని సూచించడంతో వారింటి పెళ్లి కార్డు కూడా ఓ ప్రత్యేకతగా నిలిచిపోయింది.
బాలికల పేరు మీద 5 లక్షలు!
కూతురి పెళ్లి అనుకున్నది మొదలు ఎంత వీలైతే అంత పెళ్లి ఖర్చులు తగ్గించుకోవాలనుకున్నారు ప్రభాకరరెడ్డి. షామియానా, ఫ్లవర్ డెకరేషన్, క్యాటరింగ్ ఇలా ప్రతి చోట రేషన్ నిర్ణయించుకుని తగినంత మాత్రమే ఖర్చు చేయాలని నిశ్చయించుకున్న తర్వాత.. అలా తగ్గించిన అంచనా వ్యయానికి సమానమైన డబ్బును అనాథలకు ఇవ్వాలని నిర్ణయించారు. అనంతపురంలోని పలు అనాథాశ్రమాలలో ఉంటున్న బాలికల పేరు మీద సుమారు రూ. 5 లక్షలను డిపాజిట్ చేశారు! అంతేనా బంధువులకు మల్లే అనాథలందరికి కొత్త దుస్తులు కుట్టించి పెళ్లిలో వారికి వీఐపీల మాదిరి ప్రత్యేక స్థానాలు (ఆ చిన్నారుల పేర్లు రాసి) ఏర్పాటు చేశారు. ఇలా అందరూ ఆడంబరాలను తగ్గించుకుని నిర్భాగ్యులకు సహాయం చేయాలని ప్రభాకరరెడ్డి వినమ్రంగా కోరుకుంటున్నారు.
వృథా మహా పాపం
మా అమ్మాయి సాయి శ్రీవల్లి, కొడుకు శ్రవణ్‌కుమార్, భార్య విజయలక్ష్మి, మా వియ్యంకులు మా ఆలోచనను హర్షించడం వల్లే ఆదర్శమైన వివాహం చేయగలిగాం. ఇటీవల పెళ్లిళ్లలో ఇరవై ముప్పై నుండి వంద దాకా ఐటమ్స్ వడ్డిస్తున్నారు. ఆర్భాటం పెరిగే కొద్దీ ఆహారాన్ని ఎవరూ పూర్తిగా తీసుకోలేరన్నది వాస్తవం. దీనిని దృష్టిలో ఉంచుకుని రూ.లక్షల రూపాయలు మిగిలే విధంగా పెళ్లిని చేయొచ్చని నిరూపించాం. ‘ఆకలి ఉన్న వారికి అన్నం చేరాలి.. అజీర్తి ఉన్న చోట కాదన్నది’ మా నమ్మకం. ముఖ్యంగా అనాథల కళ్లలో ఆనందాలను చూడగల్గితే అంతకంటే మంచి సమాజం మరెక్కడా ఉండదని అనుకుంటాను.
– పుట్టపర్తి ప్రభాకరరెడ్డి, న్యాయవాది, అనంతపురం.
– గుంటి మురళీకృష్ణ, సాక్షి, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment