లిడియా,మోహన్ దంపతులను ఆశీర్వదిస్తున్న సురేష్‌కుమార్, రోజా, విజయ
ఒకప్పుడు ఆమెకు ఎవరూ లేరు. జీవిత నౌక ఏ తీరం చేరుతుందో తెలియనితనం. అనాథగా మారిన ఆ బాలికకు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు వారు. ఉండేందుకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు చక్కటి చదువులు చెప్పించారు. పెళ్లి ఈడు రావడంతో ఓ అయ్యచేతిలో పెట్టి ఘనంగా వివాహం కూడా చేసి పలువురు అభినందనలు అందుకుంటున్నారు పురిటిగడ్డలోని ఐవీఎం ఆశ్రమ నిర్వాహకులు.
కృష్ణా , చల్లపల్లి : ఆమె ఒకప్పుడు అనాథ బాలిక. ఇప్పుడు ఆమెకు అందరూ ఉన్నారు. అర్థాంతరంగా తండ్రి తనువు చాలించడంతో అనాథాశ్రమంలో చేరిన బాలిక నేడు ఎంబీఏ చదివింది. వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన లిడియా 2006లో చల్లపల్లి మండలం పురిటిగడ్డలోని ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ అనాథ బాలల ఆశ్రమంలో చేరింది. తండ్రి మృతి చెందటంతో లిడియా తల్లి సత్యవతి, చెల్లెలు క్రాంతి 2005లో ఐవీఎం హోం నిర్వాహకులు డాక్టర్ వేములపల్లి సురేష్‌కుమార్‌ను ఆశ్రయించారు. అప్పటికే పురిటిగడ్డలో అనాథల సేవ చేస్తున్న సురేష్‌కుమార్ వారిని ఆదరించారు. 2006లో లిడియా కూడా ఆశ్రమంలో చేరింది. వీరిద్దరినీ సురేష్‌కుమార్,రోజా దం పతులు చదివించి ఉత్తమ అలవాట్లను నేర్పించారు.
ఎంబీఏ చదివింది
ఇండియా విలేజ్ మినిస్ట్రీస్‌లో చేరి ఉన్నత విద్య పూర్తి చేసిన తొలి అనాథ బాలిక లిడియా. ఆమె చదువుకయ్యే ఖర్చులన్నీ ఐవీఎం నిర్వాహకులు భరించారు. ఇంజినీరింగ్ చదివి లిడియా తాజాగా ఎంబీఏ పూర్తి చేసింది. ఆమె చెల్లి క్రాంతి సీఎస్‌ఈ చదువుతోంది.
పెళ్లి పెద్దలయ్యారు
ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ ప్రారంభించి 16 సంవత్సరాలుగా అనాథల సేవ చేస్తున్న సురేష్‌కుమార్, రోజా దంపతులు తమ కళ్ల ముందు పెరిగి పెద్దదై, చదువు పూర్తి చేసిన లిడియాకు గురువారం హోంలోనే పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోటకు చెందిన యువకుడు మోహన్‌కు ఇచ్చి వివాహం చేశారు.తనను పెంచి, చదివించి పెళ్లి చేసిన సురేష్‌కుమార్ దంపతులకు లిడియా కృతజ్ఞతలు తెలిపింది.
లిడియా మా పెద్దమ్మాయి
ఆశ్రమం స్థాపించిన తొలినాళ్లలో హోంలో చేరిన లిడియాను మా పెద్దమ్మాయిగా భావించి పెళ్లి చేశాం. హోంలో పెరుగుతున్న ప్రతి బాలుడికీ, బాలికకు మంచి జీవితం ఇవ్వాలన్నదే మా ఆకాంక్ష.
– సురేష్‌కుమార్, రోజా దంపతులు
సొంత బిడ్డలా చూసుకున్నారు
మూడో క్లాసులో నాన్న చనిపోయారు. ఆరో తరగతిలో ఆశ్రమంలో చేరాను. నన్ను బాగా చూసుకున్నారు. మంచి చదువు నేర్పారు. ఐవీఎం హోం నన్ను విద్యావంతురాలిగా తీర్చిదిద్దింది. నిర్వాహకులు తమ సొంత బిడ్డలా భావించి దగ్గరుండి నా వివాహం చేయించడం ఆనందదాయకం. మంచి ఉద్యోగం సాధించి, నాలాంటి అనాథ పిల్లలకు నా వంతు సాయం చేస్తాను. – లిడియా
Comments
Please login to add a commentAdd a comment