రీల్‌లోనే కాదు రియల్‌గాను హిట్‌ పెయిరే | Heroes Heroines Who Got Married In Real Life | Sakshi
Sakshi News home page

రియల్‌గా వివాహం చేసుకున్న హీరో-హీరోయిన్లు

Published Thu, Sep 17 2020 3:51 PM | Last Updated on Thu, Sep 17 2020 5:25 PM

Heroes Heroines Who Got Married In Real Life - Sakshi

(వెబ్‌స్పెషల్‌): రోజులు మారాయి.. ఇప్పుడు అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు. అబ్బాయిలు కూడా జాబ్‌ చేసే అమ్మాయిలనే కోరుకుంటున్నారు. పెళ్లి విషయానికి వస్తే.. ఇద్దరు ఉద్యోగం చేస్తూంటే.. అమ్మాయిది, అబ్బాయిది ఒకే ఫీల్డ్‌ అయితే మరీ మంచిది అంటున్నారు. డాక్టర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు తమ రంగంలోని వారిని వివాహం చేసుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. కానీ సినీ ఫీల్డులో మాత్రం ఈ సూత్రం వర్తించదు. ఇండస్ట్రీకి చెందిన వారు ఎక్కువగా బయటి వ్యక్తులను వివాహం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. అలా ఇండస్ట్రీలోని వారినే వివాహం చేసుకుని.. రీల్‌లోనే కాదు రియల్‌గా కూడా హిట్‌ పెయిర్‌ అనిపించుకుంటున్న వారిని ఓ సారి చూడండి..


కృష్ణ-విజయ నిర్మల
1961లో కృష్ణకు ఆయన మరదలు ఇందిరతో వివాహం అయ్యింది. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’ సినిమాలో మొదటిసారి కృష్ణ,విజయ నిర్మల కలిసి నటించారు. ఆ సినిమా సాక్షిగా వీళ్లిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 1969లో విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో వివాహం అయినప్పటికి అన్యోన్య దంపతులగా గుర్తింపు తెచ్చుకున్నారు.

శ్రీకాంత్‌-ఊహ
‘ఆమె’ సినిమా షూటింగ్‌ టైంలో శ్రీకాంత్‌, ఊహల మధ్య పరిచయం మొదలయింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్‌కు ఊహను పిలిచేవాడు శ్రీకాంత్‌. అలా మెల్లిగా శ్రీకాంత్‌ కుటుంబసభ్యులకు ఊహ అలవాటయ్యారు. ఆ తరువాత ఇరువురి ఇంట్లో ఒప్పుకోవడంతో శ్రీకాంత్‌ - ఊహ వివాహం 1997లో జరిగింది. వీరికి రోషన్, మేధా, రోహన్‌ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. (చదవండి: మొత్తం స్టూడియోలోనే?)

జీవిత-రాజశేఖర్‌
జంట పదాలుగా తెలుగు పరిశ్రమలో ఈ భార్యాభర్తల పేర్లు ఎప్పటికీ పాపులరే. ఓ తమిళ నిర్మాత తన సినిమాకోసం రాజశేఖర్‌కు జోడీగా జీవితను తీసుకున్నారు. మొదటిసారి జీవితను చూసిన రాజశేఖర్ ‘ఈమె వద్దు తొలగించండి’ అంటూ దర్శక నిర్మాతలకు చెప్పారు. ఆయన ఇలా చెప్పడంతో దర్శకనిర్మాతలు.. రాజశేఖర్‌నే తొలగించారు. తరువాత ఈ ఇద్దరూ కలిసి ‘తలంబ్రాలు’  సినిమాలో కలిసి నటించవలసి వచ్చింది. అప్పుడే ఇద్దరి మధ్య పరిచయం పెరిగి, అది కాస్తా ప్రేమగా మారింది. ‘ఆహుతి’ సినిమాలోను కలిసి నటించారు. ఆ సినిమా షూటింగులో రాజశేఖర్ గాయపడినప్పుడు, జీవిత ఆయన దగ్గరే ఉంటూ కంటికి రెప్పలా చూసుకున్నారు. రాజశేఖర్‌పై జీవితకి ఉన్న ప్రేమని అర్థం చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు వీరిద్దరి పెళ్ళికి అంగీకరించారు. 1991 జూలై 10 చెన్నైలో వివాహం చేసుకున్న ఈ జంట‌కి శివానీ, శివాత్మిక అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. 

నాగార్జున- అమల
టాలీవుడ్ సెలబ్రిటీలలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో అక్కినేని నాగార్జున-అమల జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిత్ర పరిశ్రమలో స్టార్ యాక్టర్స్‌గా వెలుగొందుతున్న సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకొని వివాహ బంధంతో ఒకటయ్యారు. నాగార్జున - అమల జంట సిల్వర్ స్క్రీన్ పై 'ప్రేమయుద్ధం' 'కిరాయి దాదా' 'శివ' 'నిర్ణయం' సినిమాలలో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. కాగా 1992 జూన్ 11న వివాహం చేసుకున్నారు. అయితే అంతకు ముందే నాగార్జునకు వెంకటేష్‌ సోదరితో వివాహం జరగడం.. విడాకులు తీసుకోవడం జరిగింది. (చదవండి: నో ప్యాంట్ 2020.. జీన్స్‌కి గుడ్‌బై)

మహేష్‌బాబు-నమ్రత 
అమ్మాయిల కలల రాకుమారుడు ప్రిన్స్‌ మహేష్‌ బాబు. కానీ ఆయనకు మాత్రం భార్య నమ్రత అంటే ఎనలేని ప్రేమ. తన సక్సెస్‌కు కారణం నమ్రత అని చెప్తారు. 2000 సంవత్సరంలో వచ్చిన వంశీ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. ఐదేళ్లు లవ్‌ చేసుకున్న వీరు 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అతి దగ్గరి కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అతి నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

చై-సామ్‌
ప్రస్తుతం ఉన్న దంపతుల్లో చై-సామ్‌కు ప్రత్యేక క్రేజ్‌ ఉంది. ఏ మాయ చేశావే చిత్రంలో వీరిద్దరూ తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత ఆటో నగర్‌ సూర్య, మనం, వంటి చిత్రాల్లో కలిసి నటించారు. 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత మజిలీ చిత్రంలో జంటగా నటించారు.  (చదవండి: బంధుప్రీతి.. గ్యాంగ్‌వార్‌.. డ్రగ్స్‌...)

షాలిని- అజిత్‌
చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చారు షాలిని. బేబీ షాలినిగా ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకున్నారు. తరువాత హీరోయిన్‌గా నటించారు. 2000 సంవత్సరంలో నటుడు అజిత్‌ని వివాహం చేసుకున్నారు షాలిని. వీరిది కూడా అన్యోన్య దాంపత్యం.

సూర్య- జ్యోతిక
తమిళంలోనే కాకుండా సౌత్ మొత్తం మీద పాపులారిటీ ఉన్న హీరోలలో సూర్య ఒకరు. వ్యక్తిగతంగానే కాక ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా మిస్టర్‌ పర్ఫెక్ట్ ఇమేజ్ ఉంది. సమయం దొరికితే చాలు ఆయన కుటుంబంతో గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక సూర్య కూడా హీరోయిన్‌ జ్యోతికని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2006 లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఒక పాప ఒక బాబు సంతానం.  పాప పేరు దియా కాగా బాబు పేరు దేవ్.

ఇక వీరే కాక శివ బాలాజీ - మధుమిత, వరుణ్‌ సందేశ్‌-వితిక, రాధిక-శరత్‌ కుమార్‌, ఆర్య-సయేషా సైగల్‌ ఉండగా ఇక బాలీవుడ్‌లో బిగ్‌ బీ- జయా బచ్చన్‌, అభిషేక్‌- ఐశ్వర్య, కరీనా-సైఫ్‌, దీపికా- రణ్‌వీర్‌ దంపతులు ప్రేమించి వివాహం చేసుకుని.. ఆనందంగా, ఆదర్శంగా జీవిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement