
దుర్గాభవాని, సంధ్య
కష్టాలను గానుగలో వేసి పిండిన సంధ్య, దుర్గాభవానీల చాప్టర్ ఇది. పుస్తకం చదివేది జ్ఞానమూ, విజ్ఞానమూ, సంస్కారం కోసమే కదా! అయితే వీళ్ల చాప్టర్ స్ఫూర్తికోసం చదవాలి. మనందరం పాఠాలు నేర్చుకున్న వాళ్లమే. మన పిల్లలు కూడా. కానీ ఈ బంగారాలు జీవితానికే ఓ పాఠం నేర్పించారు.
‘ఆకాశంలో మెరుపు మెరిసినా, హరివిల్లు విరిసినా తమ కోసమేనని మురిసిపోయే బాల్యంలో ఈ చిన్నారులు ఇంటి బాధ్యతల్ని మోస్తూనే. చదువుల్లో మెరుపులయ్యారు. సర్కారీ బడిలో హరివిల్లులై విరబూశారు. వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఈ ఏడాది టెన్త్‌లో 9.7 జీపీఏ సాధించి సంధ్య, 9.5 జీపీఏతో మొదటి, రెండు స్థానాల్లో నిలిచారు. ఊహ తెలిసేనాటికి సంధ్యకు నాన్న లేడు. కానీ నాన్న నడిపిన పానీపూరీ బండి ఉంది. బండెడు భారాన్ని మీదేసుకున్న అమ్మ తోడుగా ఉంది. బండి నడిస్తేనే బడి. బండి నడిపితేనే బతుకు. అలా అక్షరాలు దిద్దే చేతులతోనే సంధ్య పానీపూరీ తయారు చేసింది.
ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు గప్‌చుప్పులు విక్రయించింది. అమ్మకు చేదోడుగా నిలిచింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బడి, సాయంత్రం ఐదింటి నుంచి రాత్రి పదింటి వరకు బండి. ఆ తర్వాత ఏ తెల్లవారు జామునో నిద్ర లేచి పుస్తకాలతో పోటీ పడిన చిన్నారి సంధ్య పదో తరగతిలో స్కూల్ టాపర్‌గా నిలిచింది. వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలకే వన్నె తెచ్చింది. అదే స్కూల్ నుంచి సెకెండ్ టాపర్‌గా నిలిచిన దుర్గాభవానీ కూడా తల్లిదండ్రులతో పాటు తనూ ‘బతుకు బండి’ని లాగుతూనే ఉంది. అమ్మతో పాటు చెరుకుబండిని నడుపుతూ ఉంది. వీరిద్దరి ప్రతిభపై సాక్షి ఫ్యామిలీ స్పెషల్ రిపోర్ట్.
సంధ్య
సికింద్రాబాద్‌లోని సంగీత్ చౌరస్తా నుంచి క్లాక్‌టవర్ వైపు వెళ్తుంటే ఎడమ వైపు ఓరియంటల్ బ్యాంకు మూలన ఉంటుంది ఆ పానీపూరీ బండి. భర్త దత్తూరాం ఉన్నప్పటి నుంచి అతనితో పాటే పానీపూరీ బండి నడిపింది రాధ. బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం నారాయణ్‌ఖేడ్ నుంచి వీరి కుటుంబం నగరానికి వలస వచ్చింది. పెళ్లయిన ఆరేళ్లకే దత్తూరాం గుండెపోటుతో చనిపోయాడు. ఛాట్‌బండి, రెండు మూడేళ్ల వయస్సు తేడాతో ఉన్న ముగ్గురు కూతుళ్లు, ఆర్నెల్ల వయస్సున్న కొడుకు, ఒక అద్దె గది మిగిలాయి. దుఃఖాన్ని దిగమింగి, పిల్లల్ని భుజానేసుకొని బండిని ముందుకు కదిలించింది రాధ. ఆమెతో పాటు సంధ్య చిట్టి చేతులు కూడా బండిని ముందుకు తోశాయి. అలా ఆ బండి ఆకలికి అన్నం పెట్టింది. చదువు చెప్పించింది. పదోతరగతి కూడా పూర్తి చేయకుండానే పెద్దమ్మాయి అంబికకు పెళ్లి చేశారు కానీ, రెండో అమ్మాయి మనీష, మూడో అమ్మాయి సంధ్య మాత్రం ఇద్దరు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించారు.
మనీష ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. సంధ్య ఈ ఏడాదే పదోతరగతి పూర్తి చేసింది. అబ్బాయి మహేశ్ సర్కారీ బడిలోనే ఏడో తరగతి చదువుతున్నాడు. ‘‘పిల్లలే నా కలల పంట, పెళ్లయిన ఆరేళ్లకే ఆయన పోయినప్పుడు ఇక బతికేదెట్లా అని భయపడ్డాను.అప్పటికి నా కొడుకు 20 రోజుల పసికందు. ఆదుకొనే వాళ్లు కనుచూపు మేరలో లేరు. ఉన్నదల్లా బండి ఒక్కటే. మరోదారి కనిపించలేదు. ఆ బండిని నమ్ముకొనే ఇంతవరకు లాక్కొచ్చాను. పెద్దమ్మాయిని చదివించలేకపోయాననే బాధ ఉంది. కానీ మిగతా ఇద్దరమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు. మనీషను ఇంజనీరింగ్ చదివించాలనుంది. సంధ్య సీఏ చేస్తానంటుంది. ఇంకెన్ని కష్టాలు, బాధలు వచ్చినా సరే వాళ్లను బాగా చదివిస్తాను’’ అంటున్నారు రాధ.
దుర్గాభవానీ
సికింద్రాబాద్‌లోనే రసూల్‌పురా పేదల బస్తీ. ఆ బస్తీలో వికసించిన విజ్ఞాన జ్యోతి దుర్గాభవానీ. వెస్ట్‌మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలోనే ఈ ఏడాది సంధ్యతో పాటు కలిసి చదువుకొని 9.5 జీపీఏతో సెకండ్ టాపర్‌గా నిలిచింది. ఐపీఎస్ ఆమె కల. కల మాత్రమే కాదు ఆశయం కూడా. గత 30 ఏళ్లుగా ప్యారడైజ్ సమీపంలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ బస్టాపు వద్ద పాన్ డబ్బా నడుపుకొంటున్న దుర్గ తండ్రి బాబూరావు, అక్కడే చెరుకు బండి ఏర్పాటు చేసుకున్న తల్లి రాణీల కల కూడా అదే. అక్షరం అంటే ఏంటో తెలియని తమ జీవితాల్లో అక్షర జ్యోతై వెలుగుతున్న దుర్గా భవానీ కోసం కొవ్వొత్తుల్లా కరిగిపోయి అయినా సరే ఆమెను ఐపీఎస్‌ను చేయాలని ఆకాంక్షిస్తున్నారా తల్లిదండ్రులు. ‘‘ఈ సిటీలో పుట్టి పెరిగినం. కానీ ఇప్పటికీ మాకు సొంత ఇల్లు లేదు. రెక్కల కష్టాన్నే నమ్ముకొని బతుకుతున్నవాళ్లం. ఎండాకాలం చెరుకుబండి. వానాకాలం ఛాట్ బండి. అదే మా ఉపాధి. మాతో పాటే పిల్లలు పని చేస్తారు ఇంటిల్లిపాది కష్టపడితేనే బతుకు బండి నడిచేది’’ అన్నారు దుర్గాభవాని తల్లి రాణి. కూతురు దుర్గతో పాటు, కొడుకు శివను కూడా కష్టపడి చదివిస్తున్నారు. ‘‘పదో తరగతిలో అమ్మాయి సాధించిన ఫలితాన్ని చూస్తే జీవితంలో నేనే గెలిచినంత సంతోషం కలిగింది. ఇంకెన్ని కష్టాలొచ్చినా సరే ఆమె కోరుకున్న చదువు చదివిస్తాను’’ అని చెప్పారు బాబూరావు.
కష్టంతోనే జీవితం
‘‘చిన్నప్పటి నుంచి అమ్మ పడిన కష్టాలు తెలుసు. ఆమె బాధలు చూస్తూనే ఉన్నాం. ఆ కష్టాల్లో, బాధల్లోనే పుట్టి పెరిగిన వాళ్లం. కష్టపడి వచ్చిన ఫలితంలో ఉండే తృప్తి మరెందులోనూ ఉండదనిపిస్తుంది. చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్నది నా లక్ష్యం.’’ ఇంటర్‌లో చేరిన తరువాత ఆ లక్ష్యం దిశగా పట్టుదలతో చదువుతాను’’.
– సంధ్య
తప్పకుండా ఐపీఎస్ అవుతా
‘‘ఉదయం బడికి పోయి, సాయంత్రం ఇంటికి వచ్చి.. ఏ పనీ చేయకుండా ఉంటే ఇల్లెట్లా గడుస్తది. అమ్మతో పాటు ఇంటి పని చేస్తాను. సాయంత్రం బండి మీదకి వచ్చి చెరుకు రసం తీస్తాను. అప్పుడప్పుడు నాన్న బయటికెళితే పాన్ డబ్బాలో ఉంటాను. ఎందుకంటే ఇదే మా జీవితం కదా. నేను తప్పకుండా ఐపీఎస్‌ను అయితీరుతాను.
– దుర్గాభవానీ
చదువుల గుడి
మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాల అమ్మాయిల చదువులకు కల్పవల్లిగా ఉంది. అత్యుత్తమ బోధనతో పాటు పిల్లలకు చక్కటి క్రమశిక్షణను అలవరుస్తున్నారు. ఈ ఏడాది సంధ్య, దుర్గాభవానీలతో పాటు, శ్రీదేవి (9.2), జ్యోతి (9.2), రమ్య (9.0)లు కూడా మంచి ఫలితాలను సాధించారు. ‘‘ప్రతి ముగ్గురు పిల్లలకు ఒక టీచర్ బాధ్యత తీసుకుంటారు. ఉదయాన్నే ఇంటికి ఫోన్ చేసి చదువుకోవాలని చెబుతారు. మా టీచర్లు మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తారు. ఎక్కడా ఒత్తిడనిపించదు. చాలా సంతోషంగా, ఆడుతూ, పాడుతూ చదువుకున్నాం. మంచి ఫలితాలను తెచ్చుకున్నాం’’ అని చెప్పారు సంధ్య, దుర్గాభవానీలు. – పడిగిపాల ఆంజనేయులు, సాక్షి, హైదరాబాద్
సాక్షిలో సంధ్య, దుర్గా భవాని వార్త (ఈ పాఠం మన పిల్లలూ చదవాలి) చదివిన పలువురు దాతలు తాము సాయమందిస్తామంటూ ముందుకు వస్తున్నారు. వారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు కింద అందచేస్తున్నాం.
సంధ్య ఫోన్ నెంబరు: 9959132466
దుర్గా భవానీ సెల్ నెంబర్: 9866160698
Comments
Please login to add a commentAdd a comment