తండ్రికే పాఠం నేర్పాడు! | Father taught a lesson! | Sakshi
Sakshi News home page

తండ్రికే పాఠం నేర్పాడు!

Published Sun, Jun 1 2014 10:38 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

తండ్రికే పాఠం నేర్పాడు! - Sakshi

తండ్రికే పాఠం నేర్పాడు!

స్ఫూర్తి
 
చిన్నపిల్లలకు ఏమీ తెలియదు అనుకుంటాం. కానీ కొన్నిసార్లు వాళ్లు పెద్దవాళ్లకే పాఠాలు నేర్పుతుంటారు. కెన్ కూడా తన తండ్రికి ఓ పాఠం నేర్పాడు. కానీ అది పాఠం కాదు గుణపాఠమంటాడు కెన్ తండ్రి.
 
ఫిలిప్పైన్‌‌సకు చెందిన తొమ్మిదేళ్ల కెన్‌లో ఉన్నట్టుండి ఏదో మార్పు కనిపించింది అతడి తండ్రికి. రోజూ స్కూలు నుంచి వచ్చాక ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్లిపోతున్నాడు కెన్. ఆడుకోవడానికి వెళ్తున్నాడేమో అనుకున్నాడు తండ్రి మొదట. కానీ రోజూ వీపునకు బ్యాగ్ ఒకటి తగిలించుకుని వెళ్లడం చూసి అనుమానమొచ్చింది. రెండు వారాలు చూసిన తరువాత ఓ రోజు కొడుకుని అనుసరించాడు తండ్రి. కెన్ చేస్తున్న పని చూసి అతడు అవాక్కయ్యాడు.
 
తన ఇంటి చుట్టుపక్కల ఉన్న వీధులన్నీ తిరుగు తున్నాడు కెన్. ఎక్కడ వీధికుక్కలు కనిపిస్తే అక్కడ ఆగిపోతున్నాడు. తన బ్యాగ్‌లోంచి బిస్కట్లు, కేక్ ముక్కలు, తీసి... వెంట తెచ్చిన పేపర్ ప్లేట్లలో వేసి కుక్కలకు పెడుతున్నాడు. ఆ దృశ్యం చూసి విస్తుపోయాడు తండ్రి. వెంటనే వెళ్లి కొడుకుని హత్తుకున్నాడు. ఏమిటిదంతా అని అడిగితే... ‘‘నాకు నువ్వు తిండి పెడతావ్ కదా డాడీ! పాపం వీటికెవరు పెడతారు’’ అన్నాడు కెన్. కొడుకు అన్న ఆ మాటలు తండ్రి మనసును తాకాయి. ఆ రోజు నుంచి ప్రతిరోజూ తన కొడుకుతో పాటు తను కూడా ఆహారం తీసుకుని బయలుదేరడం మొదలుపెట్టాడు.
 
‘‘మురికిపట్టి వీధుల్లో తిరిగే ఆ కుక్కలను ఎన్నోసార్లు అసహ్యించుకుని తరిమికొట్టాను. కానీ నా కొడుకు వాటిని ప్రేమించాడు. నాకు చాలా సిగ్గుగా ఉంది’’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. వీధికుక్కల కడుపు నింపుతోన్న తన కొడుకు ఫొటోలను కూడా అప్‌లోడ్ చేశాడు. అవి చూసి చాలామంది కెన్‌కి ఫ్యాన్‌‌స అయిపోయారు. వాళ్లంతా కెన్ చిరునామా తెలుసుకుని విరాళాలు పంపడం మొదలు పెట్టారు. వాటితో కెన్ ‘హ్యాపీ యానిమల్స్ క్లబ్’ను ప్రారంభించాడు. తండ్రితో కలిసి దిక్కులేని మూగజీవులను తెచ్చి పెంచుతున్నాడు. హ్యాట్సాఫ్ కెన్!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement