పెన్సిల్, ఎరేజర్ | Pencil, Eraser | Sakshi
Sakshi News home page

పెన్సిల్, ఎరేజర్

Published Mon, Jun 9 2014 4:58 AM | Last Updated on Sat, Sep 2 2017 8:30 AM

పెన్సిల్, ఎరేజర్

పెన్సిల్, ఎరేజర్

 ప్రేరణ
 
మీలో ఉన్న సహజ ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేయండి. పెన్సిల్‌తో రాసిన అక్షరాలను చెరిపేసే రబ్బర్ ముక్క(ఎరేజర్), పెన్సిల్ మధ్య జరిగిన ఆసక్తికరమైన ఊహాత్మక సంభాషణను ఇటీవలే ఒకరు నా చెవిన వేశారు. అదేమిటో మీరు కూడా తెలుసుకోండి. మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని నమ్మకంగా చెప్పగలను.

పెన్సిల్: నన్ను క్షమించు!
ఎరేజర్: ఎందుకు చెబుతున్నావ్
 
పెన్సిల్: నా వల్ల నువ్వు ఎంతో కష్టపడుతున్నావ్, నష్టపోతున్నావ్. నేను ఏదైనా తప్పుగా రాసిన ప్రతిసారి నువ్వు దాన్ని చెరిపేస్తున్నావ్.  నా రంగు అంటుకొని నల్లగా, వికారంగా మారుతున్నావ్. క్రమంగా అరిగిపోతూ ఆకారంలో చిన్నగా మారిపోతున్నావ్. చివరికి పూర్తిగా కనిపించకుండా పోతావ్.
ఎరేజర్: నిజంగా నువ్వు క్షమాపణ చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. నేనిక్కడ ఉన్నది నువ్వు తప్పు చేసినప్పుడు సరిచేసేందుకే! నా పని నేను చేసుకుంటున్నందుకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. ఏదో ఒకరోజు నేను పూర్తిగా అరిగిపోక తప్పదని నాకు తెలుసు. అప్పుడు నా స్థానంలో మరో ఎరేజర్ వస్తుంది. నీ తప్పును చెరిపేసే అవకాశం దక్కడం నాకు గర్వంగా ఉంది. నా గురించి విచారిస్తూ నువ్వు రాయడం మానుకోవద్దు. నీ బాధ్యత నీదే, నా బాధ్యత నాదే! ఎవరి పని వారు చేయాల్సిందే!!
 
విద్యార్థుల జీవితాల్లో ‘ఎరేజర్లు’

మీ జీవితాల్లోని ఎరేజర్లను ఎప్పుడైనా గుర్తించారా? లేకపోతే ఆ పని ఇప్పుడే చేయండి. విద్యార్థుల తప్పులను సరిచేసే ఎరేజర్లు నిస్సందేహంగా వారి ఉపాధ్యాయులే. పెన్సిల్ లాంటి విద్యార్థులు చేసే తప్పులను గురువులే సరిచేస్తారు. అందుకోసం వారు తమవంతు శ్రమిస్తారు. ఈ క్రమంలో కొంత శక్తిని, సమయాన్ని కోల్పోయినప్పటికీ ఏ మాత్రం చింతించరు. కారణం.. వారు గురువుల స్థానంలో ఉన్నది విద్యార్థుల తప్పులను సరిదిద్ది, ఉత్తములుగా తీర్చిదిద్దేందుకే. ఉపాధ్యాయుల శ్రమ వల్లే విద్యార్థులు పరిశుద్ధులుగా మారతారు. ఆదర్శప్రాయమైన పౌరులుగా ఎదుగుతారు. పాఠశాల నుంచి కళాశాలకు.. అక్కడి నుంచి వృత్తి లేదా ఉద్యోగాల్లోకి.. ఎక్కడికి వెళ్లినా మార్గదర్శనం చేసే కొత్తకొత్త గురువులు ఎదురుపడుతూనే ఉంటారు. మీ ఉన్నతిని చూసి గర్వించే ఆయా గురువులను సందర్భం వచ్చినప్పుడల్లా స్మరించుకోండి. పెన్సిల్ రాసిన రాతలకు గుర్తింపు వచ్చిదంటే.. అది కేవలం ఎరేజర్ వల్లే..
 
నిస్వార్థ తోటమాలులు

ఉపాధ్యాయులను ప్రత్యేకంగా నిలిపే లక్షణం ఏమిటంటే.. ప్రతి విద్యార్థిలో దాగిఉన్న సహజ ప్రతిభా పాటవాలను పసిగట్టే సామర్థ్యాన్ని కలిగి ఉండడం. సొంత అన్నదమ్ములైన ఇద్దరు విద్యార్థుల్లో తెలివితేటలు ఒకేస్థాయిలో ఉండకపోవచ్చు. ఒకరు చదువుల్లో చురుగ్గా దూసుకుపోతుంటే మరొకరు వెనుకంజ వేస్తుండవచ్చు. కొందరికి అన్ని సబ్జెక్టులపై ఒకే రకమైన ఆసక్తి లేకపోవచ్చు. విద్యార్థుల ప్రతిభకు మార్కులు, ర్యాంకులే ప్రామాణికం కాదు. నా స్నేహితురాలికి ఇద్దరు కుమారులున్నారు. వారిలో పెద్దవాడు చదువులో ప్రథమ శ్రేణిలో నిలుస్తున్నాడు. చిన్నబ్బాయికి చదువుపై అంతగా శ్రద్ధ లేదు. అతడు సాధిస్తున్న గ్రేడ్లు నిరాశపరుస్తున్నాయి. తన రెండో కుమారుడి భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్న నా మిత్రురాలు అతడి ఉపాధ్యాయుడిని కలిసింది. తన బిడ్డ తీరుపై గోడు వెళ్లబోసుకుంది. దీంతో సదరు ఉపాధ్యాయుడు ఆమెకు తగిన భరోసా ఇచ్చాడు. ‘‘మీ కుమారుడి గురించి విచారించకండి. చదువులో చురుగ్గా లేకున్నా.. అతడిలో మంచి తెలివితేటలు ఉన్నాయి. జామ చెట్టుకు మామిడికాయలు కాయాలనే అత్యాశ సరికాదు. వేర్వేరు రకాల చెట్లు తమవైన వేర్వేరు రకాల పళ్లను ఇస్తాయి. దేని రుచి దానిదే. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కేవలం నిస్వార్థంగా పనిచేసే తోటమాలులు మాత్రమే. చెట్టుకు నీరు పోసి, ఎరువు వేసి ఆరోగ్యంగా ఎదగనీయడం వరకే వారి బాధ్యత’’ అని పూర్తి చేశాడు. నా స్నేహితురాలి ఇద్దరు కుమారులు తాము ఎంచుకున్న రంగాల్లో ఇప్పుడు వృద్ధిలోకి వచ్చారు. విజయవంతమైన వ్యక్తులుగా సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నారు.
 
ఎరేజర్.. మీ చేతుల్లోనే

జీవితంలో తెలిసీ తెలియక చేసిన తప్పులను పదేపదే గుర్తుచేసుకొని బాధపడుతూ కూర్చుంటే ఉన్నచోటు నుంచి అంగుళం కూడా ముందుకెళ్లలేరు. పొరపాట్లను సరిదిద్దుకొనేందుకు అవసరమైన ‘ఎరేజర్’ మీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోండి. మీరు ఇంజనీరో, డాక్టరో కాకపోవచ్చు. గొప్ప పదవిలో ఉండకపోవచ్చు. అందుకు చింతించాల్సిన పని లేదు. మీకు మీరుగా ఉత్తమంగా ఉండేందుకు మీరు చేయగలిగినంత కృషి చేయండి. జామ చెట్లకు మామిడి కాయలు కాయవు. జామ చెట్లు జామ కాయలనే ఇస్తాయి. మీదైన ప్రత్యేకతను నిలబెట్టుకోండి. మీరు మీలాగే ఉండేందుకు తోడ్పాటునందించిన గురువులకు కృతజ్ఞతలు తెలియజేయండి.
 
 -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement