శాంతి యాత్రికుడు
చదువుతున్నది ఇంజనీరింగ్... మధ్యలోనే బ్రేక్...
ఆధ్యాత్మిక ఆలోచనలతో ఏదో అన్వేషణ... నాలుగైదేళ్ల పాటు దేశం నలుమూలలా పర్యటన... ఆ పర్యటన ఆ కుర్రాడి జీవితాన్నే మార్చేసింది.
ప్రజల మధ్య అసహనం, కోపతాపాలు... ఇవన్నీ ప్రయాణంలో గమనించిన బెంగళూరు కుర్రాడు అనిల్ ఆలోచనలో పడ్డాడు. ‘శాంతి భావన’ చిన్నబోవడాన్ని చూసి బాధపడడం కంటే ‘బాధ్యత’ను తలకెతు ్తకోవడం కనీస బాధ్యత అనుకున్నాడు. అంతే... ‘పీస్ ప్రాజెక్ట్’ ప్రారంభించాడు. ఇరవై ఏడేళ్ళ వయసులో శాంతి యాత్రికుడయ్యాడు...
కర్ణాటకలోని ఉడిపి దగ్గరల్లో ఉన్న కుందాపుర గ్రామంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన అనిల్‌శెట్టి కళాశాల వరకూ స్థానికంగానే చదివారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ కోసం బెంగళూరులోని ఎం.ఎస్. రామయ్య కళాశాలలో చేరారు. అప్పటి నుంచి ‘భగవద్గీత’ చదవడం అలవాటు చేసుకున్నారు. అనిల్ ఆలోచన విధానాన్ని భగవద్గీత మార్చింది. ఆధ్యాత్మిక జీవనంపై ఆసక్తిని పెంచింది.
ఏడాదిన్నర ఇంజనీరింగ్ కోర్సు తర్వాత చదువును మధ్యలోనే ఆపేసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేవారు అనిల్. మొదట్లో తల్లిదండ్రులు వారించినా తర్వాత మిన్నకుండిపోయారు. ఈ క్రమంలో దాదాపు నాలుగైదేళ్ల పాటు దేశంలో చాలా ప్రాంతాలు తిరిగారు అనిల్. ప్రజల మధ్య సఖ్యత లోపించడాన్ని, ద్వేషం పెరగడాన్ని ఈ ప్రయాణంలో గమనించారు. ఈ నేపథ్యంలో ప్రజల మధ్య శాంతిని పెంపొందింపజేయడమే లక్ష్యంగా 2012 చివర్లో ‘ద వరల్డ్ పీస్ కీపర్స్ మూమెంట్’ను స్థాపించారు. ఇందులో భాగంగా ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందించడం, శాంతియుతంగా మెలగడం తదితర విషయాలపై సెమినార్లు, వర్క్‌షాపులు నడుపుతున్నారు. అంతేకాదు... ప్రజల వద్దకే ‘ది వరల్డ్ పీస్ కీపర్స్ మూమెంట్’ను తీసుకువెళ్లాలని భావించి ‘పీస్ ఆటో’ ప్రాజెక్టుకు 2013లో శ్రీకారం చుట్టారు.
ఆటో గ్రంథాలయం...
ఆటోలో ప్రయాణికులకు కుడివైపున అరలున్న చిన్నపాటి అల్మరా ఉంటుంది. ఇందులో ఆరోజు వార్తాపత్రికతోపాటు మ్యాగజైన్‌లు, శాంతిని బోధించే పుస్తకాలతో పాటు అనిల్‌శెట్టి రాసిన ‘మేకింగ్ ఆఫ్ ఐ’ పుస్తకం ఉంటుంది. చిన్నచిన్న కారణాలకే రోడ్లపై గొడవలు ఎలా జరుగుతున్నాయి, ఆ సమయంలో మనం ప్రవర్తించే విధానం వ్యక్తిగత ప్రతిష్ఠను ఎలా దెబ్బ తీస్తుంది... మొదలైన విషయాలు ఈ పుస్తకంలో చిన్నచిన్న కథల రూపంలో ఉంటాయి. కావాలనుకుంటే ప్రయాణికులు ఈ పుస్తకాన్ని ఉచితంగా తీసుకుని వెళ్లవచ్చు. పీస్ ఆటోలో ప్రయాణ సమయంలో డ్రైవర్ ప్రవర్తన, తదితర విషయాల గురించి ఆటోలో ఉన్న ఫీడ్‌బ్యాక్ పుస్తకంలో నమోదు చేయవచ్చు.
ఆదర్శ ఆటోలు...
ఈ పీస్ ఆటో మూమెంట్‌లో చేరాలనుకునే వారు ఎటువంటి రుసుములూ చెల్లించనక్కరలేదు. అయితే సదరు డ్రైవర్ నడవడిక గురించి క్షుణ్ణంగా వాకబు చేసిన తర్వాతనే పీస్ ఆటో ప్రాజెక్టులోకి చేర్చుకుంటారు. ప్రాజెక్టు మొదలై దాదాపు పది నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఈ ప్రాజెక్టులో ఆటోల సంఖ్య రెండు వందలు మాత్రమే. దీంతో ఈ ప్రాజెక్టుకు ఎంపిక విధానం ఎంత కచ్చితంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ‘‘నగరంలో ప్రస్తుతం రెండు వందల పీస్ ఆటోలు ఉన్నాయి. ఒక్కొక్క ఆటో రోజుకు ఆరు ట్రిప్పుల చొప్పున తిరుగుతుంది అనుకుందాం. ట్రిప్పుకు సగటున ముగ్గురు ప్రయాణికులను లెక్కకు తీసుకున్నా రోజుకు పీస్ ఆటోల్లో మూడు వేల ఆరువందల మంది ప్రయాణిస్తున్నారు. అంటే నెలకు పీస్ ఆటోలో ప్రయాణించే వారి సంఖ్య లక్షకు పై మాటే.
ఇందులో పదేపదే ఆటోల్లో వెళ్ళే ప్రయాణికులు 50 వేల మంది అనుకున్నా మిగిలిన 50 వేల మంది కొత్తవారే. వీరందరికీ శాంతియుతంగా ఎలా మెలగాలి? అనేదాన్ని గురించి ఆటోడ్రైవర్లు తమ ప్రవర్తన ద్వారా కొంత, ఆటోలో ఉన్న పుస్తకాల ద్వారా మరికొంత తెలియజేస్తారు. ఈ లక్షమందిలో నెలకు వెయ్యి మంది తమ స్వభావాన్ని మార్చుకున్నా... కొన్నేళ్లలో నేననుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాను’’ అంటున్నారు అనిల్.
‘పీస్ మూమెంట్’లో భాగంగా ప్రయాణికుల ద్వారా ఉత్తమ ఆటోడ్రైవర్లుగా గుర్తించబడినవారితోపాటు విధి నిర్వహణలో శాంతియుతంగా మెలిగిన ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌ను వివిధ మార్గాల ద్వారా (ఎస్.ఎం.ఎస్, ఫేస్‌బుక్ తదితర విధానాల ద్వారా) ఎంపిక చేసి ‘అన్‌సంగ్ హీరోస్’ పేరుతో అనిల్‌శెట్టి సత్కరించారు.
త్వరలో పింక్ ఆటోలు...
‘ది వరల్డ్ పీస్ కీపర్స్ మూమెంట్’ త్వరలో పింక్ ఆటోలను తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో మహిళలే డ్రైవర్లుగా ఉంటారు. అనిల్ ఆశయాలు, ఆచరణలు నచ్చిన కొన్ని ప్రైవేటు సంస్థలు అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తున్నాయి.
త్వరలోనే ‘షాపింగ్ ఇన్ ద స్పిరిచ్యువల్ సూపర్ మార్కెట్’ అనే పుస్తకాన్ని పూర్తి చేసి అందులో విషయాలను ఆటోల ద్వారా ప్రజలకు చేరువ చేయడం ద్వారా వారిలో ఆధ్యాత్మిక, శాంతియుత భావనలు పెంపొందించే ప్రయత్నంలో ఉన్నారు ఇరవై ఏడు సంవత్సరాల అనిల్.
- బేల్దార్ సజ్జేంద్ర కిషోర్, సాక్షి, బెంగళూరు
ఫోటో: ధనుంజయ టి.కె
నెలకు పీస్ ఆటోల్లో ప్రయాణించే వారి సంఖ్య లక్షకు పై మాటే. ఇందులో పదేపదే ఆట్లో వెళ్ళే ప్రయాణికులు 50 వేల మంది అనుకున్నా మిగిలిన 50 వేల మంది కొత్తవారే. వీరందరికీ శాంతియుతంగా ఎలా మెలగాలి? అనేదాన్ని గురించి ఆటోడ్రైవర్లు తమ ప్రవర్తన ద్వారా కొంత, ఆటోలో ఉన్న పుస్తకాల ద్వారా మరికొంత తెలియజేస్తారు. ఈ లక్షమందిలో నెలకు వెయ్యి మంది తమ స్వభావాన్ని మార్చుకున్నా... కొన్నేళ్లలో నేననుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాను.