Anil Shetty
-
యూరేక మూమెంట్ కాస్త.. 'మెటామ్యాన్గా'
'వచ్చిన 'ఐడియా'కు ఒక రూపం ఇచ్చి లాభదాయక కంపెనీగా నిర్మించడం అనేది అంత సులభం కాదు. దారి కనిపించినట్లుగానే ఉంటుంది. గమ్యం చేరడం మాత్రం సులువు కాదు, ఎంటర్ప్రెన్యూర్ కలలు కనే యువతరం తమకు వచ్చిన ఐడియాకు సంబంధించి అన్ని కోణాల్లో హోంవర్క్ చేస్తే సూపర్ సక్సెస్ సాధించవచ్చని నిరూపించింది బెంగళూరుకు చెందిన 'మెటామ్యాన్' స్టార్టప్. 'మన దేశంలో పురుషులకు జువెలరీ బ్రాండ్స్‌కు సంబంధించి తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి' అనే మాట బాలీవుడ్ నటుడు సునీల్ షెట్టి నోట విన్న తరువాత అనీల్ షెట్టీ తన స్నేహితుడు హర్ష్ మస్కరతో కలిసి 'మెటా మ్యాన్' పేరుతో డిజైన్-ఓరియెంటెడ్ 'డైరెక్ట్-టు-కన్జ్యూమర్ బ్రాండ్' (డీ2సీ)కి శ్రీకారం చుట్టాడు. ప్రారంభించిన ఆరు నెలలోనే ఈ బ్రాండ్ సూపర్ డూపర్ హిట్ అయింది.' లండన్‌కు చెందిన మార్కెట్ రిసెర్చ్ కంపెనీ 'యూరోమానిటర్ ఇంటర్నేషనల్' అంచనా ప్రకారం మెన్ జువెలరీకి సంబంధించి ఇండియా థర్డ్-లార్జెస్ట్ మార్కెట్‌గా ఎదగనుంది. 'మెటామ్యాన్'కు ముందు సునీల్ షెట్టితో కలిసి మాట్లాడాడు అనీల్. ఈ ఆలోచన నచ్చడంతో కంపెనీ ఫౌండింగ్ మెంటర్, ఇన్వెస్టర్‌గా ఉండడానికి ముందుకు వచ్చాడు సునీల్ షెట్టి. హిప్ హప్ జువెలరీ ధరించడం అనేది ఇండియాలో బలపడుతున్న ట్రెండ్ అయినప్పటికీ ఏవో కొన్ని తప్ప తగినన్నీ ఆప్షన్స్ లేవు. ఈ లోటును భర్తీ చేయడానికి 'మెటామ్యాన్'తో ముందుకు వచ్చి సక్సెస్ అయింది. ట్రెండ్‌తో పాటు బడ్జెట్‌ను కూడా దృష్టిలో పెట్టుకొని అందుబాటు ధరల్లో బ్రాస్ లెట్స్, చైన్స్, రింగ్స్.. మొదలైన వాటిని డిజైన్ చేయించారు. సందర్భానికి తగినట్లుగా డైలీ ఆఫీస్ వియర్, క్యాజువల్ వియర్, స్పోర్ట్స్ వియర్, ట్రావెల్ వియర్.. మొదలైన వాటిని డిజైన్ చేయించారు. 'మెటామెన్' పీసెస్లు ఫిల్మ్ ఫేర్, లైఫెస్టైల్ ఏసియాలాంటి మ్యాగజైన్లలో కని పించడంతో వాటికి మరింత ప్రాచుర్యం వచ్చింది. ఈ కంపెనీ ఏంజెల్ ఇన్వెస్టర్ జాబితాలో సునీల్ షెట్టితో పాటు నిఖిల్ కామత్ (జెరోద), కేఎల్ రాహుల్ (ఇండియన్ క్రికెటర్), ఆశిష్ (బుక్ మై షో), ప్రశాంత్ ప్రకాష్ (యాక్సెల్ పాట్నర్స్), సుజిత్ కుమార్ (ఉడాన్), హర్షిల్ మాధుర్, శశాంక్ కుమార్ (రేజర్‌పే) చేరారు. రాబోయే ఆరు నెలల కాలంలో రెండు వందల కొత్త ప్రాడక్ట్స్ డిజైన్ చేయడానికి రెడీ అయింది మెటామ్యాన్. 2024లో దుబాయ్, ఇండోనేషియా, సింగపూర్, ఆస్ట్రేలియాలలో తమ బ్రాండ్‌ను విస్తరించే పనిలో ఉంది. అనీల్ షెట్టికి ఫ్యాషన్ నుంచి పాలిటిక్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వరకు ఎన్నో రంగాలపై ఆసక్తి ఉంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనే కల ఉంది. తన కలను నిజం చేసుకునే దారిని వెదుక్కునే క్రమంలో అనీలకు సునీల్ షెట్టి మాటలు దారి చూపించాయి. పురుషుల యాక్సెసరీస్, జువెలరీ మార్కెట్లో గెలుపు జెండా ఎగరేసేలా చేశాయి. 'ఆసియాలోని లీడింగ్ జెన్ జెడ్ జువెలరీ బ్రాండ్‌గా ఎదగాలనేది మా లక్ష్యం అంటున్నాడు 'మెటామ్యాన్' కో-ఫౌండర్ అనీల్ శెట్టి. యూరేక మూమెంట్.. యూరేక మూమెంట్ అనేది ఏ వ్యక్తికి అయినా ఏదో ఒక సమయంలో వస్తుంది. తల్లి నెక్లెస్‌ను మెడలో ధరించిన సునీల్ షెట్టిని చూసిన తరువాత నాకు ఐడియా వచ్చింది. మెన్ జువెలరీ అనేది మన దేశంలో వినూత్న కాన్సెప్ట్. ఐడియా కొత్తగా ఉన్నంత మాత్రాన సక్సెస్ కావాలని లేదు. 360 డిగ్రీ కోణంలో ఆలోచించి మంచి, చెడులపై ఒక అవగాహనకు వచ్చాం.. ఫ్యాషన్ జువెలరీ ధరించాలనే ఆసక్తి పురుషులకు ఉన్నప్పటికీ అట్రాక్టివ్, క్వాలిటీ డిజైన్లు వారికి కనిపించడం లేదు. ఈ లోటును పూరించేలా మా జువెలరీని డిజైన్ చేసి సక్సెస్ సాధించాం. - అనీల్ షెట్టి, మెటామ్యాన్, కో-ఫౌండర్ -
శాంతి యాత్రికుడు
చదువుతున్నది ఇంజనీరింగ్... మధ్యలోనే బ్రేక్... ఆధ్యాత్మిక ఆలోచనలతో ఏదో అన్వేషణ... నాలుగైదేళ్ల పాటు దేశం నలుమూలలా పర్యటన... ఆ పర్యటన ఆ కుర్రాడి జీవితాన్నే మార్చేసింది. ప్రజల మధ్య అసహనం, కోపతాపాలు... ఇవన్నీ ప్రయాణంలో గమనించిన బెంగళూరు కుర్రాడు అనిల్ ఆలోచనలో పడ్డాడు. ‘శాంతి భావన’ చిన్నబోవడాన్ని చూసి బాధపడడం కంటే ‘బాధ్యత’ను తలకెతు ్తకోవడం కనీస బాధ్యత అనుకున్నాడు. అంతే... ‘పీస్ ప్రాజెక్ట్’ ప్రారంభించాడు. ఇరవై ఏడేళ్ళ వయసులో శాంతి యాత్రికుడయ్యాడు... కర్ణాటకలోని ఉడిపి దగ్గరల్లో ఉన్న కుందాపుర గ్రామంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన అనిల్శెట్టి కళాశాల వరకూ స్థానికంగానే చదివారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ కోసం బెంగళూరులోని ఎం.ఎస్. రామయ్య కళాశాలలో చేరారు. అప్పటి నుంచి ‘భగవద్గీత’ చదవడం అలవాటు చేసుకున్నారు. అనిల్ ఆలోచన విధానాన్ని భగవద్గీత మార్చింది. ఆధ్యాత్మిక జీవనంపై ఆసక్తిని పెంచింది. ఏడాదిన్నర ఇంజనీరింగ్ కోర్సు తర్వాత చదువును మధ్యలోనే ఆపేసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేవారు అనిల్. మొదట్లో తల్లిదండ్రులు వారించినా తర్వాత మిన్నకుండిపోయారు. ఈ క్రమంలో దాదాపు నాలుగైదేళ్ల పాటు దేశంలో చాలా ప్రాంతాలు తిరిగారు అనిల్. ప్రజల మధ్య సఖ్యత లోపించడాన్ని, ద్వేషం పెరగడాన్ని ఈ ప్రయాణంలో గమనించారు. ఈ నేపథ్యంలో ప్రజల మధ్య శాంతిని పెంపొందింపజేయడమే లక్ష్యంగా 2012 చివర్లో ‘ద వరల్డ్ పీస్ కీపర్స్ మూమెంట్’ను స్థాపించారు. ఇందులో భాగంగా ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందించడం, శాంతియుతంగా మెలగడం తదితర విషయాలపై సెమినార్లు, వర్క్‌షాపులు నడుపుతున్నారు. అంతేకాదు... ప్రజల వద్దకే ‘ది వరల్డ్ పీస్ కీపర్స్ మూమెంట్’ను తీసుకువెళ్లాలని భావించి ‘పీస్ ఆటో’ ప్రాజెక్టుకు 2013లో శ్రీకారం చుట్టారు. ఆటో గ్రంథాలయం... ఆటోలో ప్రయాణికులకు కుడివైపున అరలున్న చిన్నపాటి అల్మరా ఉంటుంది. ఇందులో ఆరోజు వార్తాపత్రికతోపాటు మ్యాగజైన్లు, శాంతిని బోధించే పుస్తకాలతో పాటు అనిల్శెట్టి రాసిన ‘మేకింగ్ ఆఫ్ ఐ’ పుస్తకం ఉంటుంది. చిన్నచిన్న కారణాలకే రోడ్లపై గొడవలు ఎలా జరుగుతున్నాయి, ఆ సమయంలో మనం ప్రవర్తించే విధానం వ్యక్తిగత ప్రతిష్ఠను ఎలా దెబ్బ తీస్తుంది... మొదలైన విషయాలు ఈ పుస్తకంలో చిన్నచిన్న కథల రూపంలో ఉంటాయి. కావాలనుకుంటే ప్రయాణికులు ఈ పుస్తకాన్ని ఉచితంగా తీసుకుని వెళ్లవచ్చు. పీస్ ఆటోలో ప్రయాణ సమయంలో డ్రైవర్ ప్రవర్తన, తదితర విషయాల గురించి ఆటోలో ఉన్న ఫీడ్‌బ్యాక్ పుస్తకంలో నమోదు చేయవచ్చు. ఆదర్శ ఆటోలు... ఈ పీస్ ఆటో మూమెంట్లో చేరాలనుకునే వారు ఎటువంటి రుసుములూ చెల్లించనక్కరలేదు. అయితే సదరు డ్రైవర్ నడవడిక గురించి క్షుణ్ణంగా వాకబు చేసిన తర్వాతనే పీస్ ఆటో ప్రాజెక్టులోకి చేర్చుకుంటారు. ప్రాజెక్టు మొదలై దాదాపు పది నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఈ ప్రాజెక్టులో ఆటోల సంఖ్య రెండు వందలు మాత్రమే. దీంతో ఈ ప్రాజెక్టుకు ఎంపిక విధానం ఎంత కచ్చితంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ‘‘నగరంలో ప్రస్తుతం రెండు వందల పీస్ ఆటోలు ఉన్నాయి. ఒక్కొక్క ఆటో రోజుకు ఆరు ట్రిప్పుల చొప్పున తిరుగుతుంది అనుకుందాం. ట్రిప్పుకు సగటున ముగ్గురు ప్రయాణికులను లెక్కకు తీసుకున్నా రోజుకు పీస్ ఆటోల్లో మూడు వేల ఆరువందల మంది ప్రయాణిస్తున్నారు. అంటే నెలకు పీస్ ఆటోలో ప్రయాణించే వారి సంఖ్య లక్షకు పై మాటే. ఇందులో పదేపదే ఆటోల్లో వెళ్ళే ప్రయాణికులు 50 వేల మంది అనుకున్నా మిగిలిన 50 వేల మంది కొత్తవారే. వీరందరికీ శాంతియుతంగా ఎలా మెలగాలి? అనేదాన్ని గురించి ఆటోడ్రైవర్లు తమ ప్రవర్తన ద్వారా కొంత, ఆటోలో ఉన్న పుస్తకాల ద్వారా మరికొంత తెలియజేస్తారు. ఈ లక్షమందిలో నెలకు వెయ్యి మంది తమ స్వభావాన్ని మార్చుకున్నా... కొన్నేళ్లలో నేననుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాను’’ అంటున్నారు అనిల్. ‘పీస్ మూమెంట్’లో భాగంగా ప్రయాణికుల ద్వారా ఉత్తమ ఆటోడ్రైవర్లుగా గుర్తించబడినవారితోపాటు విధి నిర్వహణలో శాంతియుతంగా మెలిగిన ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌ను వివిధ మార్గాల ద్వారా (ఎస్.ఎం.ఎస్, ఫేస్బుక్ తదితర విధానాల ద్వారా) ఎంపిక చేసి ‘అన్సంగ్ హీరోస్’ పేరుతో అనిల్శెట్టి సత్కరించారు. త్వరలో పింక్ ఆటోలు... ‘ది వరల్డ్ పీస్ కీపర్స్ మూమెంట్’ త్వరలో పింక్ ఆటోలను తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో మహిళలే డ్రైవర్లుగా ఉంటారు. అనిల్ ఆశయాలు, ఆచరణలు నచ్చిన కొన్ని ప్రైవేటు సంస్థలు అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తున్నాయి. త్వరలోనే ‘షాపింగ్ ఇన్ ద స్పిరిచ్యువల్ సూపర్ మార్కెట్’ అనే పుస్తకాన్ని పూర్తి చేసి అందులో విషయాలను ఆటోల ద్వారా ప్రజలకు చేరువ చేయడం ద్వారా వారిలో ఆధ్యాత్మిక, శాంతియుత భావనలు పెంపొందించే ప్రయత్నంలో ఉన్నారు ఇరవై ఏడు సంవత్సరాల అనిల్. - బేల్దార్ సజ్జేంద్ర కిషోర్, సాక్షి, బెంగళూరు ఫోటో: ధనుంజయ టి.కె నెలకు పీస్ ఆటోల్లో ప్రయాణించే వారి సంఖ్య లక్షకు పై మాటే. ఇందులో పదేపదే ఆట్లో వెళ్ళే ప్రయాణికులు 50 వేల మంది అనుకున్నా మిగిలిన 50 వేల మంది కొత్తవారే. వీరందరికీ శాంతియుతంగా ఎలా మెలగాలి? అనేదాన్ని గురించి ఆటోడ్రైవర్లు తమ ప్రవర్తన ద్వారా కొంత, ఆటోలో ఉన్న పుస్తకాల ద్వారా మరికొంత తెలియజేస్తారు. ఈ లక్షమందిలో నెలకు వెయ్యి మంది తమ స్వభావాన్ని మార్చుకున్నా... కొన్నేళ్లలో నేననుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాను.