'వచ్చిన 'ఐడియా'కు ఒక రూపం ఇచ్చి లాభదాయక కంపెనీగా నిర్మించడం అనేది అంత సులభం కాదు. దారి కనిపించినట్లుగానే ఉంటుంది. గమ్యం చేరడం మాత్రం సులువు కాదు, ఎంటర్‌ప్రెన్యూర్ కలలు కనే యువతరం తమకు వచ్చిన ఐడియాకు సంబంధించి అన్ని కోణాల్లో హోంవర్క్ చేస్తే సూపర్ సక్సెస్ సాధించవచ్చని నిరూపించింది బెంగళూరుకు చెందిన 'మెటామ్యాన్' స్టార్టప్. 'మన దేశంలో పురుషులకు జువెలరీ బ్రాండ్స్‌కు సంబంధించి తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి' అనే మాట బాలీవుడ్ నటుడు సునీల్ షెట్టి నోట విన్న తరువాత అనీల్ షెట్టీ తన స్నేహితుడు హర్ష్ మస్కరతో కలిసి 'మెటా మ్యాన్' పేరుతో డిజైన్-ఓరియెంటెడ్ 'డైరెక్ట్-టు-కన్జ్యూమర్ బ్రాండ్' (డీ2సీ)కి శ్రీకారం చుట్టాడు. ప్రారంభించిన ఆరు నెలలోనే ఈ బ్రాండ్ సూపర్ డూపర్ హిట్ అయింది.'
లండన్‌కు చెందిన మార్కెట్ రిసెర్చ్ కంపెనీ 'యూరోమానిటర్ ఇంటర్నేషనల్' అంచనా ప్రకారం మెన్ జువెలరీకి సంబంధించి ఇండియా థర్డ్-లార్జెస్ట్ మార్కెట్గా ఎదగనుంది. 'మెటామ్యాన్'కు ముందు సునీల్ షెట్టితో కలిసి మాట్లాడాడు అనీల్. ఈ ఆలోచన నచ్చడంతో కంపెనీ ఫౌండింగ్ మెంటర్, ఇన్వెస్టర్గా ఉండడానికి ముందుకు వచ్చాడు సునీల్ షెట్టి. హిప్ హప్ జువెలరీ ధరించడం అనేది ఇండియాలో బలపడుతున్న ట్రెండ్ అయినప్పటికీ ఏవో కొన్ని తప్ప తగినన్నీ ఆప్షన్స్ లేవు. ఈ లోటును భర్తీ చేయడానికి 'మెటామ్యాన్'తో ముందుకు వచ్చి సక్సెస్ అయింది.
ట్రెండ్‌తో పాటు బడ్జెట్‌ను కూడా దృష్టిలో పెట్టుకొని అందుబాటు ధరల్లో బ్రాస్ లెట్స్, చైన్స్, రింగ్స్.. మొదలైన వాటిని డిజైన్ చేయించారు. సందర్భానికి తగినట్లుగా డైలీ ఆఫీస్ వియర్, క్యాజువల్ వియర్, స్పోర్ట్స్ వియర్, ట్రావెల్ వియర్.. మొదలైన వాటిని డిజైన్ చేయించారు. 'మెటామెన్' పీసెస్‌లు ఫిల్మ్ ఫేర్, లైఫెస్టైల్ ఏసియాలాంటి మ్యాగజైన్లలో కని పించడంతో వాటికి మరింత ప్రాచుర్యం వచ్చింది. ఈ కంపెనీ ఏంజెల్ ఇన్వెస్టర్ జాబితాలో సునీల్ షెట్టితో పాటు నిఖిల్ కామత్ (జెరోద), కేఎల్ రాహుల్ (ఇండియన్ క్రికెటర్), ఆశిష్ (బుక్ మై షో), ప్రశాంత్ ప్రకాష్ (యాక్సెల్ పాట్నర్స్), సుజిత్ కుమార్ (ఉడాన్), హర్షిల్ మాధుర్, శశాంక్ కుమార్ (రేజర్‌పే) చేరారు.
రాబోయే ఆరు నెలల కాలంలో రెండు వందల కొత్త ప్రాడక్ట్స్ డిజైన్ చేయడానికి రెడీ అయింది మెటామ్యాన్. 2024లో దుబాయ్, ఇండోనేషియా, సింగపూర్, ఆస్ట్రేలియాలలో తమ బ్రాండ్‌ను విస్తరించే పనిలో ఉంది. అనీల్ షెట్టికి ఫ్యాషన్ నుంచి పాలిటిక్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వరకు ఎన్నో రంగాలపై ఆసక్తి ఉంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనే కల ఉంది. తన కలను నిజం చేసుకునే దారిని వెదుక్కునే క్రమంలో అనీలకు సునీల్ షెట్టి మాటలు దారి చూపించాయి. పురుషుల యాక్సెసరీస్, జువెలరీ మార్కెట్లో గెలుపు జెండా ఎగరేసేలా చేశాయి. 'ఆసియాలోని లీడింగ్ జెన్ జెడ్ జువెలరీ బ్రాండ్‌గా ఎదగాలనేది మా లక్ష్యం అంటున్నాడు 'మెటామ్యాన్' కో-ఫౌండర్ అనీల్ శెట్టి.
యూరేక మూమెంట్..
యూరేక మూమెంట్ అనేది ఏ వ్యక్తికి అయినా ఏదో ఒక సమయంలో వస్తుంది. తల్లి నెక్లెస్‌ను మెడలో ధరించిన సునీల్ షెట్టిని చూసిన తరువాత నాకు ఐడియా వచ్చింది. మెన్ జువెలరీ అనేది మన దేశంలో వినూత్న కాన్సెప్ట్. ఐడియా కొత్తగా ఉన్నంత మాత్రాన సక్సెస్ కావాలని లేదు. 360 డిగ్రీ కోణంలో ఆలోచించి మంచి, చెడులపై ఒక అవగాహనకు వచ్చాం.. ఫ్యాషన్ జువెలరీ ధరించాలనే ఆసక్తి పురుషులకు ఉన్నప్పటికీ అట్రాక్టివ్, క్వాలిటీ డిజైన్లు వారికి కనిపించడం లేదు. ఈ లోటును పూరించేలా మా జువెలరీని డిజైన్ చేసి సక్సెస్ సాధించాం. - అనీల్ షెట్టి, మెటామ్యాన్, కో-ఫౌండర్
Comments
Please login to add a commentAdd a comment