హిట్లర్‌గారి మీసం కథ!
కథా కమామీషు
హిట్లర్ అనగానే అతని అరాచకాల కంటే ముందుగా చాలా మందికి ‘టూత్‌బ్రష్’ మీస కట్టు గుర్తుకొస్తుంది. హిట్లర్ రాజకీయ జీవితంతో సరిసమానంగా ఆయన మీస కట్టు గురించి కూడా చర్చ జరిగింది. ‘‘హిట్లర్ అనే పేరులో ఎంత గాంభీర్యం ఉందో, ఆయన మీస కట్టులో అంత కామెడీ ఉంది. నిజానికి...ఆయనకు పొడవాటి మీసాలు ఉండి ఉంటే బాగుండేది. మీసాలలో కూడా పేరు తాలూకు గాంభీర్యం ఉట్టిపడితే బాగుంటుండేది’’ అనుకునేవాళ్లు ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే, వీరప్పన్‌లాగా ఒకప్పుడు హిట్లర్‌కు కూడా పొడవాటి మీసాలు ఉండేవి. సందర్భానుసారంగా మీసాలు తిప్పుతూ మాట్లాడేవాడట.
మరి పొడుగు మీసాల హిట్లర్ పొట్టి మీస కట్టులోకి ఎందుకు షిఫ్ట్ అయ్యాడు? ‘‘ఆయన పొట్టివాడు కాబట్టి’’ అని నవ్వులాట సమాధానం అయితే చెప్పుకోవచ్చుగానీ అది మాత్రమే అసలు సమాధానం కాదు కదా!
విషయం ఏమంటే, హిస్టరీ ఛానల్ తన మూడు భాగాల మినీ సిరిస్‌లో భాగంగా హిట్లర్ మీసంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. చరిత్రకారులు, రాజకీయనాయకులు, రాజకీయ విశ్లేషకులతో ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఆరు గంటల ఈ చర్చలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. హిట్లర్ పొట్టి మీస కట్టుపై రెండు వాదనలు వినిపించాయి.
ఒకటి: సైనికుడిగా పని చేస్తున్న సమయంలో హిట్లర్ తన మీసకట్టును మార్చుకున్నాడు. దీనికి కారణం...గ్యాస్ మాస్క్ బిగించుకునే సమయంలో పొడుగు మీసాలు ఇబ్బంది పెడుతుండడం. దీంతో తన మీసకట్టును అందరిలో ప్రత్యేకంగా కనిపించేలా చతురస్రాకారంలో కట్ చేసుకొని దాన్నే జీవితాంతం కొనసాగించాడు.
రెండోది: మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పొట్టి మీస కట్టు అనేది ప్రసిద్ధి చెందిన మీస కట్టు. అందులో భాగంగానే హిట్లర్ దీన్ని ఎంచుకున్నాడు తప్ప ప్రత్యేక కారణం ఏదీ లేదు.