కన్నీటి సముద్రంలో మునిగిపోతే...
కష్టాలు మాత్రమే కనిపిస్తాయి.
పనే దైవం అనుకుంటే...
ఆ దైవమే దారి చూపుతుంది. ఇది ఇంద్రావతి నిజజీవిత కథ...
ఇంద్రావతికి బైక్‌లు అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నయ్య మనోజ్ తనకు బైక్‌రైడింగ్ నేర్పించాడు. ఇంద్రావతి బైక్‌పై రాజసంగా వెళుతుంటే చూసి మురిసిపోయేవాడు. అలాంటి అన్నయ్య ఒక దురదృష్టకరమైన రోజు యాక్సిడెంట్‌లో చనిపోయాడు.
అంతే...ఆ కుటుంబంపై పిడుగు పడింది.
మధ్యప్రదేశ్‌లోని మండ్ల జిల్లాకు చెందిన ఇంద్రావతి తల్లిదండ్రులు చిన్నాచితక పనులు చేస్తారు. మనోజ్ చేసే ఉద్యోగం ద్వారా వచ్చే జీతమే వారికి ప్రధాన ఆధారం. ఇంటికి నిట్టాడిలాంటి కొడుకు చనిపోవడంతో ఇంద్రావతి భవిష్యత్ గురించి ఆలోచిస్తూ కుమిలేపోయేవారు తల్లిదండ్రులు. అయితే ఇంద్రావతి ప్రస్తుతం వారికి భవిష్యత్‌గా మారింది.
అన్నయ్య జ్ఞాపకాలు అనంతమైన దుఃఖాన్ని మోసుకొస్తూ తనను అల్లకల్లోలం చేస్తున్న సమయంలో...ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది ఇంద్రావతి.
ఆ సమయంలో తల్లిదండ్రులు గుర్తుకు వచ్చి ఆ ఆలోచన మానుకుంది.
‘ఏడుస్తూ కూర్చుంటే దుఃఖం మరింత ఎక్కువ అవుతుంది. ఏదైనా పనిలో పడితే మంచిది’ అని పెద్దలు సలహా ఇచ్చారు.
‘ఏంచేయాలి? అని ఆలోచిస్తున్న సమయంలో ఒక స్వచ్ఛంద సంస్థ గురించి విన్నది. ప్రొఫెషనల్ అసిస్టెన్స్ ఫర్ డెవలప్‌మెంట్ యాక్షన్ (ప్రధాన్) సంస్థ సహాయంతో బైక్ రిపేరింగ్ నేర్చుకుంది. ఆతరువాత...మెకానిక్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. జబల్‌పూర్‌లోని టూ–వీలర్ సర్వీస్ సెంటర్‌లో ఇంద్రావతికి ఉద్యోగం వచ్చింది.
ఒకవైపు బైక్‌లు రిపేర్ చేస్తూనే, మరోవైపు చదువు కొనసాగించింది.
‘ఆడపిల్లలకు బైక్ రిపేర్ చేయడం ఏం వస్తుంది!’ అంటూ మొదట్లో ఆమె దగ్గరికి రావడానికి సంశయించేవారు. అయితే రోజులు గడిచేకొద్దీ∙ఇంద్రావతి ప్రతిభ గురించి అందరికీ తెలిసిపోయింది. ఆలస్యం చేయకుండా, బైక్‌లను వేగంగా రిపేర్ చేయడంలో మరింత ప్రావీణ్యం సంపాదించింది.
సైన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన ఇంద్రావతి నారాయణ్‌గంజ్‌లో ఒక వర్క్‌షాప్ మొదలు పెట్టి, పేదింటి అమ్మాయిలకు బైక్ రిపేరింగ్ నేర్పించి వారికి ఉపాధి మార్గాలు చూపించాలనుకుంటుంది.
‘బైక్ రిపేరింగ్ అనేది నాకు ఆత్మసై్థర్యాన్ని ఇవ్వడమే కాదు, కుటుంబానికి ఆదాయాన్నీ ఇచ్చింది. ఏ దారిలో వెళ్లాలో తెలియక ఒకప్పుడు నేను అయోమయానికి గురయ్యాను. నాలాంటి వారు ఎంతోమంది ఉండొచ్చు. వారికి ధైర్యం చెప్పి, పని నేర్పితే సొంతకాళ్ల మీద నిలబడతారు’ అంటుంది ఇంద్రావతి.
‘నెల నెలా ఠంచనుగా వచ్చే జీతాన్ని వదులుకొని రిస్క్ తీసుకోవడం ఎందుకు?’ అంటున్న వాళ్లు చాలామందే ఉన్నారు. అయితే ఇంద్రావతికి వారి మాటలు వినిపించడం లేదు. లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది!
Comments
Please login to add a commentAdd a comment