సాక్షి, కామారెడ్డి: వాళ్లిద్దరు అక్కా చెల్లెళ్లు. రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నరు. సొంత ఇళ్లు లేదు. సొంతంగా పంట భూమి కూడా లేదు. కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అందరిలా కాకుండా పద్దతిగా పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. మగవారికి ధీటుగా మంచి పంటలు పండిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామానికి చెందిన అక్కా చెల్లెళ్లు పెద్ద మల్లవ్వ, చిన్న మల్లవ్వలు చేస్తున్న పంటల సాగు నలుగురికి మెచ్చేలా, నచ్చేలా ఉంటోంది.
పొద్దున నిద్రలేచి ఇద్దరూ కలిసి వంట పని చేసుకుని సద్దిమూటతో కాలినడకన పొలం బాటపడతారు. సాయంత్రానికి గానీ ఇంటికి రారు. మగవారికి ధీటుగా పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. పెద్ద మల్లవ్వకు కూతురు జమున ఏడాదిన్నర వయసులో ఉన్నపుడు భర్త గంగారెడ్డి చనిపోయాడు. దీంతో తల్లిగారి ఊరయిన కుప్రియాల్‌కు వచ్చి ఉంటోంది. కూలీనాలీ చేసి బిడ్డను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించింది. చిన్న మల్లవ్వ భర్తకు దూరమై అక్కతో కలిసి ఉంటోంది. పదేళ్లుగా అక్కా చెల్లెల్లిద్దరూ అద్దె ఇళ్లు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. 44వ నంబరు జాతీయ రహదారిని ఆనుకుని అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో వెంకటరెడ్డికిక చెందిన నాలుగెకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. భూమి యజమాని సహకారంతో ఈ ఇద్దరు అక్కా చెల్లెల్లు ఆధునిక పద్దతుల్లో పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. రెండెకరాల్లో చెరకు పంట, ఎకరంనర భూమిలో వరి సాగు చేస్తున్నారు. మిగతా స్థలంలో కూరగాయలు పండిస్తున్నారు.
చెరకు సాగులో అధిక దిగుబడులు....
ఈ అక్కాచెల్లెల్లు సాగు చేస్తున్న చెరకు పంట అధిక దిగుబడులు వస్తోంది. నాటడం నుంచి అన్ని పనులూ వీళ్లిద్దరే చేసుకుంటారు. చెరకు నరకడానికి మాత్రమే కూలీలు వస్తారు. మిగతావన్నీ వాళ్లే చూసుకుంటారు. చెరకు నాటడం, కలుపు తీయడం నుంచి ప్రతీ పని వాళ్లే చేసుకుంటారు. డ్రిప్ ద్వారా నీటిని అందిస్తారు. గత ఏడాది ఎకరాకు 55 టన్నుల దిగుబడి సాధించారు. ప్రతీ సంవత్సరం చెరకు సాగులో మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఈ సారి కూడా అదే స్థాయిలో దిగుబడి వస్తుందని చెబుతున్నారు. పంటకు కోడి ఎరువు, పశువుల పేడ వాడుతారు. చాలా మంది వీళ్ల సాగు విధానాన్ని చూసి వెళుతుంటారు. గాయత్రీ షుగర్స్ అధికారులు కూడా మల్లవ్వలు సాగు చేస్తున్న పంటను చూడమని ఇతర గ్రామాల రైతులకు చెబుతుంటారు.
కూలీకి వెళ్లరు..కూలీలను పిలవరు...
ఇద్దరు అక్కా చెల్లెళ్లు తాము సాగు చేస్తున్న పంట చేనుదగ్గరకు ప్రతీ రోజూ వెళ్లి పనులు చూసుకుంటారు. గ్రామం నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరాన ఉన్న పొలం దగ్గరికి కాలినడకన వస్తారు. సాయంత్రం తిరిగి కలిసి వెళతారు. ఏ ఒక్కనాడూ కూలీ పనులకు వెళ్లరు. తమ పొలానికి కూలీలను పిలవరు. పంటకు రసాయన ఎరువులను కూడా వీళ్లే పిచికారీ చేస్తారు. భుజానికి స్ప్రే పంప్ తగిలించుకుని దర్జాగా పొలంలో తిరుగుతూ పంటకు పిచికారీ చేస్తారు. ప్రతీ పనిని తామే చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాగే కూరగాయల సాగు ద్వారా చేతి ఖర్చులన్నీ వెల్లదీసుకుంటారు.
కష్టానికి తగిన ఫలితం ఉంది....
మాకు సొంత భూమి లేకున్నా వెంకటరెడ్డి సారు భూమిని సాగు చేసుకుని బతుకుతున్నం. మాకు సారు అన్ని విధాల సహకారం అందిస్తారు. పొలం పని మీద దృష్టి పెడితే మంచి ఫలితాలే వస్తాయి. ఎప్పుడో ఒక సారి నష్టం రావచ్చు. రెక్కల కష్టం నమ్ముకుని బతుకుతున్న మాకైతే మంచిగనే ఉన్నది. ఎవల మీద ఆధారపడకుండా మా పని మేము చేసుకుని బతుకుతున్నం. మాకు సొంత ఇళ్లు లేదు. జాగ లేదు. అదొక్కటే బాధ ఉంది. వంగి కష్టం చేస్తే మంచి పంటలు తీయవచ్చు.
–పెద్ద మల్లవ్వ, చిన్న మల్లవ్వ
Comments
Please login to add a commentAdd a comment