ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ సహకార సంఘం
సాక్షి, మోర్తాడ్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో కొత్తగా చేరిన సభ్యులకు పంట రుణాలు అందడం లేదు. నిధులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు నిధులు కేటాయించాల్సి ఉంది. తెప్కాబ్ తక్కువ మొత్తంలోనే ఎన్‌డీసీసీబీకి నిధులు కేటాయించింది. ఫలితంగా సభ్యుల సంఖ్యకు అనుగుణంగా నిధులు లేక కొంత మందికే పంట రుణాలు దక్కుతున్నాయి. దీంతో మిగిలినవారు పెదవి విరుస్తున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో కలిపి 142 సహకార సంఘాలు ఉన్నాయి. 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు తెప్కాబ్ ద్వారా రూ. 28 కోట్ల నిధులు విడుదల అయ్యాయి.
ఈ నిధుల నుంచి సహకార సంఘాల సభ్యుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని రూ.15 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు పంట రుణాల కోసం కేటాయించారు. కానీ కొన్ని సహకార సంఘలకు పంట రుణాల కోసం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు నిధులు అవసరం ఉన్నాయి. నిధుల కేటాయింపు పరిమితంగానే ఉండడంతో కొంత మంది సభ్యులకు మాత్రమే పంట రుణాలను అందించారు. వాణిజ్య బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటే రెన్యువల్ సమయంలో ఇబ్బంది తలెత్తుతుందని సహకార సంఘాల్లోనైతే ఎలాంటి సమస్య ఉండదని సభ్యులు భావిస్తున్నారు. దీంతో సహకార సంఘాల్లో రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.
కొన్నింటిలో మిగులు, మరికొన్నింటిలో కొరత...
సహకార సంఘాలకు పంట రుణాల కోసం కేటాయించిన నిధులకు సంబంధించి విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కొన్ని సహకార సంఘాల్లో పంట రుణాలు తీసుకునే వారు లేకపోవడంతో నిధులు మిగిలిపోయాయి. సకాలంలో పంట రుణాల ఫైలింగ్ చేయకపోవడంతో ఆ నిధులు తెప్కాబ్‌కు వెనక్కి వెళ్లిపోయాయి. మరికొన్ని సహకార సంఘాలకు కేటాయించిన నిధులు సరిపోక పోవడంతో నిధుల కొరత ఏర్పడింది. కొన్ని సంఘాల నుంచి వెనక్కి వెళ్లిపోయిన నిధులను అవసరం ఉన్న సహకార సంఘాలకు కేటాయించాలని పలువురు చైర్మన్‌లు కోరుతున్నారు. కానీ అంతా ఆన్‌లైన్ విధానం అమలు కావడంతో నిధుల కేటాయింపు విషయంలో తాము ఏమీ చేయలేమని బ్యాంకు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. సహకార బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి పంట రుణాలకు డిమాండ్ ఉన్న సంఘాలకు నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
రూ.25లక్షలు అవసరం...
తాళ్లరాంపూర్ సహకార సంఘం పరిధిలో కొత్త సభ్యులు ఎంతో మంది పంట రుణం కావాలని అడుగుతున్నారు. ఇప్పటి వరకు రూ. 25 లక్షల రుణాలిచ్చాం. మరో రూ.25 లక్షలు అవసరం. వంద శాతం రుణ వసూళ్లు ఉన్న సంఘాలకు ఎక్కువ నిధులు కేటాయించాలి. – పెద్దకాపు శ్రీనివాస్‌రెడ్డి, చైర్మన్, పీఏసీఎస్ తాళ్లరాంపూర్
దరఖాస్తులు వస్తున్నాయి..
కొత్తగా సహకార సంఘాల్లో పంట రుణం తీసుకోవడానికి సభ్యులు దరఖాస్తులు అందిస్తున్నారు. సహకార సంఘాలకు డిమాండ్‌ను బట్టి పంట రుణాల కోసం నిధులు కేటాయించాలి. కొన్ని సంఘాల్లో మిగిలిపోయిన నిధులను అవసరం ఉన్న సంఘాలకు మళ్లించాలి. – బర్మ చిన్న నర్సయ్య, చైర్మన్, పీఏసీఎస్ ఏర్గట్ల
Comments
Please login to add a commentAdd a comment