ఉద్యమస్ఫూర్తికి ఏదీ గౌరవం? | Does any respect for the Inspiration of the movement? | Sakshi
Sakshi News home page

ఉద్యమస్ఫూర్తికి ఏదీ గౌరవం?

Published Sat, Jun 17 2017 12:47 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

ఉద్యమస్ఫూర్తికి ఏదీ గౌరవం?

ఉద్యమస్ఫూర్తికి ఏదీ గౌరవం?

అధికారంలోనున్న నాయకులకు తమ ప్రయోజనాలే కానీ మన అవసరాలు కనిపించడం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో పాలన పాతకాలపు జాగీర్దార్ల పాలనను తలపిస్తున్నది. మనం కోరుకున్న ప్రజాస్వామిక పాలన కాదిది. ప్రజలకు నిర్ణయాధికారం లేదు. జాగీర్దార్లు అధికారాన్ని తమ ఇష్టానుసారం చెలాయించేవారు. ఇప్పటి పాలకులు కూడా అదే పద్ధతిలో సాగుతున్నారు. ప్రభుత్వానికి కనీసం తమ గోడు చెప్పుకోవడానికి కూడా ప్రజలకు మార్గమే లేదు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఏ పని చెప్పినా కాదు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, తరువాత రాష్ట్ర ఏర్పాటు చరిత్రాత్మక ఘట నలు. సకల జనులు కలసి, సబ్బండ వర్గాలు ఏకమై సుదీర్ఘ కాలం పోరాడారు. ఉద్యమాల ఫలితంగా, త్యాగాల కారణంగా ఆవిర్భవించిన తెలంగాణలో ఇప్పుడు ప్రజల ఆకాంక్షలకు గౌరవం లేకుండా పోవడమే పెద్ద విషాదం. ఈ అంశాన్ని వెల్లడించమే అమరవీరుల స్ఫూర్తి యాత్ర ఉద్దేశం. గోచికట్టి గొంగడేసుకుని పాట పాడి, వంటా వార్పూ చేసి, రాస్తారోకోలలో పాల్గొని, రైలు పట్టాల మీద బైఠాయించి, బంద్‌లు పాటించి, సమ్మెలు చేసి, సత్యాగ్రహాలు నిర్వహించి తెలంగాణ ప్రజలు తమ ప్రత్యేక రాష్ట్ర కలను నిజం చేసుకున్నారు. ఆంధ్ర పాలకులతో తెగించి కొట్లాడినారు. ఉద్యమానికి ఊతమిచ్చి తిరిగిరాని లోకాలకు తరలిపోయిన వారు ఎందరో.

తరువాత ఎన్నికలలో తెలంగాణవాదుల గెలుపుకోసం రకరకాల మార్గాలలో ప్రచారాలు చేసి, నేను సైతం అన్న తీరులో ప్రతి వ్యక్తి సమరశీలతతో కదం తొక్కారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సంకుచితమైనది కాదు. ఆంధ్రా పాలకులను వ్యక్తిగతంగా వ్యతిరేకించడానికి ఇది సాగలేదు. అసలు ఆంధ్రపాలకులను ద్వేషించడమే దాని ధ్యేయం కాదు. తెలంగాణ అభివృద్ధికి ఆటంకంగా నిలిచిన ఆంధ్ర పాలకుల పెత్తనాన్ని మాత్రమే ఉద్యమం ఎదిరించింది. ‘సచి వాలయంలో కూర్చుని చక్రం తిప్పడం కుదరదు’ అని రాష్ట్ర సాధనోద్యమం తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా భారత స్వాతంత్య్రోద్యమం గురించి కాళోజీ నారాయణరావు చేసిన వ్యాఖలను గుర్తు చేసుకోవాలి. ‘మాకొద్దీ తెల్లదొరతనము...’ అన్న గరిమెళ్ల వారి గేయంలోని మాటలను ఉటంకిస్తూ కాళోజీ, ‘స్వాతంత్య్రోద్యమం తెల్లవారిని వెళ్లగొట్టడం కోసమే కాదు, దొరతనాన్ని కూడా అంతం చేయడానికి సాగింది’అని పేర్కొనేవారు. సామాజిక, ఆర్థిక రంగాల మీద గుప్పెడు మంది పెత్తనాన్ని కూలదోయాలని తెలంగాణ ఉద్యమం అనుకున్నది.

ఉద్యమ ఆకాంక్షలు
సమష్టి అధికారాన్ని సమష్టి ప్రయోజనాలకు ఉపయోగించడానికి బదులుగా సీమాంధ్ర పాలకులు కార్పొరేట్‌ శక్తులకూ, కాంట్రాక్టర్లకూ, రియల్‌ ఎస్టేట్‌ డీలర్లకూ మేలు కలిగించే రీతిలో వ్యవహరించారు. అందువల్లనే ప్రజలు, ప్రధానంగా రైతులు, కార్మికులు, కుటీర పరిశ్రమలకు చెందినవారు, చిరువ్యాపారులు బాగా నష్టపోయారు. ఇజ్జత్‌తో బతకగలమన్న విశ్వాసం అడుగంటి పోవడంతో 1990 దశకం నుంచి రైతులు, చేతివృత్తుల వారు అనేక మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే వనరులలో వాటా, అ«ధికారంలో భాగం దక్కుతుందని తెలంగాణ ప్రజానీకం ఆశించింది. అభివృద్ధి నమూనా మారిపోయి బతుకు తెరువు అవకాశాలు పెరుతాయని, అందివస్తాయని భావించింది. ఉద్యోగాలు దొరుకుతాయని యువతీయువకులు బలంగా విశ్వసించారు. అసలు సమష్టి జీవితాన్ని ప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహించుకోవాలన్న ఆశయంతోనే ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు.

కానీ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడం లేదు. ఆంధ్ర పాలకుల వలెనే ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రజలనూ, వారి ఆకాంక్షలనూ పక్కన పెట్టింది. ఆంధ్ర కాంట్రాక్టర్లకు, కార్పొరేట్‌ శక్తులకు పట్టం కట్టింది. చిల్లరపైసలు ఇక్కడి ప్రజల ముఖాన కొట్టి గొప్ప ఘనకార్యమేదో చేసినట్టు పేజీలకు పేజీలు పత్రికలలో ప్రకటనలు ఇస్తున్నారు. ప్రజా ప్రయోజన పథకాల మీద వెచ్చించిన దానికంటే, ఆ ప్రకటనలకే ఎక్కువ ఖర్చయిందేమో కూడా! మిషన్‌ భగీరథ పేరుతో, ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు ఆంధ్ర పాలకుల జేబులలోనికే వెళ్లాయి.

ఉద్యోగాల ఊసే లేదు
నీళ్లు, నిధులు, నియామకాలు... ఈ నినాదాలే తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్‌లైన్‌. ఇందులో నియామకాల నినాదానికి ఆకర్షితులు కావడం వల్లనే యువతీ యువకులు ఉద్యమంలో విస్తృతంగా పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడితే తమ వారికి ఉద్యోగాలు దొరుకుతాయని ఉద్యమం కోసం ఆత్మార్పణం చేసుకున్నవారు రాసిపెట్టిన నోట్‌లలో పేర్కొన్నారు కూడా. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగింది వేరు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో సుమారు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ ఇప్పటికి 20,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు. ఉద్యోగ భర్తీ ప్రకటనలు వెలువడతాయన్న ఆశతో అభ్యర్థులు వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ కోచింగ్‌ క్లాసులకు హాజరవుతున్నారు. కానీ పోస్టులు మాత్రం అందని ద్రాక్షలుగానే మిగిలిపోతున్నాయి.

జరిగిన పరీక్షలైనా అస్తవ్యస్తంగా జరిగాయి. పోటీ పరీక్షలను సక్రమంగా నిర్వహించడానికీ, ఉపాధి అవకాశాలు పెంచడానికీ ఇచ్చిన అన్ని సూచనలను కూడా ప్రభుత్వం బేఖాతరు చేసింది. ఉద్యోగాల భర్తీకి క్యాలండర్‌ను ప్రకటించాలని, ప్రైవేట్‌ సంస్థలలో భూమిపుత్రులకు రిజర్వేషన్‌లు పాటించాలని చేసిన కీలక విజ్ఞాపనలు ప్రభుత్వం చెవికెక్కలేదు. ఉపాధి అవకాశాల కల్పనకు ప్రణాళికలు తయారు చేయాలన్న సూచనలను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. సమాన పనికి సమాన వేతనం అన్న సూత్రం ప్రకారం కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలను పెంచే విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వంలో కదలిక లేదు.

సంక్షోభంలో వ్యవసాయం
ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కూడా రైతుల బలవన్మరణాలు ఆగలేదు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 2,900 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ మూడేళ్లలో పంటల ధరలు పడిపోవడంతో పెట్టిన పెట్టుబడులు రాక సుమారు రూ. 500 కోట్లు తాము నష్టపోవడం జరిగిందని రైతు సంఘాలు చెబుతున్నాయి. కరువు నష్టానికి పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ రైతులకు ముట్టలేదు. కనీసం కేంద్రం ఇచ్చిన రూ. 800 కోట్ల పరిహారం కూడా చేరలేదు. రైతులు ఏం పంట వేసుకోవాలో చెప్పలేని దౌర్భాగ్యస్థితిలో ప్రభుత్వం ఉంది.

ఈ సమస్యలకు పరిష్కారాలు ప్రభుత్వానికి తోచక పోవచ్చునని రైతు సంఘాలన్నీ కలసి వ్యవసాయ శాఖ కార్యదర్శికి వివరమైన, విలువైన సూచనలు ఇచ్చాయి. రైతు ఆదాయాన్ని పెంచటానికి సమగ్ర వ్యవసాయ విధానం రావాలన్నారు. రైతులను ఆదుకోవటానికి వ్యవసాయ కమిషన్‌ వేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు సాయం చేయాలన్నారు. బ్యాంకుల నుంచి రైతులకు కావలసిన అప్పులు ఇప్పించాలని, నకిలీ విత్తనాలు సరఫరా చేసే వ్యాపారులను కఠినంగా శిక్షించాలని, పంటల ధరలు పడిపోయినప్పుడు మద్దతు ధర చెల్లించి ఆదుకోవటానికి నిధిని ఏర్పాటు చేయాలని, చిన్న రైతులకు కావలసిన వ్యవసాయ పరికరాలను సబ్సిడీకి ఇవ్వాలని కోరినా ఉలుకూ పలుకూ లేదు.

సంక్షేమ పథకాల అమలు–తీరుతెన్నులు
ప్రజలకు అవసరమయ్యే ఏ పథకం కూడా అమలు కావడం లేదు. ఫీజు రీయింబర్సుమెంటు బకాయిలు చెల్లించక పోయేసరికి చాలామంది పిల్లలు చదువుకు దూరమయ్యారు. ఉద్యోగాలకు అర్హత కోల్పోయారు. సింగరేణిలో ఓపెన్‌ కాస్టు గనులను ఆపే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రుల పునరుద్ధరణ జరగనే లేదు. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా పోతున్నది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారిమళ్లుతున్నాయి. చిన్న, సూక్ష్మ పరిశ్రమల పునరుద్ధరణకు ప్రయత్నమే లేదు. నిజాం షుగర్స్‌ను తెరిచి, నడిపిస్తామన్న హామీని మరిచి ఇవాళ పూర్తిగా మూసేశారు. నిర్వాసితుల కోసం 2013 భూసేకరణ చట్టం కల్పించిన మానవీయ పద్ధతులు రద్దయిపోయాయి. దాదాపు 3 లక్షల ఎకరాల భూమిని బలవంతంగా గుంజుకోవడానికి, నిర్వాసితుల హక్కుల రద్దు కోసం కొత్త చట్టాలను తీసుకొచ్చారు.

ఇప్పటికే చాలా గ్రామాల్లో మంచినీటి నల్లాలు ఉన్నాయి. కానీ వాటిని తవ్వి మళ్లీ కొత్త పైపులు పరుస్తున్నారు. అదికూడా కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే. అందుకైన వేల కోట్ల నిధుల దుర్వినియోగాన్ని ఆపగలిగితే డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకానికి కావలసినన్ని నిధులుండేవి. ఇప్పటివలెనే అమలైతే మూడెకరాల పథకం కింద భూమిలేని దళితులందరికీ భూమి పంచడానికి 230 సంవత్సరాలు పడుతుంది. సాగునీటి పథకాల ఖర్చు తగ్గించే లక్ష్యంతో డిజైన్‌ చేస్తే సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరతే ఉండదు. అది అట్లుండగా వార్తలకెక్కిన భూ కుంభకోణాలు అధికార దుర్వినియోగాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ నాయకులు, అధికారులు, రియల్‌ ఎస్టేట్‌ డీలర్లతో కుమ్మక్కై వేల ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు.

అప్రజాస్వామిక వైఖరి
అధికారంలోనున్న నాయకులకు తమ ప్రయోజనాలే కానీ మన అవసరాలు కనిపించడం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో పాలన పాతకాలపు జాగీర్దార్ల పాలనను తలపిస్తున్నది. మనం కోరుకున్న ప్రజాస్వామిక పాలన కాదిది. ప్రజలకు నిర్ణయాధికారం లేదు. జాగీర్దార్లు అధికారాన్ని తమ ఇష్టానుసారం చెలాయించేవారు. ఇప్పటి పాలకులు కూడా అదే పద్ధతిలో సాగుతున్నారు. ప్రభుత్వానికి కనీసం తమ గోడు చెప్పుకోవడానికి కూడా ప్రజలకు మార్గమే లేదు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఏ పని చెప్పినా కాదు. ముఖ్యమంత్రి ఎవ్వరినీ కలువరు. గజేంద్రుడు వేడుకుంటే వైకుంఠపురిలోని విష్ణుమూర్తి దిగొచ్చాడు. కానీ ఎన్ని మొక్కినా మన ముఖ్యమంత్రి బయటకు రాడు. ప్రజలను కలువడు. తమ సమస్యలు నలుగురికీ వినిపించడానికి ఉన్న ఒక్క వేదిక ఇందిరా పార్కు వద్దనున్న ధర్ణాచౌకును కూడా మూసివేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ వార్త కూడా రాయవద్దని మీడియాపై జులుం చెలాయిస్తున్నారు.

రాష్ట్రాన్ని తేవడానికి ప్రజలు చేసిన త్యాగాలకు, బలిదానాలకు ఇవాళ గుర్తింపు లేదు. విలాసాలు, హైదరాబాద్‌ చుట్టుప్రక్కల ఆస్తులు, కాంట్రాక్టుల పంపకాలు, ప్రచారాలు ఇదీ పాలకుల వ్యవహారం. దీన్ని ప్రజలకు తెలియజెప్పడానికే అమరవీరుల స్ఫూర్తి యాత్ర నిర్వహిస్తున్నాం. తెలంగాణ ఆకాంక్షలను పరిరక్షించడానికే మొదలుపెట్టినాం. ప్రజలు నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఎంతోమంది నియంతల పాలనను అంతం చేసిన మనకు ప్రజాస్వామిక తెలంగాణను నిర్మించుకోవడం పెద్ద పని కాదు.
   

     - వ్యాసకర్త టీజేఏసీ ఛైర్మన్‌

     యం. కోదండ రామ్‌
     మొబైల్‌ : 98483 87001


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement