సౌమిత బసు.. వీల్‌చైర్‌ నుంచి సీఈవో వరకు | Soumita Basu Inspirational Story Who Became CEO For Jainika Brands | Sakshi
Sakshi News home page

Soumita Basu: సౌమిత బసు.. వీల్‌చైర్‌ నుంచి సీఈవో వరకు

Published Sat, Aug 13 2022 4:46 PM | Last Updated on Sat, Aug 13 2022 4:47 PM

Soumita Basu Inspirational Story Who Became CEO For Jainika Brands - Sakshi

జీవితమంటేనే కష్టసుఖాల కలయిక. సాఫీగా ఆనందంగా సాగిపోతున్న ప్రయాణంలో కొన్నిసార్లు తగిలే దెబ్బలు మనిషిని పాతాళంలోకి నెట్టేస్తాయి. నాట్యమయూరిలా నాట్యం చేస్తోన్న సౌమిత బసుని కూడా అనుకోని ఉపద్రవం అథఃపాతాళంలోకి తోసేసింది. అయినా ఆమె ఏమాత్రం అధైర్యపడలేదు. తనకెదురైన చేదు అనుభవాలకు ఏమాత్రం కృంగిపోకుండా, వాటిని ప్రేరణగా తీసుకుని ఏకంగా ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. 

కోల్‌కతాకు చెందిన చెందిన సౌమిత బసు చిన్నప్పటి నుంచి ఎంతో చురుకుగా ఉండేది. భరతనాట్యం నేర్చుకుని అనేక స్టేజి ప్రదర్శనలతోపాటు, మంచి క్రియేటివ్‌ రైటర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఎంతో ఆనందంగా సాగిపోతున్న 32 ఏళ్ల సౌమితను 2014లో సోరియాటిక్‌ ఆర్థరైటిస్‌ కబళించేసింది. దీంతో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. క్రమంగా ఆరోగ్యం క్షీణించి ఎనభై శాతం కదల్లేని స్థితిలో మంచానికే  పరిమితమైంది. రెండేళ్లపాటు అన్నింటికి దూరంగా అలా పడుకుని ఉండాల్సి వచ్చింది.

బట్టలు వేసుకోవాలన్న మరొకరి సాయం తీసుకోవాలి. ఏ పనీ సొంతంగా చేసుకోలే ని పరిస్థితిలో.. అప్పటివరకు తనలో ఉన్న ఆత్మవిశ్వాసం కూడా కోల్పోసాగింది. ఒకరోజు అనుకోకుండా ‘‘నాకు ఈ ఆర్థరైటిస్‌ వచ్చిన దగ్గర నుంచి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. కానీ పుట్టుకతోనో, ప్రమాదాల వల్లనో అవయవాలు కోల్పోయినవారు సైతం ఇటువంటి ఇబ్బందులే పడుతున్నారు. అలాంటి వారు ఎలా బట్టలు వేసుకుంటున్నారా..’’ అనిపించింది సౌమితకు. అప్పటినుంచి ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపాలని ఆలోచించసాగింది.

వీల్‌చైర్‌ నుంచి సీఈవోగా..
ఒకపక్క తన బట్టలు తను వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, మరొకరి సాయం తీసుకోకుండా వేసుకునేలా బట్టలు ఉండాలి. తనలాంటి వాళ్లు సులభంగా వేసుకునే బట్టలు మార్కెట్లో ఏమేం ఉన్నాయా అని వెతకడం ప్రారంభించింది. ఈ వెతుకులాటలో ప్రత్యేక అవసరాలు కలిగిన వాళ్లకు బట్టలు అందించే బ్రాండ్లు కొన్ని మాత్రమే ఉన్నాయి. అవికూడా అంత సౌకర్యంగా లేవు అని గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో వికలాంగుల జనాభా శాతం అంత తక్కువేమి కాదు. వీరికి నప్పే బట్టలను డిజైన్‌ చేయగలిగితే ..వారికి సాయం చేయడంతోపాటు ఆదాయం వస్తుందని గ్రహించి తనకు తెలిసిన వారి దగ్గర కొంత డబ్బుని అప్పుగా తీసుకుని 2020 జనవరిలో తల్లితో కలిసి ‘జైనిక’ బ్రాండ్‌ను ప్రారంభించి స్టార్టప్‌కు సీఈవో అయ్యింది.

తన కోసం చేసుకున్నవి..
ప్రారంభంలో సౌమిత తను వేసుకోవడానికి వీలుగా ఉండే వస్త్రాన్ని ఎంపికచేసి, దానితో డ్రెస్‌లు డిజైన్‌ చేసుకుంది. ఆ డిజైన్లు కస్టమర్లకు నచ్చి తమకూ కావాలని అడగడంతో..వారి కోరిక మేరకు డ్రెస్‌లు రూపొందించి విక్రయించేది. తరువాత ‘‘పూర్తిగా ఒకరిమీద ఆధారపడడం, కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఎవరి సాయం తీసుకోని వారు, పాక్షికంగా ఇతరుల మీద ఆధారపడే వారు’’ ఇలా కస్టమర్లను మూడు కేటగిరీలుగా  తీసుకుని వారి అవసరాలకు తగ్గట్టుగా దుస్తులను డిజైన్‌ చేస్తోంది. వృద్ధులు, ఆర్థరైటిస్, పార్కిన్‌సన్స్, ఫైబ్రోమైలాగి, దీర్ఘకాలిక వ్యాధులు, ఆటిజం, మస్తిష్క పక్షవాతం, క్యాన్సర్, ఫ్రోజెన్‌ షోల్డర్స్‌ వంటి అనేకరకాల సమస్యలతో బాధపడుతోన్న వారికి జైనిక డ్రెస్‌లను అందిస్తోంది.

పిల్లల నుంచి పెద్దవాళ్లదాక..
ప్రత్యేక అవసరాలు కలిగిన స్త్రీ పురుషులకేగాక, పిల్లలకు కూడా జైనిక డ్రెస్‌లను రూపొందిస్తోంది. క్యాజువల్సే కాకుండా, వృత్తిపరమైన డ్రెస్‌లు, కొంచెం కూడా వంగకుండా వేసుకోగల ట్రౌజర్లు, డ్రెస్‌లా కట్టుకునే చీరలు, టాప్‌లు, స్త్రీలు, పురుషులు ధరించే లోదుస్తులు కూడా అందిస్తోంది. జైనిక డ్రెస్‌లు వాడుతోన్న ఎంతోమంది వికలాంగులు ఎంతో సౌకర్యంగా ఉన్నాయని చెబుతుండడం విశేషం. బహిరంగ ప్రదేశాల్లో వికలాంగులు సైతం టాయిలెట్స్‌ వాడుకునే విధంగా డ్రెస్‌లు ఇక్కడ లభ్యమవుతున్నాయి. కేవలం ఇరవై ఒక్కవేల పెట్టుబడితో ప్రారంభించిన జైనిక నేడు లక్షల టర్నోవర్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం నలభై ఏళ్ల వయసులో వీల్‌ చెయిర్లో తిరుగుతూ సౌమిత .. కోల్‌కతాలో ఉన్న తయారీ యూనిట్‌ను మిగతా ప్రాంతాలకు విస్తరించి మహిళలు, వికలాంగులకు ఉపాధి కల్పిచడం, నాణ్యతతోపాటు, పర్యావరణ హితంగా ఉండే డ్రెస్‌లు రూపొందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది.
 
సెకన్లలో ధరించవచ్చు
ప్రత్యేక అవసరాలు కలిగిన వారు ఒక షర్ట్‌ వేసుకోవాలంటే ఇరవై నిమిషాలు పడుతుంది. ఇది నా స్వానుభవమేగాక నాలాంటి వారు ఎంతోమంది ఇలానే ఇబ్బంది పడుతున్నారు. నేను డిజైన్‌ చేసిన షర్ట్‌ కేవలం తొంబైసెకన్లలో వేసుకోవచ్చు. చీర అయితే ముఫ్పై సెకన్లలోనే కట్టుకోవచ్చు. ఇప్పటి ఫ్యాషన్‌కు తగ్గట్టుగా శరీర తత్వాన్ని బట్టి సౌకర్యవంతంగా... ఫ్యాషన్‌బుల్‌గా ఉండే డిౖజñ న్లను అందుబాటు ధరల్లోనే అందిస్తున్నాను. నా ఆరోగ్యం బాగోనప్పుడు అమ్మే అన్నీ తానై చూసుకుంటూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. 
 – సౌమిత బసు, సీఈవో  జైనిక

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement