పట్టు వదలకు... గెలుపు మరువకు!
స్ఫూర్తి
ఆత్మహత్య చేసుకోవడానికి ఏముండాలి? ‘చాలా ధైర్యం ఉండాలి’... ఆ ధైర్యంలో కొంచెం అయినా మనలో ఉంటే, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన బెదిరిపోతుంది. విజయం మనతో చెలిమి చేస్తుంది. చీకటి భయపెట్టిన చోటే... వెలుగురేఖలు స్వాగతం పలుకుతాయి. సమర్థతకు పట్టం కడతాయి. అరుణ్ పండిట్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు... ఒకప్పుడు! ఆత్మహత్య చేసుకోవడం ఏ సమస్యకూ పరిష్కారం కాదు. పోరాడాలి. గెలవాలి అంటున్నాడు... ఇప్పుడు!! ఆ మార్పు వెనుక కథను తెలుసుకుందాం...
స్నేహితులందరినీ పేరు పేరునా గుర్తు తెచ్చుకున్నాడు. అలా గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు వారితో తనను తాను పోల్చి చూసుకున్నాడు. ‘వారితో పోల్చితే నేను ఎందుకూ పనికిరాను. అసమర్థుడిని’ అని వందోసారి అనుకున్నాడు. ‘అసమర్థుడిగా బతకడం కంటే చనిపోవడమే మంచిది!’ ఈసారి చాలా గట్టిగా అనుకున్నాడు. మళ్లీ ఏ మూలో చిన్న అలజడి. ‘చనిపోవాలా?’ ‘చనిపోయేంత తప్పు తాను ఏం చేశానని!’
సుజన్‌పూర్ (హిమాచల్‌ప్రదేశ్)లో చదువుకునే రోజుల్లో అపజయాలు అరుణ్ పండిట్‌ను వరుసగా పలకరించేవి. ఒకరోజు ఒక అపజయం ఎదురైతే, మరొకరోజు అంతకంటే బలమైన అపజయం ఎదురయ్యేది. ఇక చదువు విషయానికి వస్తే ప్రతి పరీక్షలోనూ ఫెయిల్ కావడమే!
‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ’లో చేరాలని తనకు ఒక కల ఉండేది. ఒకవేళ తాను కన్న కల నిజమైతే ఇప్పటి వరకు తనను చిన్న చూపు చూసిన వాళ్లే తరువాత నాలుగు మంచి మాటలు మాట్లాడతారు. విమర్శకుల నోరు మూయించడానికైనా తాను ఎన్డీఎలో చేరాలనుకున్నాడు. మొదటి ప్రయత్నం చేశాడు... ఫెయిల్. రెండో ప్రయత్నం చేశాడు... ఫెయిల్. ముచ్చటగా మూడో ప్రయత్నం చేశాడు... ఫెయిల్!
‘‘కల మాత్రమే కనగల శక్తి ఉంది. దాన్ని నిజం చేసుకునే శక్తి నాలో లేదు’’ నిరాశలో పడిపోయాడు. అపజయాలకు తోడు అనారోగ్యం కూడా అరుణ్‌ను పట్టి పీడించింది. కొంతకాలం ఆస్పత్రి పాలయ్యాడు. ఆ తరువాత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాస్తే షరా మూమూలుగా ఫెయిలయ్యాడు. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవడం, ఒక కల కనడం... ఒక అడుగుపడే లోపే పరాజయం ఎదురుకావడం... జీవితం అంటేనే అసహ్యం అనిపించేది. బతికినా ఒకటే చచ్చినా ఒకటే అనుకున్నాడు.
అందుకే ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. ‘వైఫల్యం కూడా తప్పుతో సమానం. అందుకు శిక్ష చనిపోవడమే’ అనుకుంటూ సెల్‌ఫోన్ చేతుల్లోకి తీసుకున్నాడు. ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇక సెలవు’ అని దగ్గరి స్నేహితులందరికీ యస్‌ఎంయస్ పెట్టాడు అరుణ్ పండిట్. అరుణ్‌కు నచ్చజెప్పడానికి, ఆత్మహత్య ప్రయత్నం నుంచి అతణ్ణి విరమింపచేయడానికి స్నేహితుల నుంచి ఫోన్లు వరదలా వచ్చాయి. కానీ ఏ ఫోన్‌కు అరుణ్ స్పందించలేదు. కానీ, ఒక యస్‌యమ్‌ఎస్ మాత్రం అతనిలో ఆలోచన రేకెత్తించింది. అందులో ఇలా ఉంది: ‘నా కాళ్లకు చెప్పులు లేవని ఏడుస్తుంటే, కాళ్ల్లు లేని వ్యక్తి కనిపించాడు. నా ఏడుపు ఆగిపోయింది. ఈ ప్రపంచాన్ని సవాలుగా తీసుకో... నిన్ను నువ్వు నిరూపించుకో’.
ఎందుకో ఆ మెసేజ్‌ను మళ్లీ మళ్లీ చదవాలనిపించింది. అలా చదువుతున్న క్రమంలో జీవితం విలువ మెల్లగా అర్థం కావడం మొదలైంది. ఆత్మహత్య చేసుకోవాలన్న తన నిర్ణయం ఎంత తప్పో తెలిసింది. ఇలాంటివే కొన్ని మెసేజ్‌లు చదివేసరికి మూసుకుపోయిన కళ్లు తెరుచుకున్నాయి. జాడ లేని ఆత్మవిశ్వాసం పదునైన ఆయుధంతో తన ముందు నిల్చొని -
‘‘యుద్ధం చెయ్’’ అని పిలుపునిచ్చింది. అప్పటికప్పుడు తనలో ఒక చిన్న ఆలోచన మెరుపులా మెరిసింది. ‘‘ఒక చిన్న మెసేజ్ నన్ను ఆత్మహత్య ప్రయత్నం నుంచి రక్షించింది. దేశంలో ఎంతోమంది ఎన్నో బాధలతో ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్లకు ధైర్యం చెప్పేలా, ఆత్మవిశ్వాసం నూరిపోసేలా ఒక వెబ్‌సైట్ ప్రారంభిస్తే ఎలా ఉంటుంది?’’ అనే అరుణ్ ఆలోచన నుంచి ‘డోన్ట్ గివ్ అప్ వరల్డ్’ వెబ్‌సైట్ ప్రారంభమైంది. అనూహ్యమైన స్పందన సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే ఈ సైట్‌ను ఇరవై అయిదు లక్షల మంది వరకు చూశారు. అరుణ్ పండిట్ ఇప్పుడు ‘డిజిడబ్ల్యు’ నిర్వాహకుడు మాత్రమే కాదు. మోటివేషనల్ స్పీకర్ కూడా. పెద్ద పెద్ద పుస్తకాల నుంచి కాకుండా, నిత్యజీవితంలోని చిన్న చిన్న విషయాలను ఆధారంగా చేసుకొని అతను చేసే ఉపన్యాసాలు ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతున్నాయి.
రకరకాల ఆప్స్‌ను లాంచ్ చేయాలని, ఆన్‌లైన్ సైకలజికల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని... ఇలా ఎన్నో ఆలోచనల్లో తలమునకలై క్షణం తీరిక లేకుండా ఉన్నాడు అరుణ్ పండిట్. ఇక నిరాశ అనే శత్రువు అతడి దగ్గరకు ఎలా వస్తుంది!
సానుకూల దృక్పథంతో...
స్ఫూర్తిదాయకమైన ఛాయాచిత్రాలు ‘డోన్ట్ గివ్‌అప్’లో ఉంటాయి. వీటిని ఎవరైనా పంపవచ్చు. అక్షరాల ద్వారా కాకుండా చిత్రాల ద్వారా ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం ఇది. గొప్ప వాళ్ల ఉపన్యాసాల నుంచి సేకరించిన మంచిమాటలు ఉంటాయి. తమ శక్తిసామర్థ్యాలను పెట్టుబడిగా పెట్టి, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, గెలుపు పతాకం ఎగరేసిన వారి విజయగాథలు ఉంటాయి. కథలు, కవితలు, ఇంటర్వ్యూలు, వీడియోలు ఉంటాయి.
అరుణ్ పండిట్ ఇప్పుడు ‘డిజిడబ్ల్యు’ నిర్వాహకుడు మాత్రమే కాదు. మోటివేషనల్ స్పీకర్ కూడా. పెద్ద పెద్ద పుస్తకాల నుంచి కాకుండా, నిత్యజీవితంలోని చిన్న చిన్న విషయాలను ఆధారంగా చేసుకొని అతను చేసే ఉపన్యాసాలు ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నాయి.