మల్లన్న పట్నం వేస్తున్న యువ ఒగ్గు కళాకారులు
అవును.. వాళ్లు కథలు చెబుతున్నారు. ఊ కొట్టే కథలు కావు. పెద్దల నుంచి వారసత్వంగా వచ్చిన కథలు. పల్లెల్లో ఆధ్యాత్మిక భావాలు నింపే ఒగ్గుకథలు. దశాబ్దం క్రితం కులవృత్తి అంటే చిన్నచూపు చూడడంతో జానపదుల కళలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలోనే నేటి యువత ఇటు చదువుతోపాటు అటు కులవృత్తిని ఉపాధిరంగంగా ఎంచుకుంటుంది.
బీటెక్, బీఈడీ, డిగ్రీలు, పీజీలు చదువుతూనే ఒగ్గుకథలు, మల్లన్నపట్నాల కథలు చెబుతున్నారు. కులవృత్తిని కాపాడుతూనే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఒకప్పుడు మల్లన్నపట్నాలు అంటేనే కథకులు పెద్ద వయసు వారు వచ్చేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. పాతికేళ్లు కూడా నిండని యువత మల్లన్నపట్నాల బాధ్యతలు తమ బుజాలపై వేసుకుంటున్నారు. కథలు చెబుతూ పల్లెప్రజల మన్ననలు అందుకుంటున్నారు.
మూడు నెలలు కథలు చెబుతూ..
తాతలు.. తండ్రుల నుంచి వచ్చిన కులవృత్తిని ఉపాధిరంగంగా ఎంచుకున్న నేటి యువత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే కథలు చెబుతున్నారు. ఈ మూడునెలల్లో ప్రతీ ఆదివారం మల్లన్నపట్నాల పూజలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఒకరి ఇంట్లో మల్లన్నపట్నాల పూజలకు ముగ్గురు యువకులు వెళ్లి దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు.
మల్లన్న పట్నాలలో ఆడ వేషధారణలో కథలు చెబుతున్న యువ కళాకారుడు
కులవృత్తిపై మమకారంతో..
కులవృత్తిపై మమకారంతో ఇటీవల యువత మల్లన్నపట్నాలు, భీరప్ప కథలు చెప్పేందుకు ముందుకొస్తున్నారు. బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో దాదాపు 50 మంది ఒగ్గుకథ కళాకారులు ఉన్నారు. ఇందులో 20 మంది వరకు పాతికేళ్లు కూడా నిండని యువతే. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మూడు నెలల్లో ప్రతీ ఆదివారం, సోమవారం మల్లన్న పట్నాల పూజలకు వెళ్తుంటారు.
కులవృత్తిని గౌరవిస్తూనే ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. బోయినపల్లి మండలానికి చెందిన కళాకారులు వేములవాడ, బావుపేట, కందికట్కూర్, వాసంపల్లి, అయ్యోరుపల్లి గ్రామల మధ్యలో విస్తరించి ఉన్న ప్రాంతంలో మల్లన్నపట్నాల పూజలు చేస్తుంటారు. వివిధ దేవుళ్లు, జానపదల కథలు చెబుతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment