oggu kata
-
ఉన్నత చదువులు చదువుతూనే..ఒగ్గు కథలు చెబుతున్న యువత!
అవును.. వాళ్లు కథలు చెబుతున్నారు. ఊ కొట్టే కథలు కావు. పెద్దల నుంచి వారసత్వంగా వచ్చిన కథలు. పల్లెల్లో ఆధ్యాత్మిక భావాలు నింపే ఒగ్గుకథలు. దశాబ్దం క్రితం కులవృత్తి అంటే చిన్నచూపు చూడడంతో జానపదుల కళలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలోనే నేటి యువత ఇటు చదువుతోపాటు అటు కులవృత్తిని ఉపాధిరంగంగా ఎంచుకుంటుంది. బీటెక్, బీఈడీ, డిగ్రీలు, పీజీలు చదువుతూనే ఒగ్గుకథలు, మల్లన్నపట్నాల కథలు చెబుతున్నారు. కులవృత్తిని కాపాడుతూనే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఒకప్పుడు మల్లన్నపట్నాలు అంటేనే కథకులు పెద్ద వయసు వారు వచ్చేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. పాతికేళ్లు కూడా నిండని యువత మల్లన్నపట్నాల బాధ్యతలు తమ బుజాలపై వేసుకుంటున్నారు. కథలు చెబుతూ పల్లెప్రజల మన్ననలు అందుకుంటున్నారు. మూడు నెలలు కథలు చెబుతూ.. తాతలు.. తండ్రుల నుంచి వచ్చిన కులవృత్తిని ఉపాధిరంగంగా ఎంచుకున్న నేటి యువత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే కథలు చెబుతున్నారు. ఈ మూడునెలల్లో ప్రతీ ఆదివారం మల్లన్నపట్నాల పూజలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఒకరి ఇంట్లో మల్లన్నపట్నాల పూజలకు ముగ్గురు యువకులు వెళ్లి దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. మల్లన్న పట్నాలలో ఆడ వేషధారణలో కథలు చెబుతున్న యువ కళాకారుడు కులవృత్తిపై మమకారంతో.. కులవృత్తిపై మమకారంతో ఇటీవల యువత మల్లన్నపట్నాలు, భీరప్ప కథలు చెప్పేందుకు ముందుకొస్తున్నారు. బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో దాదాపు 50 మంది ఒగ్గుకథ కళాకారులు ఉన్నారు. ఇందులో 20 మంది వరకు పాతికేళ్లు కూడా నిండని యువతే. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మూడు నెలల్లో ప్రతీ ఆదివారం, సోమవారం మల్లన్న పట్నాల పూజలకు వెళ్తుంటారు. కులవృత్తిని గౌరవిస్తూనే ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. బోయినపల్లి మండలానికి చెందిన కళాకారులు వేములవాడ, బావుపేట, కందికట్కూర్, వాసంపల్లి, అయ్యోరుపల్లి గ్రామల మధ్యలో విస్తరించి ఉన్న ప్రాంతంలో మల్లన్నపట్నాల పూజలు చేస్తుంటారు. వివిధ దేవుళ్లు, జానపదల కథలు చెబుతుంటారు. ఇవి చదవండి: దశకుంచెల చిత్రకారుడు! ఏకకాలంలో రెండు చేతులతో.. -
ఒగ్గుకళకు జీవంపోసింది మిద్దె రాములే..
అధికారభాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు వేములవాడ : ఒగ్గుకళకు జీవంపోసి... దానికి నలుదిశలా చాటిచెప్పిన మహనీయుడు మిద్దె రాములు అని రాష్ట్ర అధికారభాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. పట్టణంలోని రవీంద్ర ఫంక్షన్‌హాలులో బుధవారం జరిగిన జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్షరజ్ఞానం లేకున్నా ఒగ్గుకథ ద్వారా ఆయన విన్యాసాలు, భాషాశైలి జనాల్ని కట్టిపడేసేవని గుర్తుచేశారు. వివిధ రాష్ట్రాలు, పలు దేశాల్లో ఆయన ప్రదర్శనలిచ్చారన్నారు. ఒగ్గుకథలో పూర్తిస్థాయిలో తెలంగాణ యాస, భాష ఇమిడి ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామీణస్థాయిలో కళాకారులను ప్రోత్సహిస్తూ తన కళా నైపుణ్యంతో ఎంతో మంది శిష్యులకు ఉపాధిబాట చూపించారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ సైతం తెలుగుభాష, ఒగ్గుకథకు ప్రత్యేక ప్రాధాన్యతినిస్తున్నారన్నారు. జాతీయబుక్ ఆఫ్ ట్రస్టు సంపాదకులు పత్తిపాక మోహన్ మాట్లాడుతూ స్వర్గీయ దేశ ప్రధాని ఇందిరాగాంధికి తెలుగుభాష రాకున్నా ఒగ్గుకథ కళతో అందులోని మాధ్యుర్యాన్ని పంచిపెట్టిన ఘనత మిద్దె రాములుకే దక్కిందన్నారు. ఆయన మన మధ్యలో లేకపోయినా ఇచ్చిన కళ మాత్రం సజీవంగా ఉండిపోతుందని చెప్పారు. అనంతరం కళా ప్రదర్శనల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.నగరపంచాయతీ చైర్పర్సన్ నామాల ఉమ, ఎంపీపీ రంగు వెంకటేశ్‌గౌడ్, ఆలయ ఈవో దూస రాజేశ్వర్, ఆదిలాబాద్ రేడియో సహాయ సంచాలకులు సుమనస్పతిరెడ్డి, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ తీగల రవీందర్‌గౌడ్, సెస్ డైరెక్టర్ జడల శ్రీనివాస్, మిద్దె రాములు ట్రస్టు ఫౌండర్ మిద్దె పర్శరాములు, కళాకారుల సంక్షేమ సంఘం నాయకుడు యెల్ల పోచెట్టి పాల్గొన్నారు. రాజన్న సన్నిధిలో పూజలు వేములవాడ రాజన్నను రాష్ట్ర అధికారభాషా సంఘం అధ్యక్షుడు దేవుళపల్లి ప్రభాకర్‌రావు బుధవారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారి ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. అనంతరం ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.