ఎనిమిదడుగుల బంధం | That is the true marriage | Sakshi
Sakshi News home page

ఎనిమిదడుగుల బంధం

Published Sat, Mar 10 2018 12:33 AM | Last Updated on Sat, Mar 10 2018 4:07 AM

That is the true marriage - Sakshi

ఇద్దరు ఒకటవ్వాలంటే.. ఏడడుగుల బంధం  సరిపోతుంది. కానీ పెళ్లిచేసుకున్నాక ఉండేదిఈ సమాజంలోనే..బతికేది ఈ ప్రకృతిలోనే.. కదా. అందుకే పెళ్లిచేసుకునేటప్పుడుతనూ నేనే లోకం అని కాకుండాతను, నేను, లోకమూ ఉండాలనిఏడడుగులకు ఇంకొక్క అడుగు వేస్తే..ఎనిమిదో అడుగూ వేస్తే..అదే నిజమైన వివాహబంధం అవుతుంది!

కట్నంగా ఐదు మొక్కలు
ఉత్తర ప్రదేశ్‌లో ఓ పెళ్లికొడుకు. పేరు తపన్‌ పాండే. పెళ్లికి స్పెషల్‌ గెస్ట్‌లను ఆహ్వానించాలను కున్నాడు. వధువు అంజలి మిశ్రా కూడా ఓకే చెప్పింది. అలా వారి పెళ్లికి ఆ ప్రత్యేక ఆహ్వానితులు విచ్చేసి సంతోషంగా గడిపారు. ఆ ఆహ్వానితులు అనాథపిల్లలు! వాళ్లలో కొందరు వికలాంగులు. అంతటితో అయిపోలేదు. వధూవరులిద్దరూ తమ కళ్లను దానం చేస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. పెళ్లికి కట్నం ఇచ్చి తీరాలని కూడా డిమాండ్‌ చేశాడు పెళ్లి కొడుకు! అయితే ఆ కట్నం.. అతడిని నేరస్థుడిని చేసి జైలు పాలు చేసేది కాదు. కట్నంగా అతడు అడిగి తీసుకున్నవి ఐదు మొక్కలు! పెళ్లి సందర్భంగా మామగారిచ్చిన ఆ మొక్కలను ఇంటి పెరట్లో నాటుకున్నాడు అల్లుడుగారు. 

మూగ జీవులకు రిసెప్షన్‌
మహారాష్ట్రలో మరో పెళ్లి కొడుకు ఆదిత్య తివారి. అతడు పెళ్లి నాటికే ఓ బిడ్డకు తండ్రి! సింగిల్‌ పేరెంట్‌. దత్తత స్వీకార నిబంధన మార్పు కోసం రెండేళ్లుగా సామాజిక  పోరాటం చేస్తున్న ఆదిత్య.. తన పెళ్లి సందర్భంగా ‘డౌన్స్‌ సిండ్రోమ్‌’తో బాధపడుతున్న ఓ బిడ్డను దత్తత చేసుకున్నాడు. అతడి పెళ్లి వేడుకకు హాజరైన వారిలో పది వేల మంది నిర్వాసితులు, వృద్ధులు, అనాథలే. ఆ రోజు స్థానిక జూలోని వెయ్యి జంతువులకు, వందలాది వీథి కుక్కలకు  ఆహారం పెట్టారు. ఆహ్వానితులు వెయ్యి మొక్కలు నాటారు. వచ్చిన కానుకలకు బదులుగా అందరికీ పుస్తకాలు, మందులు తిరుగు కానుకగా ఇచ్చాడు ఆదిత్య. 

వధువుకు మంచి పుస్తకాలు
మలయాళీ వధువుది మరో మార్గం. అత్తవారింటి వారు పెళ్లి సందర్భంగా వధువుకి ఖరీదైన దుస్తులు, నగలు బహుమతిగా ఇవ్వడం అక్కడి సంప్రదాయం. అయితే వాటికి బదులుగా యాభై మంచి పుస్తకాలను బహుమతిగా ఇవ్వమని కోరింది. వధువు సాహ్లా ముచ్చట తీర్చడానికి వరుడు అనీష్‌ స్వయంగా బెంగళూరు వెళ్లాడు. అవును మరి, ఆమె కోరిన పుస్తకాలు చిన్న పట్టణాలలో దొరికేవి కావు. ఆమె కోరిన అరుదైన పుస్తకాల కోసం బ్లోసమ్స్, గంగారామ్స్, బుక్‌వార్మ్‌ వంటి షాపులన్నీ గాలించాడు. వాటిలో ఇస్లామిక్‌ ఫెమినిస్ట్‌ లిటరేచర్, ఫిక్షన్, పాలిటిక్స్‌ వంటివి ఉన్నాయి. ‘‘మెహర్‌ అనేది మహిళ హక్కు. ఆమె హక్కును గౌరవంగా తీర్చాల్సిన బాధ్యత భర్త మీద ఉంటుంది. ఆ బాధ్యతను నెరవేర్చాను. అంతే తప్ప ఇదేమీ నా ఉదారత కాదు’’ అంటున్నాడు అనీస్‌.

వితంతువులకు ప్రత్యేక ఆహ్వానం
గుజరాత్‌లోని వ్యాపారి జితేంద్ర పటేల్‌ తన కొడుకు పెళ్లికి పాటించిన వైవిధ్యత మూఢనమ్మకాలకు చెంపపెట్టుగా నిలిచింది. దేశం ఎంత అభివృద్ధి చెందినా, మన సమాజంలో శుభకార్యాలకు వితంతువులను ఆహ్వానించడానికి వెనుకాడే దుస్సంప్రదా యం ఇంకా ఉంది. దానిని చెరిపేసే ప్రయత్నంలో భాగంగా తన పెళ్లికి వితంతువులను ఆహ్వానించాడు జితేంద్ర. పెళ్లికి వచ్చిన 18 వేల మంది వితంతువులకు అతడు అందమైన శాలువాలు, ఫలాలనిచ్చే మొక్కలు పంచారు. వారిలో జీవనాధారం లేని ఐదు వందల మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాలిచ్చే ఆవుని కూడా ఇచ్చాడు జితేంద్ర పటేల్‌. 


ప్రమాణాలకు బదులు ప్రతిజ్ఞ
గుజరాత్‌కే చెందిన మరో వ్యాపారి గోపాల్‌ వస్తాపారా తన కొడుకు పెళ్లితోపాటు ‘తోడుపెళ్లి’లా మరో వంద మంది ఆడపిల్లలకు పెళ్లి చేశాడు! చెవులు చిల్లులు పడే బ్యాండ్‌ బాజాలకు, ఇతరత్రా హంగామాలకు చేసే దుబారాను తగ్గించి ఆ డబ్బుతో అల్పాదాయ వర్గాల వధూవరులకు సామూహికంగా వివాçహాలు జరిపించాడు. గోపాల్‌ వస్తాపారా కొత్త దుస్తులిచ్చి, పెళ్లి చేసి, అక్షింతలు వేసి ఆశీర్వదించి అంతటితో ఊరుకోలేదు. ఆ వందమంది దంపతులతో ‘ఆడపిల్లలను కాపాడుతాం, అలాగే పర్యావరణాన్ని పరిరక్షిస్తాం’’ అని ప్రతిజ్ఞ చేయించాడు. కడుపులో ఉన్నది అమ్మాయి అని తెలియగానే భ్రూణహత్యలకు పాల్పడడం, పుట్టగానే చంపేయడం అనే దుస్సంప్రదాయానికి అడ్డు కట్ట వేయడానికి తన వంతుగా బాధ్యత తీసుకున్నాడు. ‘బేటీ బచావో’ అని వందల మంది చేత వందలసార్లు ప్రమాణాలు చేయించడం కంటే వైవాహిక జీవితం మొదలు పెట్టిన కొత్త దంపతుల చేత ప్రతిజ్ఞ చేయించడం మంచిదనుకున్నాడు.

సైకిల్‌ ర్యాలీ సందేశం
సూరత్‌లో దాదాపు 250 మంది పెళ్లి కొడుకులు సైకిల్‌ ఎక్కి సందేశం ఇచ్చారు. వాతావరణ కాలుష్యం పట్ల అవేర్‌నెస్‌ తీసుకురావడానికి ఆ యువకులు చేసిన ప్రయత్నం ఇది. ఉత్తర భారత దేశంలోని ఢిల్లీ, సూరత్‌ వంటి అనేక నగరాలు విపరీతమైన వాయు కాలుష్యానికి లోనయ్యాయి. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఈ సంగతి గుర్తు చేస్తూ వాహనాల వాడకం తగ్గించాలని, లేకపోతే ఊపిరి తిత్తుల సమస్యలు ఎదురవుతాయని, జనజీవనం ప్రమాదంలో పడనుందని ఏటా హెచ్చరికలు ఇస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సూరత్‌లో యువకులు వాయు కాలుష్యం, పర్యావరణ పరిరక్షణ వంటి విషయాల మీద చైతన్యవంతం చేయడానికి పూనుకున్నారు. ఎకో ఫ్రెండ్లీ లైఫ్‌ స్టయిల్‌ను పరిచయం చేయాలనుకున్నారు.
పెళ్లి దుస్తుల్లో బంధువులతో కలసి సైకిళ్లెక్కి సూరత్‌ పట్టణంలో చక్కర్లు కొట్టారు. 

‘ఆత్మహత్య’ రైతుల పిల్లలకు విరాళం
ఈ వధూవరుల పేర్లు అబే దివారే, ప్రీతీ కుంభారే. వీళ్లది మహారాష్ట్ర. ఇద్దరూ ఐఆర్‌ఎస్‌ ఉద్యోగులు. నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లికి ఖర్చు చేయాలనుకున్న డబ్బుని ఆత్మహత్య చేసుకున్న పదిమంది రైతుల పిల్లల చదువు కోసం ఒక్కొక్కరికి 20 వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఇంకా వారందరికీ కలిపి 50 వేల రూపాయల పుస్తకాలు, ఐదు లైబ్రరీలకు కూడా ఆర్థిక సహాయం చేశారు.  
– మంజీర 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement