
కరోనా మహమ్మారి పంజా విసిరిననాటినుంచీ వినబడుతున్న కథనాలు గుండెలు బద్దలు చేస్తున్నాయి. ఆసరాగా వున్నవారు, పెద్ద దిక్కుగా వున్నవారు హఠాత్తుగా కరోనా వాతబడి కనుమరుగుకావడం ఏ కుటుంబాన్నయినా కోలుకోలేనంతగా దెబ్బతీస్తుంది. ఇక అమ్మానాన్న తప్ప వేరేవెరూ లేని పిల్లలకైతే భవిష్యత్తు నరకం. ఇష్టంలేని పెళ్లి చేసుకుని అందరికీ దూరం కావడం వల్లనో, వారి బంధువులు అంత స్థోమత వున్నవారు కాకపోవడం వల్లనో పిల్లలు అనాథలైనప్పుడు వారిని సాకేవారు ఎవరూ వుండరు. ఇలాంటి పిల్లలకు ‘నేనున్నాన’ ంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసించదగ్గది. కరోనా కారణంగా మృత్యువాత పడినవారి పిల్లలు అనాథలైనపక్షంలో అలాంటివారి పేరుపై తక్షణం రూ. 10 లక్షలు డిపాజిట్ చేయాలని, ఇరవై అయిదు సంవత్సరాలపాటు దానిపై వచ్చే వడ్డీతో ఆ పిల్లల బాగోగులు చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్దేశించారు. అనంతరకాలంలో ఆ డబ్బును పిల్లలు తీసుకునే అవకాశం కల్పించారు. అలాంటివారి కోసం ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు నెలకొల్పాలని ఇప్పటికే ఆయన ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేద వర్గాలు, మధ్యతరగతి వర్గాల పిల్లలకు వివిధ పథకాల కింద ఉచిత విద్య, మధ్యాహ్న భోజనంవంటివి అందుతున్నాయి. పై తరగతులకు వెళ్లేకొద్దీ ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టళ్ల సదుపాయాలు, మెస్ చార్జీల చెల్లింపు వంటివి అందుబాటులో వున్నాయి గనుక అలాంటి పిల్లలు పై చదువులు చదవడానికి, భవిష్యత్తులో మంచి ఉపాధి పొందడానికి వీలవుతుంది.
మన ప్రజారోగ్యరంగ అవ్యవస్థకు కరోనా వైరస్ పెను సవాల్ విసిరింది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆసుపత్రులు అరకొర సదుపాయాలతో కూనారిల్లుతున్నాయి. ఫలితంగా సరైన వైద్య సాయం అందక రోజుకు కొన్ని వేలమంది మృత్యువాత పడుతున్నారు. పచ్చగా వర్థిల్లిన కుటుంబాలు తీరని శోకంలో కూరుకుపోతున్నాయి. అమ్మానాన్నల్లో ఎవరో ఒకరున్నవారి పరిస్థితి కొంత మెరుగు. హఠాత్తుగా సంభవించిన పరిణామంతో వెంటనే దిగ్భ్రమలో కూరుకు పోయినా సర్వశక్తులూ కూడదీసుకుని మళ్లీ సాధారణ జీవనం సాగించేందుకు కృషి చేస్తారు. కానీ తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలు ఎవరో ఒకరు ఆసరాగా నిలబడకపోతే మళ్లీ ఎప్ప టికీ మామూలు మనుషులు కాలేరు. ఆడపిల్లలకైతే లైంగిక వేధింపులు అదనం. దేశం నలు మూలలనుంచీ అలాంటి పిల్లల గురించి మీడియాలో వెలువడుతున్న కథనాలు భీతిగొలు పుతున్నాయి. ఢిల్లీ పిల్లల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ అనురాగ్ కుందూ ఈమధ్య ఒక సంగతి చెప్పారు. అమ్మానాన్నలిద్దరూ ఆసుపత్రుల్లో వుండటంవల్లనో, ఆ వ్యాధికి బలికావడంవల్లనో ఒంటరైన పిల్లల గురించి ఈమధ్య నిరంతరాయంగా తనకు మెసేజ్‌లు వస్తున్నాయని అన్నారు. నోబెల్ గ్రహీత, బచ్‌పన్ బచావో ఆందోళన సంస్థ సారథి కైలాష్ సత్యార్థి కేవలం రెండు రోజుల వ్యవధిలో తనకు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి అనాథ పిల్లల్ని ఆదుకోవా లంటూ 200 కాల్స్ వచ్చాయని చెబుతున్నారు. ఇలాంటివారంతా చివరకు ఏమవుతు న్నారు...ఎటుపోతున్నారనే బెంగ హృదయమున్న ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది. మనదగ్గర మోసా లకు కొదవలేదు. ప్రాణావసరమైన ఔషధాలనూ, ఆక్సిజన్‌నూ బ్లాక్‌మార్కెట్‌చేసి అమ్ముకుం టున్న అథముల తరహాలోనే పిల్లల్ని అక్కున చేర్చుకున్నట్టు నటించి వ్యాపారం చేసే కేటుగాళ్లు కూడా తయారయ్యారు. అందుకే ఇలాంటి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు సృజనాత్మకంగా ఆలోచించడం, మెరుగైన పథకాలతో వారికి ఆసరాగా నిలవడం అత్యవసరం.
కేంద్రం కూడా ఈమధ్యే అనాథ పిల్లల విషయంలో కొన్ని ప్రతిపాదనలు చేసింది. వారికి అండదండలు అందించే విషయమై రాష్ట్రాలతో మాట్లాడుతున్నామని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. కానీ ఆ ప్రతిపాదనలు అరకొరగానే వున్నాయి. అనాథ పిల్లలను దత్తత తీసుకోవడం లేదా అందుకు ప్రోత్సహించడం చట్ట వ్యతిరేకమని చెప్పడం వరకూ బాగుంది. అలాంటి పిల్లలను జిల్లా శిశు సంక్షేమ కమిటీ ముందు హాజరుపరిచి వారిని సంరక్షకులకు అప్పగించడమో, ఇతర సంస్థల్లో పునరావాసం కల్పించడమో చేయాలని సూచిం చడం కూడా మంచిదే. దాంతోపాటు అలాంటి చిన్నారుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరహాలో ఆర్థిక సాయం అందించే అంశాన్ని కేంద్రం పరిశీలించాలి. పిల్లల సంరక్షణ సక్రమంగా వుండాలంటే వారికయ్యే ఖర్చులకు సరిపడా ఆదాయం కనబడాలి. అది లేనప్పుడు ఆ పిల్లలకు మెరుగైన సంరక్షణ లభిస్తుందని విశ్వసించలేం. కనీసం అలాంటి ఆదాయ వనరు చూపితే, ఆ పిల్లల్ని సరిగా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించటానికి వీలు కలుగుతుంది. ఆ పిల్లలకు రోజువారీ అవసరాలే కాదు...వారి భావోద్వేగాలను పరిరక్షించడం కూడా ముఖ్యమే. బెంగ ళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) అంచనాబట్టి వచ్చే జూన్ 11నాటికి దేశంలో 4,04,000మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం వుంది. వాషింగ్టన్ యూనివర్సిటీ విభాగం వచ్చే జూలై నాటికి 10 లక్షలమంది చనిపోవచ్చని చెబుతోంది. ఈ పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాలూ ఆంధ్రప్రదేశ్ నమూనాలో అనాథ పిల్లల కోసం మెరుగైన పథకాలు రూపకల్పన చేసేలా కేంద్రం చొరవ తీసుకోవాలి. తన వంతుగా అలాంటి పిల్లల సంరక్షణకు అదనంగా ఆర్థిక సాయం అందించాలి.