పదిలమైన పొదరిల్లు | matrutva child and old age homes | Sakshi
Sakshi News home page

పదిలమైన పొదరిల్లు

Published Mon, Oct 29 2018 12:19 AM | Last Updated on Mon, Oct 29 2018 12:19 AM

matrutva child and old age homes - Sakshi

హోమ్‌లోని ఒక చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో పిల్లలకు స్వయంగా భోజనం వడ్డిస్తున్న శ్రీదేవి

అనాథ పిల్లలను, ఆదరణ కోల్పోయిన వృద్ధులను చేరదీసి పదిలంగా సంరక్షించాలన్న తన సంకల్పానికి కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందకపోవడంతో కుటుంబాన్నే వదులుకుని.. తిరుపతి సమీపంలోని అవిలాల గ్రామంలో ‘మాతృశ్య చైల్డ్‌ అండ్‌ ఓల్డేజ్‌ హోమ్‌’ను నెలకొల్పిన శ్రీదేవి మాటల్లో.. ఆమె జీవితాశయం, అవరోధాలు, సడలని సంకల్ప బలం ఇవన్నీ వ్యక్తం అయ్యాయి.

నెల్లూరు జిల్లా వెంకటగిరి రైల్వే క్రాసింగ్‌ దగ్గర రైలు హఠాత్తుగా ఆగింది! ప్రయాణికులు కొందరు రైలు దిగి  ముందు ఉన్న పట్టాలపై తదేకంగా చూస్తున్నారు. అప్పటివరకు ఆ పట్టాలపై తల పెట్టి పడుకున్న ఓ మహిళ చంటి బిడ్డను భుజంపై నుంచి చంకలోకి తీసుకుని లేచి పక్కకు వెళ్లింది. ఆ మహిళ బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిందని అక్కడున్న వారందరికీ అర్థమైంది. కానీ ఎవరూ ఆమెను పలకరించడానికి ముందుకు రాలేదు. ఆ మహిళ ముఖంలో బెరుకు, దుఃఖం కనిపిస్తున్నాయి.

ఆ ప్రయాణికుల్లో నుంచి ఒక మహిళ దిగి వచ్చి ‘‘ఎందుకు చనిపోవాలనుకున్నావు’’ అంటూ ఆమెను అడిగింది. ఆ బిడ్డ తల్లి తన జీవితంలోని కష్టాలను ఏకరువు పెట్టింది. చివరకు కట్టుకున్నవాడే తనను, తన బిడ్డను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. ‘‘అయితే నా వెంట రా అంటూ’’ రైలు దిగిన మహిళ ఆమెను తనతో తీసుకెళ్లింది. పదేళ్ల క్రితం నాటి విషయం ఇది. ఆ తల్లీ బిడ్డను రక్షించి, సంరక్షించిన మహిళ శ్రీదేవి. ఆమె ఇంట్లో ఇప్పుడు తొంభై మంది పిల్లలు, పదమూడు మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు.

నాన్న మాట మనసులో పడింది
‘‘నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని సింగపేట మా ఊరు. మాది ఉమ్మడి కుటుంబం. మేము ఐదుగురు సంతానం. అందరం ఆడ పిల్లలమే. నాన్న రాజగోపాల్‌ తపాలా శాఖలో పనిచేసేవారు. చాలీ చాలని జీతం, కుటుంబ భారాన్ని మోయడానికి పంచాయతీ కార్యాలయంలో గుమాస్తాగా, ఓ లాయర్‌ వద్ద అసిస్టెంటుగా పనిచేసేవారు నాన్న. నేను పెద్ద కూతురు కావడంతో కొడుకులా పెంచారు. నాన్న ఎక్కడికి వెళ్లినా నన్ను తీసుకెళ్లేవారు.

అలా ఓ రోజు నెల్లూరు పట్టణానికి వెళ్లాం. అక్కడ వడ్రంగి పని చేస్తున్న చిన్న పిల్లాడిని షాపు యజమాని కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నారని నాన్నను అడిగాను. ‘‘తల్లిదండ్రులు లేని పిల్లలు ఈ ధరణికి కూడా భారమే’’ అని నాన్న ఆవేదనగా అన్న మాట ఇప్పటికీ నా చెవిలో మారుమోగుతూనే ఉంది. అప్పుడే అనుకున్నాను అనాథలకు అండగా ఉండాలని. డిగ్రీ వరకు చదివాను. సాయం  చేసే గుణం నాకు నా తండ్రి నుంచి అలవడింది. చిన్నతనంలోనే అనాథ పిల్లలను ఇంటికే తీసుకొచ్చేదాన్ని. అందుకు ఇంట్లోవాళ్లు అభ్యంతరం చెప్పేవారు. నాకు వివాహం జరిగిన తరువాత కూడా కుటుంబ సభ్యుల సహకారం అందలేదు. దీంతో తిరుపతికి వచ్చేశాను.

మెస్‌కి అడ్రస్‌ చెప్పి పంపేవారు
తిరుపతి డీఆర్‌ మహల్‌ వద్ద ‘నెల్లూరు వారి మెస్‌’ అనే పేరుతో హాటల్‌ ఆరంభించాను. అప్పుడు వంట చేయడంలో అనుభవం వచ్చింది. అప్పుడు కూడా ఆకలితో వచ్చేవారికి డబ్బులు లేకున్నా అన్నం పెట్టే పంపించేదాన్ని. అలా క్రమ క్రమంగా ఎక్కడెక్కడి అనాథలు, అభాగ్యులు మెస్‌కు వచ్చేవారు. పోలీసులు, ఆటోవాళ్లుకూడా శ్రీదేవి మెస్‌కు వెళ్లండి అన్నం పెడుతుంది అని యాచకులకు, అనామకులకు చెప్పేవాళ్లు. ఆ తరువాత క్రమంగా రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్లలో ఉన్న పిల్లలను ఇంటికి తీసుకొచ్చాను.

ఒకసారి ఒక పిల్లవాడికి జబ్బు చేస్తే ఆస్పత్రికి తీసుకెళ్లాను. నాతో పాటు ముప్పై మంది పిల్లలు వచ్చారు. డాక్టర్‌ ఆశ్చర్యపోయి ఆరా తీశాడు. ఇలా పిల్లలను చేరదీస్తే, చట్టపరమైన ఇబ్బందులొస్తాయని, అనాథ శరణాలయం నడిపేందుకు అనుమతి తీసుకోవాలని చెప్పాడు. 2014లో కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకుంటే తరువాత అనుమతి వచ్చింది. మాతృశ్య చైల్డ్‌ అండ్‌ ఓల్డేజ్‌ హోమ్‌ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించాను. అవిలాలలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని అక్కడే హోమ్‌ నడుపుతున్నాను.

 ఇల్లు.. బంగారం అమ్ముకున్నాను
కుటుంబ సభ్యులు, భర్త సహకారం లేకపోయినప్పటికీ కష్టార్జితంతో హోమ్‌ను నడుపుతున్నాను. దీనికోసం సొంత ఇల్లు, బంగారు నగలు, హోటల్‌ను అమ్ముకున్నాను. ప్రస్తుతం కొందరు దాతలు సహకారం అందిస్తున్నారు. వారి సహకారంతో హోమ్‌లోని ముప్పై మంది పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నాం. నలభై మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ద్వారా వచ్చిన పిల్లలకు, ఇంటి నుంచి పారిపోయి వచ్చిన పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నాం. కొంత మంది పిల్లలను వారి కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు అప్పగించాం.

 తోడూ నీడగా నా ఇద్దరు పిల్లలు
నా ఇద్దరు పిల్లలు నాకు తోడునీడగా ఉంటూ హోమ్‌ నిర్వహణలో బాధ్యత పంచుకుంటున్నారు. మా అమ్మాయి శశికళ ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యూ పూర్తి చేసింది. అబ్బాయి సూర్య డిగ్రీ పూర్తి చేసి సీఏ వైపు వెళ్తున్నాడు. వీరిద్దరు పూర్తి స్థాయిలో హోమ్‌ బాధ్యత చూసుకుంటున్నారు. మానవ జన్మ అరుదు. ఈ జన్మను సార్థకత చేసుకోవడానికి ఈ సేవ చేసుకుంటున్నా. నలుగురు చెల్లెల్లో ఒక చెల్లి, మరిది మాత్రం నన్ను అర్థం చేసుకుని నా సేవను ప్రోత్సహిస్తున్నారు. హోమ్‌ పెట్టినప్పుడు నాన్న నన్ను ఆశీర్వదించి, భరోసా ఇచ్చారు. నాన్న చనిపోయి ఆరేళ్లవుతోంది. అయినప్పటికీ ఆయన నా వెన్నంటే ఉండి నడిపిస్తున్నారు.

ఇక్కడే చదివి.. ఇక్కడే సేవకు..
మానస (పేరు మార్చాం) పదో తరగతి సమయంలో హోమ్‌కు వచ్చింది. ఆ అమ్మాయి కోరిక మేరకు నర్సింగ్‌ చదివించాము. ప్రస్తుతం నర్సింగ్‌ పూర్తయి హోమ్‌లో పిల్లలు, వృద్ధులకు సేవలందిస్తోంది. చిన్నపాటి జ్వరం, జలుబు, దగ్గు వంటి వాటికి మందులిస్తూ హోమ్‌లోనే ఉంటోంది. చిన్మయి (పేరు మార్చాం) చిన్నప్పటి నుంచి హోమ్‌లోనే ఉంటోంది. ప్రస్తుతం డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇంకో అబ్బాయి పలమనేరులో ఉన్న కేటిల్‌ ఫారం కోర్సు చదువుతున్నాడు.

తీసుకెళ్లి.. తీసుకొస్తున్నాం
వాణికి పుట్టుకతోనే అంధత్వం. అనంతపురం జిల్లాలోని ఓ పల్లెటూరుకు చెందిన వాణి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. ఆర్థిక స్థోమత లేకపోవడంతో అమ్మాయి తండ్రి, బంధువులు హోమ్‌లో చేర్పించారు. ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు తిరుచానూరులోని నవజీవన్‌ అంధుల పాఠశాలలో చదివించాం. ప్రస్తుతం శ్రీపద్మావతి మహిళా జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రతి రోజు ఉదయం కళాశాలకు తీసుకెళ్లి, సాయంత్రం హోమ్‌కు తీసుకువస్తున్నాం.

హోమ్‌లో వృద్ధులలో బీపీ, షుగర్, పక్షవాతం, నడవలేని వారు ఉన్నారు. వీరిలో ఇద్దరికి  మతిస్థిమితం లేదు. అయినా వారికి అన్ని రకాల వైద్య చికిత్సలు చేయిస్తూ వారికి ఆశ్రయం కల్పిస్తున్నాం. హోమ్‌కు అవసరమైన స్థలం ప్రభుత్వం కానీ, దాతలు కానీ ముందుకొచ్చి ఇస్తే బాగుంటుంది. ప్రస్తుతం అద్దె భవనంలో హోమ్‌ నడుపుతున్నాం. సొంతంగా స్థలం ఉంటే అద్దె డబ్బు మిగులుతుంది. ఆ డబ్బుతో పిల్లలకు, వృద్ధులకు మరింత మంచి సదుపాయాలు అందివ్వచ్చు’’ అన్నారు శ్రీదేవి.

క్యాటరింగ్‌ చేసి, చీరలు విక్రయించి, పశుపోషణ ద్వారా పాలు విక్రయించి వచ్చే డబ్బుతో శ్రీదేవి ఈ హోమ్‌ను నడుపుతున్నారు. ఈ సంగతి పుట్టింటి వారికి, మెట్టినింటి వారికి తెలియడం ఆమెకు ఇష్టం లేదు. చిన్నతనంగా భావిస్తారని శ్రీదేవి భావన. మనసు పెద్దదైనప్పుడు.. ఏ పని మాత్రం చిన్నదౌతుంది?!

– ఎస్‌.శశికుమార్‌ (ఎడ్యుకేషన్‌), సాక్షి, తిరుపతి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement