ఆరంభం అదిరిపోతే ఆ కిక్కే వేరుంటుంది. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ (Junaid Khan) మహారాజ్ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో గతేడాది విడుదలై ట్రెండింగ్‌లో నిలిచింది. తొలి సినిమానే సక్సెస్ సాధించాడని ప్రశంసలు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం జునైద్.. లవ్‌యాపా మూవీ (Loveyapa Movie) చేస్తున్నాడు. ఇందులో దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరూ వెండితెరపై కనిపించబోయే తొలి చిత్రం ఇదే కావడం విశేషం!
సాంగ్ రిలీజ్
ఖుషి గతంలో ద ఆర్చీస్ అనే సినిమా చేసింది. కానీ ఇది కూడా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. ఇకపోతే లవ్‌యాపా నుంచి ఇటీవలే లవ్‌యాపా హో గయా అనే పాట రిలీజ్ చేశారు. ఇది చూసిన జనాలు పాట బాగుంది, కానీ ఈ లవ్‌ట్రాక్ మాత్రం కాస్త విచిత్రంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అయితే జునైద్ తండ్రి, స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan).. పాట మాత్రమే కాదు సినిమా కూడా అదిరిపోయిందంటున్నాడు.
శ్రీదేవిని చూసినట్లే ఉంది
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ మాట్లాడుతూ.. లవ్‌పాయా సినిమా రఫ్ కట్ చూశాను. మూవీ చాలా బాగుంది. వినోదాత్మకంగా ఉంది. నాకు నచ్చింది. సెల్‌ఫోన్ల వల్ల మన జీవితాలు ఎలా అయిపోతున్నాయి? ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయనేది చక్కగా చూపించారు. అందరూ బాగా నటించారు. సినిమాలో ఖుషిని చూస్తుంటే శ్రీదేవి (Sridevi) ని చూసినట్లే ఉంది. శ్రీదేవికి నేను పెద్ద అభిమానిని. ఆవిడ ఎనర్జీ నాకు అక్కడ కనిపించింది అని చెప్పుకొచ్చాడు.
(చదవండి: శుభవార్త చెప్పిన హీరోయిన్.. పట్టలేనంత సంతోషం, కొంత నిరాశ!)
మరీ ఇంత అబద్ధమాడాలా?
ఇది చూసిన నెటిజన్లు ఖుషిని గొప్ప నటి శ్రీదేవితో పోల్చవద్దని వేడుకుంటున్నారు. ప్లీజ్ యార్.. మరీ ఇంత పెద్ద అబద్ధం చెప్పాల్సిన పని లేదు, పిల్లలపై ప్రేమతో ఏదైనా అనేస్తావా?.. అని పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. లవ్‌యాపా విషయానికి వస్తే.. తమిళ హిట్ మూవీ లవ్ టుడేకు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించగా ఫాంటమ్ స్టూడియోస్, ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ కొత్త హీరోహీరోయిన్లను ప్రజలు ఏమేరకు ఆదరిస్తారో చూడాలి!
ఖుషి అక్క ఆల్‌రెడీ సత్తా చాటుతోంది!
ఇప్పటికే ఖుషి అక్క జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది. సౌత్‌లో దేవర మూవీతో కుర్రాళ్ల మనసులో గిలిగింతలు పెట్టింది. రామ్‌చరణ్‌తోనూ ఓ సినిమా చేస్తోంది. ఈ ముద్దుగుమ్మల తల్లి శ్రీదేవి అతిలోక సుందరిగా ప్రేక్షకల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంది.
గొప్ప నటి శ్రీదేవి
తెలుగులో కార్తీకదీపం, ప్రేమాభిషేకం, ఆఖరి పోరాటం, జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి చిత్రాలతో అలరించింది. దక్షిణాది చిత్రాలతో పాటు హిందీలోనూ అగ్రకథానాయికగా స్టార్‌డమ్ సంపాదించుకుంది. 2013లో శ్రీదేవిని భారతీయ ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అయితే 2018లో ఆమె ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయింది.
చదవండి: సంధ్య థియేటర్ ఘటన: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్
Comments
Please login to add a commentAdd a comment