హీరోయిన్ సనా ఖాన్ శుభవార్త చెప్పింది. రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపింది. సనాఖాన్- అనాస్ సయ్యద్ దంపతులకు ఇదివరకే తరీఖ్ జమిల్ అనే బాబు ఉన్నాడు. ఇప్పుడు ఆ బుడ్డోడితో ఆడుకోవడానికి మరో బాబు ఇంట్లో అడుగుపెట్టాడు. జనవరి 5న బాబు పుట్టాడంటూ వీడియో షేర్ చేసింది.
ఆడపిల్ల కావాలనుకుంది
ఇకపోతే తనకు పుట్టబోయే బిడ్డకు ఏ పేరు పెట్టాలంటూ కొద్దిరోజులుగా ఆలోచనల్లో మునిగిపోయింది సనా. కూతురు పుడితే ఏ పేరు పెట్టాలి? బాబు పుడితే ఏ పేరు పెట్టాలని తెగ ఆలోచించింది. అమ్మాయైతే ఎఫ్, జె, కె అక్షరాలతో పేరు స్టార్ట్ అవ్వాలని, అబ్బాయైతే టి, కె, ఎమ్ అక్షరాలతో పేరు మొదలవ్వాలని రాసుకుంది. అమ్మాయి పుడితే బాగుండని ఆశపడింది. కానీ మళ్లీ అబ్బాయే జన్మించాడు. ఏదేమైనా రెండోసారి తల్లయినందుకు సనా సంతోషంలో మునిగి తేలుతోంది.
సినిమా జర్నీ
కాగా సనా ఖాన్ ఒకప్పుడు వెండితెరపై గ్లామర్ ఒలకబోసింది. తన తొలి చిత్రం యే హై హై సొసైటీ అనే అడల్ట్ మూవీ. తర్వాత ఇ అనే తమిళ మూవీలో ఐటం సాంగ్ చేసింది. జర్నీ బాంబే టు గోవా మూవీలోనూ ఐటం సాంగ్ చేసింది. గోల్ సినిమాలో ఆమె చేసిన బిల్లో రాణి సెన్సేషన్ హిట్టయింది. ఈ సాంగ్‌తోనే విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. సిలంబట్టం (తమిళ) చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి.
(చదవండి: Pushpa 2 Collection: రప్పా రప్పా సరికొత్త రికార్డప్పా)
కొరియోగ్రాఫర్‌తో ప్రేమలో..
దీంతో ఆ మరుసటి ఏడాది కళ్యాణ్ రామ్ కత్తి మూవీ (2010)తో తెలుగులో ప్రవేశించింది. గగనం, మిస్టర్ నూకయ్య మూవీస్ చేసింది. మలయాళ, కన్నడ భాషల్లోనూ సినిమలు చేసింది. దాదాపు 50 వాణిజ్య ప్రకటనల్లోనూ తళుక్కుమని మెరిసింది. 2012లో హిందీ బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో పాల్గొనగా సెకండ్ రన్నరప్ స్థానంతో సరిపెట్టుకుంది. సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్‌తో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని 2019లో పబ్లిక్‌గా వెల్లడించారు.
2020లో సంచలన నిర్ణయం
ఈ జంటపై ఎవరు కళ్లు పడ్డాయో కానీ మరుసటి ఏడాదే విడిపోయారు. ఆ తర్వాత సనా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. 2020లో సనా ఊహించని నిర్ణయం తీసుకుంది. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలనుకున్నట్లు వెల్లడించింది. ఇకమీదట సినిమాలు చేయబోనని ప్రకటించింది. ఈ ప్రకటనతో ఆమె అభిమానులు నిరాశ చెందారు.
ఆ ఫోటోలు షేర్ చేయొద్దని విజ్ఞప్తి
2020 నవంబర్‌లో సనా ముస్లిం మత గురువు ముఫ్తీ అనాస్ సయ్యద్‌ను నిఖా చేసుకుంది. సూరత్‌లో వీరి వివాహం జరిగింది. ఈ జంటకు 2023లో బాబు పుట్టాడు. అతడికి సయ్యద్ తరీఖ్ జమీల్ అని నామకరణం చేశారు. అయితే సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలు షేర్ చేయడం మానుకోమని సనా ఆ మధ్య అభిమానులకు విజ్ఞప్తి చేసింది. తెలియక అలాంటి పాత్రలు చేశానని, దయచేసి ఆ ఫోటోలు ఎవరూ షేర్ చేయొద్దని, కుదిరితే సామాజిక మాధ్యమాల్లోంచి వాటిని డిలీట్ చేయాలని కోరడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment