32 రోజుల్లో రూ.1831 కోట్ల కలెక్షన్స్ సాధించిన పుష్ప 2
‘బాహుబలి–2’ వసూళ్లను అధిగమించిన పుష్పరాజ్
పుష్పరాజ్ (‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌పాత్ర పేరు) అస్సలు తగ్గడం లేదు. వసూళ్ల విషయంలో రప్పా రప్పా అంటూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. కేవలం 32 రోజుల్లోనే ‘పుష్ప 2 : ది రూల్’ ప్రపంచ వ్యాప్తంగా రూ.1831 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్ , రష్మికా మందన్నా జోడీగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేకపాటలో నటించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 5న విడుదలైంది.
అయితే డిసెంబరు 4 నుంచి ప్రీమియర్స్ మొదలైన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్ లలో ‘పుష్ప 2: ది రూల్’ విడుదలైంది. సినిమా రిలీజైన 32 రోజుల్లోనే రూ.1831 కోట్లు గ్రాస్ వసూలు చేసి, రూ.1810 కోట్లు వసూలు చేసిన ‘బాహుబలి–2’ సినిమా వసూళ్లను ‘పుష్ప 2’ అధిగమించి, సరికొత్త రికార్డును క్రియేట్ చేసినట్లు చిత్రబృందం పేర్కొంది.
ఇదిలా ఉంటే.. ఆమీర్‌ఖాన్ నటించిన హిందీ సినిమా ‘దంగల్’ ప్రపంచవ్యాప్తంగా రూ.2 వేల కోట్లకుపైగా వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే రూ.1831 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో ‘పుష్ప 2: ది రూల్’ నిలిచింది. కాగా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో మాత్రం ‘పుష్ప 2: ది రూల్’ మొదటి స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment