అనాథలతో జట్టు | Orphaned Children's Villages Details | Sakshi
Sakshi News home page

అనాథలతో జట్టు

Published Fri, Nov 21 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

అనాథలతో జట్టు

అనాథలతో జట్టు

కష్టాల్లో ఉన్న వారి కన్నీటిని తుడవడం, సాటి వారి బాధకు రెండు కన్నీటి బొట్లను రాల్చడం ఎవరికైనా చేతనైన పని. కానీ కన్నీటి వెనుక కారణం తెలుసుకోవడం, ఆ బాధను రూపుమాపడానికి ప్రయత్నించడం కొందరు మా త్రమే చేసే పని. అలాంటి ‘కొందరు’ వ్యక్తుల్లో ఒకరు జట్టు పారినాయుడు. స్థాపించిన సంస్థ పేరునే ఇంటి పేరుగా మలుచుకున్న ఆయన జీవితం ఓ పాఠం. ఆయన ఎక్కడైతే చీత్కారాలు ఎదుర్కొన్నారో... అక్కడే సత్కారాలు అందు కున్నారు. ఎక్కడైతే ‘నిన్ను చంపేస్తాం’ అన్న బెదిరింపులు విన్నారో... అక్కడే ‘నువ్వు దేవుడివి’ అన్న ప్రశంసలు విన్నారు. ఏ చోటనైతే తండ్రి ప్రేమకు దూరమయ్యారో... అదే చోట పదుల సంఖ్యలో అనాథలకు తండ్రిగా సేవలందిస్తున్నారు. తన జీవిత పయనం గురించి పారినాయుడు ‘సాక్షి’కి తెలిసిన వివరాలు ఆయన మాటల్లోనే...
 
 మాది గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి గ్రామం. మా నాన్న గోపినాయుడుకు ఇద్దరు భార్యలు కావడం వల్ల మా అమ్మ సన్యాసమ్మ వద్ద పెరిగి దాదాపు తండ్రి ప్రేమకు దూరమయ్యాను. అప్పుడే తండ్రి ప్రేమ లేకపోతే ఎలా ఉంటుందో అనుభవించాను. ‘జట్టు’ స్థాపించడానికి అది మొదటి కారణమైంది. చిన్నప్పటి నుంచే సమాజ సేవ చేయాలని నాకుండేది. మంచి ఊరు, అందులో ఓ గ్రంథాలయం, అందరికీ మంచినీరు, సదుపాయాలు ఉండాలనేది నా కల. ఆరేళ్ల నాడు నా ఊహా ప్రపంచం ఇది. రాను రాను ఈ కల నాలో బలపడి ఈ స్థాయికి వచ్చింది. ఐదో తరగతి చదువుతున్నప్పుడే మా ఊరిలో బాల గణపతి ఉత్సవాలను తోటి పిల్లలతో నిర్వహించేవాడిని.
 
 మా ఊరి పొలాలను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం నిర్మించిన వట్టిగెడ్డ రిజర్వాయరు నుంచి వచ్చిన సాగునీటి కోసం రైతుల మధ్య పొడచూపిన విబేధాలు, కొట్లాటల నేపథ్యంలో పేద రైతు నుంచి కారిన ర క్తాన్ని చూసి ఆరో తరగతి చదువుతున్నప్పుడే ‘ఎర్రనీరు’ అనే నాటికను రచించాను. మా ఊరిలోని లెఫ్ట్ సానుభూతిపరులు, ఆ నాటికను ప్రదర్శించడం విశేషం. చదువు తర్వాత గుమ్మలక్ష్మీపురం మండలం గొరడ ప్రాథమిక పా ఠశాలల ప్రధానోపాధ్యాయునిగా 1988లో బాధ్యతలు స్వీ కరించాను. అప్పటి నుంచి సేవా కార్యక్రమాల పరిధి బా గా పెరిగింది. రాత్రి బడులు, కుట్టు శిక్షణా కేంద్రాలు, ప్ర జా సంఘాలు ఏర్పాటు చేయడం వంటి పనులతో బిజీబి జీగా ఉండేవాడిని. గ్రామీణాభివృద్ధి సేవాసంఘం ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య పేరిట ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాం. అలాగే అప్పటి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారుల సహకారంతో గ్రామ గ్రామానికి గిరిజన మహిళా సంఘాలు ఏర్పాటయ్యాయి.
 
 నాటుసారాపై పోరు...
 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే మా చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే అక్రమాలపై పోరాడేవాడిని. అడ్డ పొగా కు, వంట సారాయికి వ్యతిరేకంగా సభలు, సమావేశలు నిర్వహించాను. రాన్రాను వంట సారాయి వ్యతిరేక ఉద్య మం తీవ్రరూపం దాల్చింది. గిరిజన మహిళలు, యువకులు పోరుబాట పట్టారు. అలాగే లోవ ముఠాలో విచ్చల విడిగా చెట్లను నరికి బొగ్గును కాల్చే వ్యాపారం పూర్తిగా ఆగిపోయింది. బుడ్డెంఖర్జ గ్రామంలో జరిగిన సేవాసం ఘం తీర్మానాలు బొగ్గు వ్యాపారస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. అప్పట్లో అక్రమ కలప రవాణాపై కూడా స్థానికులతో కలిసి పోరాటం చేశాం. ఈ పోరాటం ఓ సంచలనమైంది
 
 బెదిరింపులూ వచ్చాయి...
 అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడంతో రాజకీయ నాయకులు చంపేస్తామంటూ బెదిరించడం మొదలుపెట్టారు. అయినా ఎక్కడా ఎప్పుడూ భయపడలేదు. స్థానిక, బడా రాజకీయ వేత్తలు పార్టీలతో నిమిత్తం లేకుండా విజ యనగరం జిల్లా ఎస్సీకి ఫిర్యాదు చేశారు. దీంతో నాపై కొంతమంది కక్ష కట్టి నక్సలైట్ ఇన్‌ఫార్మరంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా పోలీసు యంత్రాంగం నేను పని చేస్తున్న గొరడ గ్రామంలో నేను నివాసముం టున్న ఇంటికి సమీపంలో 30 మంది కానిస్టేబుళ్లు, ఇద్దరు ఎస్‌ఐలు ఒక సీఐతో ఔట్‌పోస్టు ఏర్పాటు చేశారు. గొరడలో జరుగుతున్న కార్యక్రమాలను చూడటానికి వచ్చిన వావిలాల గోపాల క్రిష్ణయ్యకు  స్థానిక విలేకరులు ఇక్కడి పరిస్థితులు వివరించిన తర్వాత ఆయన అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కరరెడ్డికి  సంగతంతా వివరించడంతో జిల్లా అధికారుల్లో మార్పు వ చ్చింది.
 
 అక్షరాస్యతలో భాగస్వామ్యం
 ఈ పోరాటాల తర్వాత నాకు అప్పటి కలెక్టర్ వి.నాగిరెడ్డి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి  కరికా ల్ వళవన్‌లు గిరిజన అక్షరాస్యత కార్యక్రమంలో కన్వీనర్ బాధ్యతలను అప్పగించారు. 1995 లో విజయనగరం కలెక్టరుగా వచ్చిన టి. విజయకుమార్ సహకారంతో ‘మాబడి’ కార్యక్రమాన్ని కమ్యూనిటీ డెవలప్‌మెంట్ పథకం బాధ్యతలను పార్వతీపురం ఏజెన్సీలో విస్తృతంగా అమలు చేశా. అయితే అధికారులతో పాటు పథకాలూ మారుతుండడంతో ఐటీడీఏ కార్యక్రమాలకు దూరమయ్యాను.
 
 గమ్యాన్ని మార్చిన ‘జట్టు’...
  చిన్నప్పటి నుంచి కలగా మిగిలిన జీవిత గమ్యాన్ని చేరుకోవాలన్న లక్ష్యంతో ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 1998 మేలో జట్టు ట్రస్టు ప్రారంభించాను. ట్రస్టు ఆధ్వర్యంలో నెలకొల్పిన జట్టు భావ స మాఖ్య సేవాశ్ర మం ఎందరో అనాధ పిల్లలకు, అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పించింది. ప్రస్తుతం 67 మంది అనాథ బాలలు, 11 మంది వృద్ధులు ఆ శ్రయం పొందుతున్నారు. స్థానిక ప్రజలు సుమారు 40 లక్షల విలువ కలిగిన స్థలాలను భవనాలను విరాళంగా ఇచ్చారు.

 అయితే జట్టు స్థాపిం చిన తర్వాత కూడా నాపై అభియోగాలు ఆగలేదు. ఈ సారి నేను పోలీస్ ఇన్‌ఫార్మర్‌నంటూ ఎవరో తప్పుడు స మాచారం ఇచ్చారు. దీంతో నా అనుచరులైన ముగ్గురు యువకులను నక్సలైట్లు అడవుల్లోకి తీసుకువెళ్లి కొట్టారు. నన్ను ఏజెన్సీ విడిచిపోవాలని చెప్పి పోస్టర్లు అంటించారు. అదే సమయంలో విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జట్టు ట్రస్టుకు ఏ ప్రభుత్వ పథకాలూ మంజూరు చేయరాదని తీర్మానించారు. నక్సలైట్లు ఏజెన్సీ వదిలి వెళ్లిపోమంటే  ఎందుకు వెళ్లలేదని రాజకీయ నాయకులు చర్చలు చేశారు. దీనికి స్పందనగా పత్రికా ముఖంగా కాస్తంత ఘాటుగానే సమాధానం ఇచ్చాను. ఆనాడు నాకు దివంగత ఎస్.ఆర్.శంకరన్, టి. విజయకుమార్, ఎల్.వి. సుబ్రహ్మణ్యం, ఎం. భూపాల్ లాంటి ప్రముఖులతో పాటు  వేలాది మంది గిరిజనులు అండగా నిలిచారు.
 
 జట్టు నుంచి ప్రకృతి ఆది దేవో భవకు...
 2009లో గ్రూప్-1 అధికారిగా పనిచేస్తున్న వి.పద్మజ తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆశ్రమంలోని పిల్లలకు, వృద్ధులకు సేవ చేయడానికి ‘వాలంటీర్’గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో కొంత వెసులుబాటు ఉండడంలో పార్వతీపురం ఆశ్రమానికి దగ్గరలోని తోటపల్లిలో ప్రకృతి ఆది దేవోభవ క్యాంపస్‌ను స్థాపించాను. ఇందులో భాగంగా రెండెకరాల స్థలంలో సేంద్రీయ పద్ధతులతో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులను ఎలా సాధించవచ్చో ప్రజల్లో చైతన్యం కలిగించడానికి దేశంలో ఇప్పటికే నిరూపితమైన నమూనాలను ప్రదర్శన క్షేత్రాలుగా ఏర్పాటు చేశాను.
 
  వాటిలో ముఖ్యమైనవి... ఒక వంగ మొక్కకు 233 వంకాయలు కాసేలా, 10 గుంటల నమూనాలో ఒక సంవత్సరానికి ఒక లక్షా మూడువేల  రూపాయలు అధిక దిగుబడులు సాధించాను. 2010లో సొంత అనుభవాలతో రూపొందించిన ‘అరెకరంలో అన్నపూర్ణ నమూనా’ ను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అత్యుత్తమ ఆహార భద్రతా నమూనాగా గుర్తించి, ఈ నమూనా ను ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలలో అమలు చేయడానికి నిర్ణయించింది. అలాగే జిల్లాలో గ్రం థాలయ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడం మరిచిపోలేని అనుభూతి. ఈ కార్యక్రమంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు వావిలాల గోపాల క్రిష్ణయ్య, ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన గ్రంథాలయ అధికారి ప్రొఫెసర్ నరసింహరాజు, జయంతి రామలక్ష్మణమూర్తి, దామరాజు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నా అనుభవాలతో శాంతియోధులు, త్రివి క్రమం, మనసంఘం, మన విటిడిఏ, ఉద్యమాల జ్వాల వావిలాల, మన ఎరువులు-కషాయాలు, అన్నపూర్ణ,  గిరిజన కళాతరంగిణి, నిజంగానే, బడి నుండి పొలం బడికి ఇంకా అనేక పుస్తకాలను ముద్రించా.  
 
 అవార్డులు... అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతులమీదుగా ‘గిరిజ్యోతి’ అందుకున్నాను. బీజేపీ నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ‘రైతు నేస్తం’, అయ్యంకి వెంకటరమణయ్య అవార్డు,  సత్య గాంధీ-అవార్డు, సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్-హైదరాబాద్ వారిచే  మూడుసార్లు ఎక్స్‌లెన్సీ అవార్డులు, జిల్లా కలెక్టరు ద్వారా రెండుసార్లు ఉత్తమ ఉద్యోగిగా అవార్డులు, బొబ్బిలి- రాజ్యలక్ష్మీ అ వార్డు,  వీటితో పాటు  అనేక సత్కారాలు, సన్మానాలు అందుకున్నాను. ఇవి నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement