హీల్.. సేవే గోల్ | The 'Heel' organization early caree | Sakshi
Sakshi News home page

హీల్.. సేవే గోల్

Published Sat, Jun 21 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM

హీల్.. సేవే గోల్

హీల్.. సేవే గోల్

  • జిల్లాలో హీల్ సేవా ప్రస్థానం ఆరంభం
  •  ఆగిరిపల్లి మండలంలో రూ.50కోట్లతో అనాథ, అంధుల పాఠశాల
  •  అత్యాధునిక వసతులతో నిర్మాణం
  •  ముందుకొచ్చిన ఎన్‌ఆర్‌ఐ దాతలు
  • ఒంటరి అన్న భావన భరించలేనిది. అనాథలా బతకడం భారమైనది. అంతా ఉండి ఎవరూ లేనట్టుగా జీవించడం కష్టమైనది.. జీవితంలో ఇలాంటి నిరాశ, నిస్ప­ృహలు   అలముకుని అనాథలుగా బతుకుతున్న చిన్నారులకు నేనున్నానంటూ భరోసా ఇస్తోంది ‘హీల్’ సంస్థ.   కారు చీకట్లు కమ్ముకున్న జీవితాల్లో అక్షర కాంతులనే వెలుగు దారులు వేస్తోంది. అనాథలు, అంధుల కోసం రూ.50కోట్లతో ప్రత్యేక వసతులు కలిగిన పాఠశాలను నిర్మించి తన సేవా ప్రస్థానానికి పరిమితి లేదని నిరూపించింది.
     
    నరసింగపాలెం (ఆగిరిపల్లి) : అనాథ పిల్లలు, అంధ బాలబాలికల పాలిట వరంగా మారింది హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఫర్ ఆల్ (హీల్) ప్యారడైజ్. అనాథలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోరుు నిరాదరణకు గురైన పిల్లలు, అంధ బాలికలకు ఆశ్రయం కల్పించి విద్యాదానం చేస్తోంది. ఆగిరిపల్లి మండల పరిధిలోని నరసింగపాలెంలో రూపుదిద్దుకుంటున్న ఈ హీల్ ప్యారడైజ్‌లో 1,300 మంది అనాథలు, అంధులు ఆశ్రయం పొందవచ్చు. ఇందులో అత్యాధునిక వసతులతో ఏర్పాటుచేసిన ప్రాథమిక పాఠశాల గత బుధవారమే ప్రారంభమైంది.
     
    ‘హీల్’ ప్రారంభమైంది ఇలా..


    1992లో యూకేలో హీల్ సంస్థ ప్రారంభమైంది. విజయవాడలోని పటమటకు చెందిన కోనేరు సత్యప్రసాద్ ఫౌండర్, చైర్మన్‌గా 1993లో గుంటూరులో హీల్-ఇండియా మొదలైంది. అనంతరం గుంటూరు జిల్లా చోడవరంలో హీల్ విలేజ్ ఏర్పాటుచేశారు. అక్కడ నిర్మించిన ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 250 మంది అనాథలు చదువుకుంటున్నారు. వీరికి ఉన్నత చదువులతో పాటు బయటి కళాశాలల్లో చదువుతున్న మరో 250మంది పేద విద్యార్థులకు అవసరమైన ఫీజులు, ఇతర అవసరాలను హీల్ సంస్థే చూసుకుంటుంది.
     
     జిల్లాలో సేవా ప్రస్థానం

     కృష్ణాజిల్లాలోని కానూరు జెడ్పీ పాఠశాలను 2009లో దత్తత తీసుకోవడంతో ఇక్కడ హీల్ తన సేవా  ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ స్కూల్ విద్యార్థులకు కావాల్సిన నోట్ పుస్తకాలు, బ్యాగులు, ఫీజులను ఆ సంస్థే చెల్లించింది. సైన్స్ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు  చేసింది. తరువాతి ప్రయత్నంగా ఆగిరిపల్లి మండల పరిధిలోని నరసింగపాలెంలో ఎటువంటి ప్రభుత్వ సహకారం లేకుండా, దాతల ప్రోత్సాహంతో రూ.50 కోట్లతో హీల్ ప్యారడైజ్‌కు శ్రీకారం చుట్టింది.
     
     ఎంతోమంది దాతల సహకారంతో...

    రూ.50 కోట్లతో నిర్మిస్తున్న ఈ హీల్ ప్యారడైజ్‌లో సుమారు 1,300 మంది అనాథ, అంధ విద్యార్థుల కోసం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, కిండర్ గార్డెన్, ఆరోగ్య కేంద్రం, ఇంటిగ్రేటెడ్ ఒకేషనల్ సెంటర్, అంధ పాఠశాల ఏర్పాటుచేయనున్నారు.
     
     ప్రాథమిక పాఠశాలను హీల్ ఇండియా వ్యవస్థాపకుడు కోనేరు సత్యప్రసాద్ తన తల్లిదండ్రులు లలిత, రామ కృష్ణారావు జ్ఞాపకార్థం ఇచ్చిన విరాళంతో నిర్మించారు. ఇక్కడ 400 మంది విద్యార్థులకు ఆంగ్లంలో సెంట్రల్ సిలబస్ బోధిస్తారు.
     
     బాలబాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యం ఉండేలా ఢిల్లీకి చెందిన హాన్స్ ఇండియా ప్రత్యేక అత్యాధునిక భవనాన్ని నిర్మిస్తోంది. హీల్ ప్యారడైజ్‌లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, అంధుల పాఠశాల, కిండర్ గార్డెన్, ఒకేషనల్ శిక్షణా కేంద్రానికి చెందిన విద్యార్థులకు హీల్ ఆధ్వర్యంలోనే వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు.
     
     అంధుల పాఠశాలను ప్రవాస భారతీయుడు చుండూరి ధనుంజయరావు దంపతులు వారి కుమారుడు ఫణీంద్ర పేరు మీద అందించే విరాళంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ వందమంది అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపిలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువు చెబుతారు.
     
    ఇంటిగ్రేటెడ్ ఒకేషనల్ శిక్షణా కేంద్రాన్ని ప్రవాస భారతీయుడు చుండూరి కృష్ణబాబు తన తల్లి పేరు మీద అందించే విరాళంతో నిర్మిస్తున్నారు.
     
    కంప్యూటర్ కోర్సులతో పాటు ఇతర వృత్తివిద్యా కోర్సులపై 150 మందికి శిక్షణ ఇచ్చేందుకు ప్రవాస భారతీయులు డాక్టర్ బెల్లం శివప్రసాద్, విజయ దంపతులు విరాళం ఇచ్చారు. ఈ మేరకు కోటి రూపాయల విరాళాన్ని వారి కుమారుడు కృష్ణ హీల్ ప్యారడైజ్ చైర్మన్ పిన్నమేనేని ధనప్రకాశ్‌కు గత బుధవారం జరిగిన కార్యక్రమంలో అందజేశారు.
     
    ఇందులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ఆగిరిపల్లి, గన్నవరం మండలాల్లోని 30 గ్రామాలను దత్తత తీసుకుని మొబైల్ వైద్యసేవలు అందించనున్నారు. దీని నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.
     
    అలాగే, కిండర్‌గార్డెన్ పాఠశాలను ప్రవాస భారతీయులు పిన్నమనేని కవిత, లెనిన్ దంపతుల విరాళంతో నిర్మిస్తున్నారు.
     
     హీల్ ప్యారడైజ్ నిర్వహణ కార్యాలయ భవనాన్ని పిన్నమనేని ధనప్రకాశ్ విరాళంతో నిర్మించనున్నారు.
     
     అనాథలకే ప్రథమ ప్రాధాన్యం
     హీల్ ప్యారడైజ్‌లోని ప్రాథమిక పాఠశాలలో ప్రవేశానికి ప్రప్రథమంగా అనాథలు, రెండో ప్రాధాన్యం కింద తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయిన పిల్లలు, మూడో ప్రాధాన్యం కింద ఆర్థిక స్థోమత లేని ఆశక్తులైన తల్లిదండ్రులు కలిగిన పిల్లలకు అర్హత కల్పిస్తాం. ఇందులో ప్రవేశం కావాలనుకునేవారు చిరునామా తెలిపే రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, సంరక్షకుని వివరాలు ముందుగానే అందజేయాలి. వివరాలకు 0866-2842777, 8500122577 నంబర్లను సంప్రదించాలి. ఈ విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలలో 200 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నాం. మరో నాలుగు నెలల్లో వసతిగృహం, అంధుల పాఠశాల, ఒకేషనల్ శిక్షణా కేంద్రాలు పూర్తవుతాయి. వచ్చే ఏడాదికి ప్రాథమికోన్నత పాఠశాల, కిండర్‌గార్డెన్ పాఠశాల, ఆరోగ్య కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టి హీల్ ప్యారడైజ్ పరిపూర్ణంగా అందుబాటులోకి వస్తుంది.
     - పిన్నమనేని ధనప్రకాశ్, మోడల్ డెయిరీ చైర్మన్, హీల్ ప్యారడైజ్ చైర్మన్
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement