తానే అదనపు ఈఓగా చెలరేగిపోతున్న లోకేశ్ బంటు
ఏ అధికారం లేకపోయినా టీటీడీలో పెత్తనం
కొద్దినెలలుగా అదనపు ఈఓ కార్యాలయంలోనే తిష్ట
దాతలిచ్చే విలువైన కానుకలపై లక్ష్మణ్ ప్రత్యేక దృష్టి
పరకామణి, పోటు, విరాళాలు, టీటీడీ ఈ–ఫైల్స్, టీటీడీ టెండర్లపైనా పర్యవేక్షణ
ప్రతీ ముఖ్య సమావేశంలోనూ పెద్దపీట.. అదనపు ఈఓ ఆఫీస్‌లోనే అపవిత్ర పనులు చేస్తున్నట్లు సిబ్బంది ఆరోపణ
అమరావతి: తిరుమల తిరుపతి దేవ స్థానం (టీటీడీ)లో ప్రైవేట్ వ్యక్తుల హవాకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. 2014– 19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న వేమూరి హరికృష్ణ ఓ పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో దేవస్థానంలో చక్రం తిప్పుతుంటే మరోవైపు లోకేశ్ మనిషిగా ముద్రపడ్డ లక్ష్మణ్‌కుమార్ ఏకంగా ‘సూడో’ అదనపు ఈఓగా చెలరేగిపోతున్నారు. అదన ఈఓ వెంకయ్య చౌదరి పక్కనే ఈయనకు కుర్చీవేసి ప్రొటోకాల్ మర్యాదలు అందిస్తున్నారంటే ఈయన హవా ఏ స్థాయిలో నడుస్తోందో అర్థంచేసుకోవచ్చు.
లక్ష్మణ్‌కుమార్‌కు ఛాంబర్, వాహనం, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఏ అధికారిక ఉత్తర్వులు లేకపోయినా టీటీడీలో తిష్టవేసి అందరినీ శాసిస్తున్న లక్ష్మణ్‌కుమార్ వ్యవహారం ఇప్పుడు టీటీడీలో హాట్ టాపిక్. టీటీడీలో ఎలాంటి ఉత్తర్వుల్లేకుండా అధికారిక సమావేశంలో పాలొ్గనడం, ఏఈఓతోపాటు సమీక్షల్లో ఉండడం.. నిఘా, ముఖ్యభద్రతాధికారి పాల్గొన్న సమావేశానికీ హాజరైన ఈ సూడో అడిషనల్ ఈఓ కథా కమామిషు ఇదీ..
అంతటా ఆయనే..
సీఎం కార్యాలయం నుంచి వచ్చే సిఫార్సు లేఖలతో పాటు, టీటీడీకి ప్రపంచం నలుమూలలు నుంచి వచ్చి దాతలిచ్చే విలువైన కానుక లపై ఈ సూడో ఏఈఓ ప్రత్యేక దృష్టిపెట్టినట్లు సమాచారం. కొందరు అజ్ఞాత భక్తులు స్వామివారికి కానుకలిచ్చే సమయంలో తమ పేరు చెప్పడానికి సైతం ఇష్టపడరు. అలాంటి వాటిపై సూడో ఏఈఓ అవతారమెత్తిన లక్ష్మణ్‌కుమార్ ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి నాడు విద్యుత్ దీపాలంకరణ బాధ్యతను దాత సహాయంతో అంతా లక్ష్మణ్‌కుమారే నడిపించినట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి.
ఆయన చూస్తేనే అదనపు ఈఓ సిఫారసు..
తిరుమలలో అదనపు ఈఓ కార్యాలయంలో ఏ పని జరగాలన్న లక్ష్మణ్‌కుమార్ కనుసన్నల్లోనే జరగాలని.. ఆ తర్వాతే ఏఈఓ వెంకయ్యచౌదరి సంతకాలు చేస్తారని టీటీడీ ఉద్యోగులు చెబుతున్నారు. అసలు ఏ అర్హతతో ఈయన్ను ఏఈఓ కార్యాలయంలో ప్రత్యేక చాంబర్ ఏర్పాటుచేయాల్సి వచ్చింది? స్పెషల్ టైప్–05 నెంబర్ గెస్ట్‌హౌస్‌ను ఆయనకు ఎందుకు నివాసంగా ఏర్పాటుచేశారని వారు చర్చించుకుంటున్నారు. పైగా.. ఈయన ఏఈఓ కార్యాలయంలోనే అపవిత్ర కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తామేంచేసినా చెల్లుబాటవుతుందనేలా వీరు రాజ్యాంగేతర శక్తులుగా అవతరిస్తున్నారు. వ్యవస్థల్ని శాసిస్తూ, దోచుకునేందుకు తిరుమల కొండపై తిష్టవేశారని ఉద్యోగులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇక తిరుమలను ప్రక్షాళన చేస్తానంటూ ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబునాయుడు.. అధికారంలోకి వచ్చాక టీటీడీని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పెట్ట డమే ప్రక్షాళనా అని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
అదనపు ఈఓకు అనుభవంలేకపోవడంతో..
నిజానికి.. టీటీడీ అదనపు ఈఓగా ఉన్న వెంకయ్యచౌదరికి పాలనా అనుభవంలేకపోవడం, నిత్యం కార్యాలయ పనులపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో లక్ష్మణ్‌కుమార్ సూడో అడిషనల్ ఈఓ చెలామణి అవుతున్నారు. అసలు కస్టమ్స్ ఆఫీసర్‌గా పనిచేసిన వ్యక్తిని టీటీడీ అదనపు ఈఓగా ఎలా నియమిస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. పైగా.. తిరుమలలో జేఈఓ కార్యాలయంలో పనిచేసేందుకు ఐఏఎస్ అధికారులు ఎవరూ లేన్నట్లు ఐఆర్‌ఎస్ అధికారిని అదనపు ఈఓగా తీసుకురావడం.. దీనికితోడు మరో సూడో అదనపు ఈఓకు పెత్తనం ఇవ్వడం పవిత్ర తిరుమల భ్రష్టుపట్టిపోవడానికి దారితీస్తోందని కార్యాలయ సిబ్బంది మండిపడుతున్నారు.
తిరుమలను చెప్పుచేతల్లో పెట్టుకునేందుకే..
టీటీడీకి సంబంధించిన ప్రతి విషయం ఎంతో గోప్యంగా, భద్రంగా ఉంటుంది. కానీ, చంద్రబాబు ఈ మొత్తం వ్యవస్థను తన చెప్పుచేతుల్లో పెట్టుకునేందుకే లక్ష్మణ్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన పరకామణి, పోటు, దాతలిచ్చే విరాళాలు, టీటీడీ ఈ– ఫైల్స్, టీటీడీ టెండర్లు తదితర వాటిపై పెత్తనం సాగిస్తున్నారు. రహస్య సమాచారం అంతా ఆయన చేతుల్లోకి తీసుకున్నారు. అలాగే, సిఫార్సు లేఖలు కూడా ఎవరికివ్వాలి, ఎవరికి ఇవ్వకూడదనే విషయాలనూ ఆయనే చూసుకుంటున్నారు.
ఈయన చూసి ఓకే చేసిన తర్వాతే టీటీడీ ఏఈఓ, ఈఓ నిర్ణయం తీసుకునేలా వ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. ఇలా కీలక వ్యవహారాలన్నీ చంద్రబాబు ఓ ప్రైవేట్ వ్యక్తికి అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలో ఏ స్కాం జరిగినా బయటకు రాకుండా వ్యవస్థను ఏర్పరుచుకున్నారని టీటీడీ సిబ్బంది చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment