నడివీధులే నివాసాలు | Orphaned Children in mumbai | Sakshi
Sakshi News home page

నడివీధులే నివాసాలు

Published Wed, Dec 4 2013 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM

Orphaned Children in mumbai

సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై ఎంతగా అభివృద్ధి చెందుతున్నా, ఈ మహానగరంలో పేదలు, నిర్వాసితులకు వసతి దొరకడం అసాధ్యంగా మారుతోంది. ఇప్పటికీ 37 వేల మంది పేద పిల్లలు రోడ్లపైనే ఉంటున్నారని ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఇందులో 24.4 శాతం పిల్లలు బాల కార్మికులు కాగా, 15 శాతం పిల్లలు మత్తుపదార్థాలకు బానిసలయ్యారు. టాటా సమాజ్ విజ్ఞాన్ సంస్థ, యాక్షన్ ఎయిడ్ ఇండియా అనే రెండు సామాజిక సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో పలు విభ్రాంతికర వాస్తవాలు బయటికి వచ్చాయి. వీటి నివేదిక ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
 
 ఫ్లై ఓవర్ల కింద బతుకీడుస్తున్న బాలల్లో 44 శాతం పిల్లలు మానసిక, శారీరక, లైంగిక హింసకు గురవుతున్నారు. నగర రహదారులు, బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్ల వంటి ప్రదేశాల్లో మొత్తం 36,154 మంది పిల్లలు నివసిస్తుండగా వీరిలో 70 శాతం బాలురు, 30 శాతం బాలికలు ఉన్నారు. కాగా 905 మంది పిల్లలు రైల్వే స్టేషన్లలోని ప్లాట్‌ఫారాలపై నివాసముంటున్నట్లు తెలిసింది.   పాఠశాలకు వెళ్లే వయసున్న పిల్లల్లో 24 శాతం మంది నిరక్షరాస్యులే. నాలుగు నుంచి ఆరు సంవత్సరాల వయసున్న 31 శాతం మంది పిల్లలు ఆంగన్‌వాడీ పాఠశాలలకు వెళుతున్నారు. బాలకార్మికుల్లో ఎక్కువ మంది రోడ్లపై పూలు, దినపత్రికలు విక్రయిస్తుంటారు. మరికొందరు హోటల్, భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్నారు. మరికొందరు భిక్షాటన చేసి డబ్బు సంపాధించి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. అయినప్పటికి 25 శాతం మంది పిల్లలకు రెండు పూటలా భోజనం సరిగా లభించడంలేదని ఈ అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో ‘పే అండ్ యూజ్’ సులభ్ కాంప్లెక్స్‌లు వాడే పిల్లలు 50 శాతం మంది కాగా, సార్వజనిక మరుగుదొడ్లు వాడే పిల్లలు 40.2 శాతం మంది ఉన్నారు. మత్తుపదార్థాలకు బానిసలైన 15 శాతం పిల్లలు తంబాకు, సిగరెట్లు, నాటుసారా, గుట్కా, వెటైనర్ (సిరా తొలగించేది) లాంటివి సేవిస్తున్నట్లు తెలిసింది. వీటిని ఉపయోగించడం వల్ల రోజంతా పడిన శ్రమ మర్చిపోయి మత్తులోకి జారుకుంటారు. 2008 నవంబరు 26న ఉగ్రవాదులు నగరంలో దాడులు జరిపిన తరువాత భద్రతా కారణాల దృష్ట్యా నగర రహదారులపై అక్రమంగా నివాసముంటున్న పేదలను ఖాళీ చేయించారు. దీంతో కొందరు శివారు ప్రాంతాలకు, మరికొందరు స్వగ్రామాలకు తరలిపోయారు. ఫలితంగా రహదారులపై నివాసముండే పేదల సంఖ్య అప్పట్లో గణనీయంగా తగ్గింది. కాలక్రమేణా పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. రోడ్లపై నివాసముంటున్న పేదలకు కొన్ని స్వయంసేవా సంస్థలు అండగా ఉంటున్నాయనే విషయం వారిలో చాలామందికి తెలియదు.
 
 దీంతో కొందరు నిర్వాసితులు జంక్షన్లు, రైల్వే స్టేషన్ పరిసరాలు, లోకల్‌రైళ్లు, ప్రార్థన మందిరాలు, ఇతర ధార్మిక స్థలాలు, బస్టాండ్లు, మార్కెట్లు తదితర ప్రాంతాల్లో ఉంటున్నారు. పిల్లలతోపాటు పెద్దలూ ఈ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తుంటారు. మరికొందరు బాలలను అద్దెకు తీసుకుని వారితో బిచ్చమెత్తిస్తుంటారు. ఇందుకోసం బాలలను కిడ్నాప్ చేసే ముఠాలు కూడా ముంబైలో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. పసివాళ్లపై జాలిపడి బిచ్చం వేస్తారు కాబట్టే ఈ దురాచారం పెరుగుతోందని తెలిపారు. సదరు బాలలకు సంపాదనలో కొంత చెల్లించడం, ఆలనాపాలనా చూసుకునే బాధ్యత కూడా అద్దెకు తెచ్చే వారిపైనే ఉంటుంది. ఎలాంటి శ్రమ లేకుండా డబ్బులు సంపాదించేందుకు సులభమైన మార్గం అడుక్కోవడమే కావడంతో చాలామంది పేదలు యాచక వృత్తినే ఎంచుకుంటున్నట్లు ఈ రెండు సంస్థలు తమ నివేదికలో వెల్లడించాయి. ఈ సమస్యలపై ప్రభుత్వం తక్షణం దృష్టి సారించాలని కోరాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement