చెరువులను అనుసంధానించండి
కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతికి హరీశ్‌రావు విజ్ఞప్తి
న్యూఢిల్లీ: దేశంలోని నదులను అనుసంధానించడంతో పాటు చెరువుల అనుసంధానానికి కూడా కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. నదుల అనుసంధానంతో పోలిస్తే చెరువుల అనుసంధానం తక్కువ సమయంలోనే పూర్తవడంతోపాటు ప్రజలకు సత్వర ఫలితాలు ఇస్తుందని పేర్కొన్నారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ‘జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)’ నిర్వహించిన సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని.. తెలంగాణ ప్రభుత్వం తరఫున పలు ప్రతిపాదనలు చేశారు. అనంతరం సాయంత్రం ఉమాభారతితో, కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్‌గంగ్వార్‌తో వేర్వేరుగా సమావేశమై పలు విజ్ఞప్తులు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
తెలంగాణకు అన్యాయం చేయొద్దు..
దేశంలోని నదుల అభివృద్ధితో పాటు హిమాలయ, ద్వీపకల్ప నదుల అనుసంధానంపై చర్చలో తెలంగాణ తరఫున పలు అంశాలను కేంద్రం దృష్టికి తెచ్చామని హరీశ్‌రావు చెప్పారు. తెలంగాణ సాగునీటి అవసరాలు తీరకుండా నీళ్లను పక్క ప్రాంతాలకు మళ్లించడానికి అంగీకరించబోమని స్పష్టం చేశామన్నారు. నదుల అనుసంధానానికి పదేళ్లకుపైగా పడుతుండగా చెరువుల అనుసంధానం ఏడాదిన్నరలోగా పూర్తిచేయొచ్చని అన్నారు.
జాతీయ హోదా ఇవ్వాలి..
ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర అనుమతులు వెంటనే వచ్చేలా చొరవ తీసుకోవాలని కోరినట్లు హరీశ్ వెల్లడించారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు, జాతీయ హోదా ఇస్తామని మంత్రి సలహాదారుడు వెదిరె శ్రీరాం సమక్షంలో హమీ ఇచ్చినట్టు తెలిపారు. భూగర్భజలాలను పెంపులో భాగంగా చెరువుల పునరుద్ధరణకు రూ. 248 కోట్లను గ్రాంటుగా ఇవ్వాలని కోరగా.. పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. దేవాదుల ప్రాజెక్టులో ఏఐబీపీ వాటా కింద తెలంగాణకు రావాల్సిన రూ. 112 కోట్లను విడుదల చేయాలని కోరగా ఆదేశాలిచ్చారని చెప్పారు.
సీసీఐ కేంద్రాలు పెంచండి..
తెలంగాణలో వెంటనే సీసీఐ కొనుగోలు కేంద్రాలను తెరిపించాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్‌ను హరీశ్ కోరారు. తక్షణమే 75 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తమ ముందే సీసీఐ చైర్మన్‌ను ఆయన ఆదేశించారని చెప్పారు. పత్తికి రూ. 4,050 మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరగా దానికి మంత్రి హామీ ఇచ్చారని హరీశ్ చెప్పారు.