కడెం : కడెం ప్రాజెక్టు ఆయకట్టు రైతన్నలకో శుభవార్త. ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు గురువారం నీటిని వదలనున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఈ సారి కాస్త ఆలస్యంగా కడెం ప్రాజెక్టులోకి నీరు చేరింది. ప్రాజెక్టు మీద ఆశతో ఆయకట్టు రైతులు ఖరీఫ్‌లో వరినారు పోసుకున్నారు. సీజన్ ప్రారంభంలో వర్షాలు కురవక.. ప్రాజెక్టులోకి నీరు చేరక నారుమడులు ఎండిపోయాయి.
మరికొన్ని మడులు ముదిరి పశువులకు మేతగా మారాయి. బావుల కింద సాగు చేస్తున్న చేలు సైతం ఎండిపోయే దశకు చేరా యి. ఈ క్రమంలో వారం రోజుల నుంచి జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి భారీగానే వరద నీరు చేరింది. ప్రాజెక్టు నీటిమట్టం 692 అడుగులకు చేరింది. జలాశయంలో 5.5 టీఎంసీల నీరుంది. దీంతో పంటలకు ప్రాజెక్టు నీటిని వదిలి ఆదుకోవాలని రైతులు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ జగన్మోహన్, రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావులను ఎమ్మెల్యే రేఖానాయక్ కలిసి పరిస్థితి వివరించారు.
ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం కడెం ఆయకట్టు పరిధిలోని నీటి సంఘాల చైర్మన్లతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి, నీటి విడుదలపై చర్చించారు. చివరికి జలాశయంలో ఉన్న నీటిని కేవలం డీ-10(కలమడుగు) వరకు మాత్రమే వదలాలని, మిగతా ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు నింపాలని తీర్మానించారు. ఈ మేరకు కడెం ప్రాజెక్టు ఆయకట్టు కిందనున్న డీ-10 వరకు గురువారం ఉదయం 8.30 గంటలకు నీటిని విడుదల చేస్తామని ప్రాజెక్టు డీఈ నూరొద్దీన్ తెలిపారు. ఎడమ కాలువ ద్వారా 4 అడుగులు, కుడి కాలువ ద్వారా 15 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి దశల వారీగా ప్రవాహాన్ని పెంచుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్, మంచిర్యాల ఎమ్మెల్యేలు రేఖానాయక్, దివాకర్‌రావు హాజరుకానున్నారని తెలిపారు.
నేడు ‘కడెం’ ఆయకట్టుకు నీటి విడుదల
Published Thu, Sep 4 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM
Advertisement
Advertisement