వారం రోజుల్లో దేవాదుల రీ ఇంజనీరింగ్
- ప్రతిపాదనలు సిద్ధం చేయండి
- అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్ ప్రతిపాదనలను వారం రోజుల్లో పూర్తి చేసి ప్రభుత్వానికి సమర్పించాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లాలోని జనగామ, పాలకుర్తి నియోజకవర్గాలకు ఇందిరమ్మ వరద కాల్వ ద్వారా నీటిని సరఫరా చేసే విషయాన్ని పరిశీలన చేయాలని సూచించారు. దేవాదుల, దుమ్ముగూడెం ఎల్లంపల్లి ప్రాజెక్టుల పురోగతిపై శనివారం 9 గంటలపాటు హరీశ్ రావు సుదీర్ఘంగా సమీక్షించారు.
ఇందులో శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్‌లతో పాటు సీఈలు వెంకటేశ్వర్లు, అనిల్‌కుమార్, ఓఎస్డీ శ్రీధర్‌దేశ్‌పాండేలు పాల్గొన్నారు. దేవాదుల మూడో దశ రెండో ప్యాకేజీ పనుల్లో భీంఘన్‌పూర్ జలాశయం నుంచి రామప్ప జలాశయం వరకు నీటిని పంప్ చేయాల్సి ఉందని, సొరంగ తవ్వకాల కోసం బ్లాస్టింగ్స్ వలన రామప్ప గుడికి ముప్పుందని వరంగల్ జిల్లా ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమైనందున ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్‌కు ప్రభుత్వం ఆదేశించిందన్నారు. పనుల తీరు మారినందున కాంట్రాక్టర సమస్యలను పరిష్కరించడానికి చర్చలు జరుగుతున్నాయని హరీశ్ తెలిపారు. 2017 జూన్ నాటికి పనులు పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు.
కాంట్రాక్టు రద్దు చేసుకోండి
దుమ్ముగూడెం ప్రాజెక్టు సమీక్షలో కాంట్రాక్ట్ క్లోజర్‌కు సంబంధించిన సమస్యలపై చర్చించారు. ఒప్పంద రద్దుకు అంగీకరిస్తే కాంట్రాక్టర్లకు బ్యాంకు గ్యారంటీ సెక్యూరిటీ డిపాజిట్లు, ఇన్స్యూరెన్స్ నిధులు, చెల్లించిన బ్యాంకు కమీషన్లను తిరిగి చెల్లించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని మంత్రి తెలిపారు.
ఎల్లంపల్లిలో 20 టీఎంసీల నిల్వ
ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీక్ష సందర్భంగా, వచ్చే సీజన్ నాటికి జలాశయాన్ని 148 మీటర్ల వరకు నింపి 20 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. హైదరాబాద్‌కు నీటి సరఫరా, ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తికి ఎల్లంపల్లి కీలకంగా ఉందని, ప్రాజెక్టు పరిధిలో మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.