అన్నవరం రైల్వేప్లాట్‌ఫాం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: దాదాపు పదేళ్లపాటు పడకేసిన కాకినాడ ఎస్‌ఈజడ్‌లో పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పన పనులు ఇప్పుడు ఊపందుకున్నాయి. కాకినాడ తీరంలో తొండంగి వద్ద నిర్మాణంలో ఉన్న కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్ (కేజీపీఎల్)ను మెయిన్ రైల్వేలైన్‌తో అనుసందానించే ప్రక్రియ ఎట్టకేలకు పట్టాలెక్కుతోంది. ఇందుకోసం కేజీపీఎల్ నుంచి అన్నవరం వరకు 15 కిలోమీటర్లు మేర ప్రత్యేక రైల్వేలైన్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు.
ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే కూడా ఇందుకు పచ్చజెండా ఊపింది. ప్రత్యేక రైల్వేలైన్‌తో పాటు దశాబ్దాల కాలంగా సత్యదేవుని భక్తుల కలగా మిగిలిన అన్నవరం రైల్వేస్టేషన్ ఆధునీకరణను కూడా చేపడుతున్నారు. ఇందుకోసం సుమారు రూ.300 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తం రైల్వే పనులను కేజీపీఎల్ సొంతంగా చేపడుతోంది.
సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు
నిజానికి.. చంద్రబాబు హయాంలో మౌలిక సదుపాయాల కల్పనను అటకెక్కించేశారు. కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో బహుళ జాతి కంపెనీలు, ఎగుమతి, దిగుమతి ఆధారిత పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఇలా వస్తున్న పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో పద్ధతిలో అన్ని అనుమతులు ఇస్తోంది.
మరోవైపు.. కేజీపీఎల్‌కు ప్రత్యేక రైల్వేలైన్ కోసం 90 ఎకరాల భూసేకరణకు రైతులతో చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా.. విజయవాడ–విశాఖపట్నం మధ్య అన్నవరం రైల్వేస్టేషన్ నుండి కేజీపీఎల్ వరకు 15 కిలోమీటర్ల మేర సరుకు రవాణా కోసం ప్రత్యేక రైల్వేట్రాక్ నిర్మించనున్నారు. ఇక ప్రాజెక్టులో భాగంగా అన్నవరం రైల్వేస్టేషన్, ప్లాట్‌ఫారమ్‌లతో పాటు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సిగ్నలింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటుచేయనున్నారు.
ఇందుకు దక్షిణ మధ్య రైల్వే నుంచి ఇప్పటికే అన్ని రకాల అనుమతులు వచ్చాయి. వచ్చేనెలలో పనులు మొదలు కానున్నాయి. ఈ రైల్వే ప్రాజెక్టు నిర్మాణంతో కాకినాడ గేట్‌వే పోర్టుకు ప్రతిరోజు 16వేల టన్నుల సామర్థ్యం కలిగిన బొగ్గు, ఎరువులతో పాటు కంటైనర్‌లలో ఆయిల్, ఎల్‌ఎన్‌జీ రవాణా కానుంది. తొలిదశలో నాలుగు గూడ్స్ రైళ్లను నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు.
చదవండి: ‘జగన్‌బాబు దేవుడయ్యా.. మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు’
ఈ రైల్వేలైన్ కేఎస్‌ఈజెడ్‌లో ఏర్పాటవుతున్న కేజీపీఎల్, బల్‌్కడ్రగ్ పార్కు, అరబిందో పెన్సిలిన్ జీ, దివీస్ తదితర పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడుతుంది. వీటిపై కేఎస్‌ఈజెడ్ ప్రాజెక్టు హెడ్ గరుడ సీతారామయ్య స్పందిస్తూ.. రైల్వేస్టేషన్, రైల్వేట్రాక్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. దక్షిణ మధ్య రైల్వే నుంచి అనుమతులు కూడా లభించాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment