కర్నూలు-మంత్రాలయం లైన్ రీసర్వే చేపట్టండి
- అమరావతి సమావేశంలో రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ను కోరిన ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు(ఓల్డ్‌సిటీ): కర్నూలు- మంత్రాలయం రైల్వే లైన్ నిర్మాణానికి రీసర్వే నిర్వహించాలని ఎంపీ బుట్టా రేణుక కోరారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ మంగళవారం అమరావతిలో నిర్వహించిన సమావేశానికి ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ కర్నూలు రైల్వే స్టేషన్‌ను మాడరన్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు త్వరగా చేపట్టాలని జీఎంను కోరారు. కర్నూలు, మద్దికెర, కోసిగి స్టేషన్లలో అదనపు రిజర్వేషన్ కౌంటర్లు, ఆదోని క్రాంతినగర్ వద్ద రైల్వే ఫుట్‌ఓవర్ బ్రిడ్జీ, వెంకట్రాది ఎక్స్‌ప్రెస్‌కు రద్దీ దృష్ట్యా అదనపు రైలు ఏర్పాటు చేయాలని కోరారు. కర్నూలు- అమరావతి లైన్ నిర్మాణంతో పాటు కొత్త ట్రైన్స్ నడపాలన్నారు. బుట్టా రేణుక ప్రతిపాదనలపై జీఎం వినోద్‌కుమార్ యాదవ్ సానుకూలంగా స్పందించినట్లు మంగళవారం ఎంపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.