యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌.. ‘పెద్దపల్లి బైపాస్‌’కు | - | Sakshi
Sakshi News home page

యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌.. ‘పెద్దపల్లి బైపాస్‌’కు

Published Wed, Aug 23 2023 1:34 AM | Last Updated on Wed, Aug 23 2023 12:00 PM

లైన్‌ క్లియర్‌ - Sakshi

లైన్‌ క్లియర్‌

సాక్షి ప్రతినిధి,కరీంనగర్‌: ఎన్నో దశాబ్దాలుగా కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌, ముంబై వంటి నగరాలకు రైలులో వెళ్లాలన్న పాత కరీంనగర్‌ వాసుల కల త్వరలో సాకారం కానుంది. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌–కాజీపేట–బల్లార్షా సెక్షన్‌ను పెద్దపల్లి–కరీంనగర్‌–ముంబై సెక్షన్‌ లైన్‌తో కలపనుంది. ఇటీవల పెద్దపల్లి–కరీంనగర్‌ మార్గాన్ని డబ్లింగ్‌ లైన్‌గా అప్‌గ్రేడ్‌ చేసేందుకు ముందుకు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా.. కాజీపేట–బల్లార్షా, కరీంనగర్‌–పెద్దపల్లి లైన్లను కలపడం ద్వారా ఈ సెక్షన్‌లోని రైల్వే ప్రయాణంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది.

భూమి ఇచ్చేందుకు రైతుల అంగీకారం
పెద్దపల్లి జిల్లాలోని చీకురాయి–పెద్దబొంకూరు గ్రామాల మధ్య పెద్దపల్లి బైపాస్‌ పేరుతో కొత్త రైల్వేస్టేషన్‌ నిర్మించతలపెట్టారు. ఇందుకోసం ఇటీవల రెండు గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. దాదాపు 20 ఎకరాల వరకు భూమిని ఇచ్చేందుకు రైతులు అంగీకరించారు. వారికి పరిహారం ఇచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. రైల్వేస్టేషన్‌ నిర్మాణంలో భాగంగా ముందుగా ఎలక్ట్రిక్‌ లైన్‌ నిర్మించేందుకు ఇటీవల టెండర్లు పిలిచింది. త్వరలోనే స్టేషన్‌ నిర్మాణం కోసం టెండర్లు పిలవనుంది. చీకురాయి–పెద్దబొంకూరుల మధ్య పాయింట్‌ను వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు.

ఇది కాజీపేట–బల్లార్షా లైన్‌తో కరీంనగర్‌–పెద్దపల్లి లైన్‌ కలిసే ప్రాంతం. ఇంతకాలం ఒక రైలు కరీంనగర్‌ మీదుగా కాజీపేట/సికింద్రాబాద్‌ వైపు వెళ్లాలంటే ముందు పెద్దపల్లి జంక్షన్‌ చేరాలి. అక్కడ బోగీల ముందు ఉన్న ఇంజిన్‌ విడిపించుకొని, ముందుకు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి కాజీపేట వైపు ఉన్న బోగీలను లింక్‌ చేసుకొని వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు పెద్దపల్లి బైపాస్‌ రైల్వేస్టేషన్‌ పూర్తయితే కాజీపేట వైపు వెళ్లే రైళ్లన్నీ కొత్త స్టేషన్‌ మీదుగా ఎలాంటి ఇంజిన్‌ మార్పులు అవసరం లేకుండా సాఫీగా సాగిపోతాయి. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌వాసులకు కాజీపేట/వరంగల్‌/సికింద్రాబాద్‌ వైపు ప్రయాణం మరింత సులువు కానుంది.

గణనీయంగా పెరిగిన ఫ్రీక్వెన్సీ
కరోనాకు ముందు ఇది కేవలం సింగిల్‌ లైన్‌ మార్గం. నిజామాబాద్‌ వరకు కనెక్టివిటీ ఉండటం, ఈ మార్గాన్ని వందే భారత్‌ వంటి రైళ్లు సైతం నడిచేలా ఇటీవల 100 కి.మీ. వేగం తట్టుకునేలా ట్రాక్‌ సామర్థ్యం పెంచారు. గతంలో ఖాజీపేట–బల్లార్షా సెక్షన్‌లోని రైళ్లు సికింద్రాబాద్‌ మీదుగా మహారాష్ట్ర వెళ్లేవి. దీనివల్ల చాలా ఇంధనం, సమయం వృథా అయ్యేవి. ఈ మార్గం పూర్తి కావడంతో కరోనా కాలంలో పెద్దపల్లి–నిజామాబాద్‌ రూట్‌కు డిమాండ్‌ బాగా పెరిగింది. ప్రతీరోజు గ్రానైట్‌, బొగ్గు, బాయిల్డ్‌ రైస్‌, వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసే రైళ్ల ఫ్రీక్వెన్సీ గతంలో ఎన్నడూ లేనంతగా గణనీయంగా పెరిగింది. ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో సరుకు రవాణా రైళ్ల ద్వారా అత్యధికంగా ఆదాయం తీసుకువచ్చే రైల్వే మార్గాల్లో పెద్దపల్లి–నిజామాబాద్‌ ఒకటిగా ఆవిర్భవించింది.

చెప్పుకోదగ్గ రైళ్లేవీ లేవు
కానీ, ఈ మార్గంలో ప్రయాణికుల రైళ్లు మాత్రం చెప్పుకోదగ్గవి ఏమీలేవు. ఢిల్లీ, కోల్‌కతా, విశాఖపట్టణం, వారణాసి, బెంగళూరు, చైన్నె, తిరువనంతపురం నగరాలకు రైళ్లు నడపాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మార్గంలో కేవలం రెండు పుష్‌పుల్‌ (డెమూ, మెమూ) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, కాజీపేట నుంచి దాదర్‌ ముంబై వీక్లీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి నుంచి కరీంనగర్‌ బై వీక్లీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ మార్గంలో కోరుట్ల, మెట్‌పల్లి, ఆర్మూర్‌ లాంటి ఎక్కువ జనాభా కలిగిన పట్టణాలు కూడా ఉన్నాయి.

భవిష్యత్తులో డబ్లింగ్‌ పూర్తయితే ఇటు ముంబై వైపు, అటు సికింద్రాబాద్‌ వైపు రైళ్ల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు అటల్‌ మిషన్‌ ఫర్‌ రిజునవేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌మిషన్‌ (ఏఎంఆర్‌యూటీ) పథకం కింద ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌కు రూ.26.6 కోట్లు, రామగుండంకు రూ.26.50 కోట్లు, పెద్దపల్లికి రూ.20 కోట్లు మంజూరయ్యాయి. అయితే, ఈ పనులను రెండు దఫాల్లో చేపట్టనున్న కేంద్రం.. తొలిదశలో కరీంనగర్‌, రామగుండం స్టేషన్లను అభివృద్ధి చేసి, మరికొన్ని నెలల్లోనే పెద్దపల్లిలోనూ పనులు ప్రారంభించనుంది.

ఉమ్మడి జిల్లా ప్రజలకు ఉపయుక్తం
చీకురాయి వద్ద రైల్వేస్టేషన్‌ నిర్మించతలపెట్టడం అభినందనీయం. రెండు మార్గాలు కలిసేచోట స్టేషన్‌ నిర్మించడం వల్ల మా ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇది ఒక్క పెద్దపల్లి ప్రజలకే కాకుండా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

– మేకల శ్రీనివాస్‌, చీకురాయి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement