ఓబులవారిపల్లె-కృష్ణపట్నం టన్నెల్ పనులకు బ్రేక్ | Break | Sakshi
Sakshi News home page

ఓబులవారిపల్లె-కృష్ణపట్నం టన్నెల్ పనులకు బ్రేక్

Published Fri, Feb 20 2015 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

Break

రాజంపేట: ఓబులవారిపల్లె- కృష్ణపట్నం మార్గం రైల్వేలైన్‌కు సంబంధించిన టన్నెల్ నిర్మాణ పనులు ఆది నుంచి అడ్డంకులతో ముందుకు సాగడంలేదు. ఈ మార్గంలో టన్నెల్ నిర్మించేందుకు 2007లో చెన్నై రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్‌వీఎన్‌ఎల్) టెండర్లు పిలిచింది. అప్పట్లో ముంబయికి చెందిన దీపికా నిర్మాణ సంస్థ ఈ పనులను దక్కించుకుని పనులు మొదలుపెట్టింది. ఈ మార్గంలోని వెలుగొండ అడవుల్లో కొండను తవ్వినప్పుడు వచ్చిన మట్టి, ఎర్త్ పనులకు సంబంధించిన విషయంలో ఆర్‌వీఎన్ ఎల్‌తో కాంట్రాక్టు సంస్థకు విభేదాలు పొడసూపాయి.
 
 దీనికితోడు టెండర్లు పిలిచినప్పటి రేట్లతో తాము పనులు కొనసాగిస్తే నష్టపోతామని అందువల్ల ఈ పనులను చేయలేమని సంస్థ చేతులెత్తేసింది. దీంతో ఆర్‌వీఎన్‌ఎల్ గత ఏడాది చివర్లో ఈ పనులకు తిరిగి టెండర్లు నిర్వహించింది. అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీకి సంబంధించిన హెచ్‌ఈడబ్ల్యు నిర్మాణ సంస్థ టెండర్లు దక్కించుకుంది. కృష్ణపట్నం - ఓబులవారిపల్లె రైలుమార్గంలో ఏడు కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మాణం కావాల్సి ఉంది. ఈ దశలో తొలుత టెండర్లు దక్కించుకుని ఆ తర్వాత పనులు నిలిపేసిన దీపికా సంస్థ ఆర్‌వీఎన్‌ఎల్ నుంచి తమకు కోట్లాది రూపాయల డబ్బు రావాల్సి ఉందని కోర్టును ఆశ్రయించింది.
 
 దీంతో ఈ పనులను దక్కించుకున్న హెచ్‌ఈడ బ్ల్యు సంస్థ పనులు మొదలుపెట్టేందుకు వీలు లేకుండా పోయింది. టన్నెల్ వ్యవహారం కోర్టులో ఉన్నందున పనులకు బ్రేక్ పడిందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. కోర్టులో కేసు పరిష్కారం కావడంతో పాటు ఈ మార్గంలో పనులకు పూర్తిస్థాయిలో నిధులు విడుదలైతే తప్ప టన్నెల్ పనులు ముందుకు సాగే పరిస్థితులు కనిపించడం లేదు. ఈనెల 23న రైల్వేశాఖమంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లోనైనా అధిక నిధులు కేటాయిస్తారేమోననే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
 
 ఇతర పనులు ముమ్మరంగా..
 ఇదిలా ఉండగా ఈ మార్గంలో ఉన్న మొత్తం మూడు రీచ్‌లలో జర గాల్సిన మిగతా పనులను ఆర్‌వీఎన్‌ఎల్ వేగవంతంగా చేపడుతోంది. నెల్లూరు జిల్లా పరిధిలోని ఎర్త్‌వర్క్ పనులు పూర్తయ్యాయి. ఓబులవారిపల్లె రైల్వేస్టేషన్ నుంచి నేతివారిపల్లె వరకు రైలు పట్టాలు వేసేందుకు అవసరమైన ఎర్త్ వర్క్ పనులను 17 కిలోమీటర్ల మేర పూర్తి చేశారు. 38 చిన్న వంతెనలు, 8 పెద్ద వంతెనలు పూర్తి కానున్నాయి.
 
 పెరిగిన అంచనా వ్యయం..
 కృష్ణపట్నం రైల్వేలైను 2005-06లో మంజూరైనప్పుడు రూ.930 కోట్ల అంచనాతో రైల్వే నిర్మాణ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం అంచనా వ్యయం భారీగా పెరిగిపోయింది. టన్నెల్ నిర్మాణ వ్యయం కూడా రూ.400 కోట్లు దాటిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఓబులవారిపల్లె - కృష్ణపట్నం మార్గంలో టన్నెల్ నిర్మాణ పనులకు మోక్షం లభించేదెప్పుడు అనే చర్చ జరుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement