కర్నూలు(రాజ్‌విహార్) : రైల్వే లైనుపై రోడ్డు క్రాసింగ్‌లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. పలు చోట్ల గేట్లను ఏర్పాటు చేయకపోవడం, మరికొన్ని చోట్ల కాపాలాదారులను నియమించకపోవడం వంటి కారణాలు ప్రయాణికులకు శాపంగా మారాయి. ప్రయాణికులకు భద్రత దృష్ట్యా రైల్వే శాఖ వీటిపై ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో జిల్లా వాసులు భయాందోళన మధ్య కాలం గడుపుతున్నారు. రోడ్డు లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాల నివారణకు రైల్వే గేటు తొలి మెట్టు లాంటిది. కాని వీటిని ఏర్పాటు చేయడంలో రైల్వేశాఖ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.
గేటు లేక, కాపలాదారుడు కరువై రైలు వస్తుందన్న విషయాన్ని తెలుసుకోకుండా పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పొతున్నారు. మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి. అయినా పాలకుల్లో స్పందన కరువైంది. గతంలో ఏడాదిన్నర పాటు కర్నూలుకు చెందిన ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి రైల్వే శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినా ఈ సమస్యకు పరిష్కారం అభించలేదు. కర్నూలులోని గుత్తి రోడ్డు, కృష్ణానగర్‌లతోపాటు జిల్లాలోని మరిన్ని చోట్ల ఈ సమస్యలను పరిష్కరిస్తాని హామీ ఇచ్చారు.
పలుచోట్ల రోడ్ ఓవర్ బ్రిడ్జీ (ఆర్‌ఓబీ), రోడ్ అండర్ బ్రిడ్జీ (ఆర్‌యూబీ)ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినా ఫలితం లేదు. గతేడాది జూలై 24వ తేదీన మెదక్ జిల్లాలోని మూసాయిపేట వద్ద పట్టాలు దాటుతున్న స్కూలు బస్సును రైలు ఢీకొనడంతో 15 మంది విద్యార్థులు చనిపోయిన దుర్ఘటన సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. దీంతో హడావిడి చేసిన రైల్వే శాఖ రైల్వే లైన్లపై రోడ్డు క్రాసింగ్‌లు లేకుండా చూస్తామని ప్రకటించింది. కాని ఏడు నెలలు గడిచినా ఆ హామీ ఇప్పటివరకు నెరవేర్చకపోవడం గమనార్హం.
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రైల్వే -రోడ్డు క్రాసింగ్ వద్ద గతంలో జరిగిన ప్రమాదాల్లో 17 మంది అమాయక ప్రజలు చనిపోయారు. వందల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడుతూనే ఉన్నాయి. ప్రయాణికులు, ప్రజల భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉండడంతో ఆందోళనలు తప్పడం లేదు. ఇంకెంత కాలం ఈ సమస్యతో గడపాలో అర్థం కాని పరిస్థితి.
కొన్ని దుర్ఘటనలు
కోసిగి మండలం ఐరన్‌గల్లు గ్రామం వద్ద 2005 మే 18వ తేదీన పట్టాలు దాటుతున్న ఆటోను రైలు ఢీ కొనడంతో ఐదుగురు వ్యవసాయ కూలీలు చనిపోయారు. అక్కడ గేటు, కాపలాదారుడు లేకపోవడంతో వ్యవసాయ పనులకు వెళ్తున్న కూలీల ఆటోను రైలు ఢీకొంది. అయితే, ఇప్పటికీ ఇక్కడ గేటును ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.
కల్లూరు మండలం చెల్ల మల్లాపురం గ్రామం వద్ద 2012 మార్చి 31వ తేదీన పట్టాలు దాటుతున్న ఆటోను రైలు ఢీ కొని ఐదుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. అక్కడ పట్టాల వద్ద గేటు, కాపలాదారుడు లేని కారణంగా వివాహ వేడుకలకు వెళ్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన డ్రమ్స్ వాయిద్యకారులు చనిపోయారు.
నంద్యాల పరిధిలో కాపలాలేని గేట్లు అనేకం ఉన్నాయి. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో రెండేళ్ల క్రితం వృద్ధురాలు మృతిచెందగా, నాలుగు నెలల క్రితం కోవెలకుంట్లకు చెందిన హుసేన్ బాష మృతి చెందినట్లు జీఆర్‌పీ అధికారులు చెబుతున్నారు. మేతకు వెళ్లిన పశువులు, ఎద్దులు మృతి చెందగా వాటిని రక్షించబోయి పశువుల కాపర్లు గాయపడిన సందర్భాలున్నాయి.
2009లో బేతంచెర్లలో జరిగిన చెన్నకేశవ స్వామి తిరునాలతో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్లేందుకు గేటు దాటుతున్న హనుమాన్ నగర్ బాలికను రైలు ఢీ కొనడంతో అక్కడిక్కడే మృతి చెందింది.
డోన్ మండలం బి. రామదుర్గం వద్ద రైండేళ్ల క్రితం రెల్వే ట్రాక్‌కు గేటు లేని కారణంగా పట్టాలు దాటుతున్న ఆర్టీసీ డోన్ డిపో బస్సును రైలు ఢీకొంది. ఫలితంగా డ్రైవర్ జంగాల రాముతోపాటు బట్టల వ్యాపారి ఈశ్వరయ్య చనిపోయారు.
వెల్దుర్తి మండలం గుంటపల్లి వద్ద ఏడేళ్ల కిత్రం పట్టాలు దాటుతూ ఇద్దరు చనిపోగా సూదెపల్లె వద్ద ఐదేళ్ల క్రితం పట్టాలు దాటుతూ మరొకరు చనిపోయారు. జిల్లాలోని అనేక చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో గేట్లు లేని కారణంగా వందల సంఖ్యలో మూగజీవాలు (బర్రెలు, ఎద్దులు, గొర్రెలు తదితర) మృత్యువాత పడ్డాయి.
ప్రమాదాలకు ‘గేట్లు’ వేయరా?
Published Thu, Feb 26 2015 2:49 AM | Last Updated on Thu, Aug 30 2018 3:51 PM
Advertisement
Advertisement